గొర్రెల పంపిణీకి మోక్షం
ABN , First Publish Date - 2022-08-22T06:03:16+05:30 IST
రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులు గొర్రెల పంపిణీకి కసరతు మొదలుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత (బి-జాబితా) లబ్దిదారుల వివరాలను ఇప్పటికే ఈ-ల్యాబ్‌లో నమోదు చేశారు. దీంతో గొర్రెల పెంపకందారుల మూడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనున్నది.
రెండోవిడత సరఫరాకు మార్గం సుగమం
అక్టోబర్ నెలాఖరునాటికి అందజేత
జారీ అయిన కొత్త మార్గదర్శకాలు
ఫలించిన మూడేళ్ల నిరీక్షణ
ఏర్పాట్లలో అధికారులు
లబ్ధిదారుల పేర్లు ప్రత్యేక యాప్‌లో నమోదు
ప్రారంభమైనకొత్త డీడీల స్వీకరణ
రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులు గొర్రెల పంపిణీకి కసరతు మొదలుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత (బి-జాబితా) లబ్దిదారుల వివరాలను ఇప్పటికే ఈ-ల్యాబ్‌లో నమోదు చేశారు. దీంతో గొర్రెల పెంపకందారుల మూడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనున్నది.
హనుమకొండ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : గొల్ల కురుమల సంక్షేమంతో పాటు మాంసం ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017-18 సంవత్సరంలో తొలివిడత ఎంపికైన లబ్ధిదారులకు గొర్రెలను అందించారు. రెండో విడతపై మూడేళ్లుగా సందిగ్ధం నెలకొన్నది. కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రకటనలకే పరమితమైంది తప్ప.. పథకాన్ని ఆచరణలో పెట్టలేదు. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు రెండో విడత గొర్రెల పంపిణీపై మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
గతంలో అక్రమాలు
మొదటి విడత గొర్రెల పంపిణీ సందర్బంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో గొర్రెలున్నవారు మందను పెంపుచేసుకోగా, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు గొర్రెల మంద లేనివారు గొర్రెలకు బదులుగా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందుకు కొందరు అధికారులు మధ్యవర్తులైన నాయకులు సహకరించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల రాయితీపై గొర్రెలను పొందినవారు వాటిని అమ్మి సొమ్ము చేసుకోగా, మరికొంతమంది గొర్రెలు రాకున్నా కేవలం ఫొటోలు సమర్పించి డబ్బులను తీసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. మొదటి విడతలో మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చారు. 75శాతం గొర్రెల యూనిట్లను మాత్రమే కొనుగోలు చేసి వంద శాతం కొన్నట్టు గణాంకాలు అధికారులు ప్రభుత్వానికి గణాంకాలు సమర్పించారు. లబ్ధిదారులు, అధికారులు కుమ్మక్కయి గొర్రెలను కొనుగోలు చేయకుండానే కొన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్టు స్పష్టమౌతోంది. అంతేకాకుండా అధికారులు ముందుస్తుగానే విక్రయదారులతో ఒప్పందాలు కుదుర్చుకొని లబ్ధిదారులకు అధిక ధరలకు అంటగట్టినట్టూ ఆరోపణలు ఉన్నాయి. కమీషన్ ప్రాతిపదికన ఒక్కో పశువైద్యాధికారి రూ.లక్షలు వెనకేసుకున్నారనే విమర్శలున్నాయి.
ముఖ్యంగా మొదటి విడత పంపిణీ సమయంలో పని చేసిన అధికారులు ఇటీవల జోనల్ బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వారి అక్రమాలపై లబ్ధిదారులు తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. దాణా పంపిణీలోనూ అక్రమాలు జరిగినట్టు సమాచారం. దీనిపై పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా అక్రమాలు జరిగిన మాట వాస్తవేమనని నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం రెండో విడత గొరర్రెల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. పథకం అమలులో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఎట్టకేలకు అనుమతిచ్చింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రుణం మంజూరు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రెండవ విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.
పగడ్బందీగా...
మొదటి విడత గొర్రెల పంపిణీలో పలు అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రెండో విడతలో అక్రమాలకు తావులేకుండా పథకంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గతంలో లబ్ధిదారుల తరుపున మధ్యవర్తులు డీడీలు తీసి యూనిట్లు పొందే అవకాశం ఉండేది. పైగా గొర్రెలను రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. వీటిని అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టనున్నది. ఇందులోభాగంగా ఇప్పటికే రెండో విడత గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. ఇందులో జిల్లా, మండలం, గ్రామంతో పాటు లబ్ధిదారులకు ప్రత్యేకంగా కోడ్స్‌ను కేటాయించారు.
లబ్ధిదారుల ఫొటోతో పాటు కొనుగోలు చేసిన గొర్రెల ఫొటోలను ఇందులో నమోదు చేస్తారు. ఏడాదిపాటు గొర్రెలను విక్రయించకుండా పెంపకం చేపట్టేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. లబ్ధిదారుల తమ వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నుంచి పాలనాధికారి ఖాతాకు నగదు బదిలీ చేయాలి. గొర్రెల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లా స్థాయిలో అవగాహన కలిగించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన జీవాలు ఇక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక మృత్యువాతపడ్డాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
పెరిగిన యూనిట్ ధర
గొర్రెల ధరలు పెరగడంతో తొలివిడత గొర్రెలను పంపిణీ చేసే సమయంలో ఉన్న యూనిట్ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో యూనిట్ ధర రూ.1.25 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.1.75 లక్షలకు పెంచారు. గతంలో లబ్ధిదారుడు రూ.31,250 డీడీ తీసి సంబంధిత పశువైద్యాధికారులకు అందచేస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరించి యూనిట్లు కొనుగోలు చేసి పంపిణీ చేసేది. తాజాగా లబ్ధిదారులకు గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. దానితో పాటు పూర్తి వివరాలతో లబ్ధిదారులే నేరుగా తమ ఖాతా నుంచి జిల్లా పాలనాధికారి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన యూనిట్ వ్యయం మేరకు లబ్ధిదారుడు రూ.43,750 ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్లో 20 ఆడగొర్రెలు, ఒక పొట్టేలు అందచేస్తారు. ఈనెల 21 శనివారం నుంచి సెప్టెంబర్ నెలాఖారులోగా లబ్ధిదారులు తమ వాటాను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.