అద్దె బస్సు.. మిస్సు

ABN , First Publish Date - 2022-09-27T09:09:38+05:30 IST

ఆర్టీసీ చెల్లించే అద్దెలు గిట్టుబాటు కావడం లేదంటూ నెల రోజుల్లోనే సుమారు 750కి పైగా అద్దె(హైర్‌)బస్సులను యజమానులు ఉపసంహరించుకున్నారు.

అద్దె బస్సు.. మిస్సు

  • ఆర్టీసీలో 750 అద్దె బస్సుల ఉపసంహరణ
  • అద్దెలు గిట్టుబాటు కావట్లేదంటున్న యజమానులు
  • బస్సుల కొరతతో గ్రామీణ ప్రాంత ప్రయాణికుల ఇక్కట్లు
  • కొత్తగా అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు.. స్పందన అంతంతే

హైదరాబాద్‌, సెస్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ చెల్లించే అద్దెలు గిట్టుబాటు కావడం లేదంటూ నెల రోజుల్లోనే సుమారు 750కి పైగా అద్దె(హైర్‌)బస్సులను యజమానులు ఉపసంహరించుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులకు కొరత ఏర్పడింది. గతంలో మూడు, నాలుగు  బస్సులు నడిచిన రూట్లలో ప్రస్తుతం ఒకటి లేదా రెండు బస్సులనే నడుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి వచ్చి వెళ్లే రూట్లు మినహా ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. రోజుకు 300 నుంచి 400 కిలోమీటర్లు నడిపించే ప్రాతిపదికన, సరాసరి కిలోమీటరుకు రూ. 11 నుంచి రూ.12 చొప్పున బస్సుల యజమానులకు ఆర్టీసీ అద్దె చెల్లిస్తోంది. నెలకు సుమారుగా రూ.1.20 లక్షల నుంచి 1.40 లక్షల వరకు ఒక్కో బస్సుకు ఖర్చు చేస్తోంది. అయితే, అద్దె మొత్తాల చెల్లింపులో ఆర్టీసీ తీవ్ర జాప్యం చేస్తోందని, దీనికితోడు అదనంగా ఖర్చయిన ఇంధన వ్యయాన్ని తమకు చెల్లించే మొత్తం నుంచి మినహాయిస్తోందని యజమానులు ఆరోపిస్తున్నారు. 


డ్రైవర్‌, క్లీనర్‌ వేతనాలకు రూ.40వేలు, బ్యాంకు రుణం వాయిదాకు రూ.1.10 లక్షలు, నిర్వహణకు మరో రూ.30వేలు వ్యయమవుతోందని చెబుతున్నారు. దీనికితోడు డీజిల్‌ అత్యధికంగా వినియోగించారనే కారణంతో నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు కోతలు విధిస్తున్నట్టు పేర్కొంటున్నారు. గ్రామీణరోడ్లపై నిర్దేశిత కేఎంపీఎల్‌ రాదని తెలిసినప్పటికీ ఆర్టీసీ అధికారులు కోతలు అమలు చేయడంతో నష్టాలను భరించలేక అద్దె బస్సులను ఉపసంహరించుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికే 750కి పైగా అద్దె బస్సులను వాటి యజమానులు ఆర్టీసీ నుంచి ఉపసంహరించుకున్నారు. రెండు నెలల్లో మరో 500 నుంచి 600 బస్సులను ఉపసంహరించుకునేందుకు యజమానులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు

అనూహ్యంగా పలువురు యజమానులు అద్దె బస్సులను ఉపసంహరించుకోవడంతో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అద్దె ప్రాతిపదికన 954 బస్సులను సమకూర్చుకునేందుకు టెండర్లను ఆహ్వానించింది. కానీ, ఈ టెండర్లకు స్పందన అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 476 అద్దె బస్సుల కోసం ఆర్టీసీ దరఖాస్తులు ఆహ్వానించగా, కేవలం 29 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో 478 బస్సుల కోసం దరఖాస్తులు కోరితే.. కేవలం 368 మాత్రమే వచ్చినట్లు తెలిసింది. దీంతో మరో 557 బస్సుల కోసం నిబంధనలు సడలించే విషయాన్ని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు.

Read more