రంగశాయిపేట - కరీమాబాద్‌ రోడ్డుకు మహర్దశ

ABN , First Publish Date - 2022-01-21T05:44:30+05:30 IST

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రంగశాయిపేట-కరీమాబాద్‌ రోడ్డుకు నయాలుక్‌ రాబోతోంది. ఈ మార్గాన్ని స్మార్ట్‌ సిటీ నిధులతో విస్తరించి ఆధునీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రాథమిక పనులను ప్రారంభించారు.

రంగశాయిపేట - కరీమాబాద్‌ రోడ్డుకు మహర్దశ

మొదలైన స్మార్ట్‌సిటీ రోడ్డు పనులు.. 

రూ.22 కోట్లతో 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం 

తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు


శంభునిపేట, జనవరి 20: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రంగశాయిపేట-కరీమాబాద్‌ రోడ్డుకు నయాలుక్‌ రాబోతోంది. ఈ మార్గాన్ని స్మార్ట్‌ సిటీ నిధులతో విస్తరించి ఆధునీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రాథమిక పనులను ప్రారంభించారు. 

రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌రోడ్‌ జంక్షన్‌ నుంచి కరీమాబాద్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వరకు 3.1 కిలోమీటర్ల దూరం మేర రూ. 22 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో రోడ్డును ఆఽధునీకరించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా 5 ఫీట్ల మేర డ్రైనేజీ ఏర్పాటు చేసి దాని పై ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ వెలుగులతో సుందరీకరించనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో  ఖర్చు చేయనున్నాయి.  గవిచర్ల క్రాస్‌రోడ్‌, దసరా రోడ్‌, సుభాష్‌ విగ్రహం, ఉర్సు చమన్‌ జంక్షన్లలో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. 

ఇందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు సిద్ధం చేసుకున్నారు. మిషన్‌ భగీరథ పైప్‌లైను పనులు పూర్తి కావడంతో పనులు మొదలు పెట్టారు. విద్యుత్‌ లైన్‌లను సవరించటానికి విద్యుత్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. రంగశాయిపేటలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించే పనులను వేగిరం చేశారు. సుమారు 9 నెలల పాటు రోడ్డు పనులు కొనసాగనున్నాయి. 

ఆర్‌అండ్‌బీ పరిధిలోని ఈ రోడ్‌ ప్రస్తుతం 20 ఫీట్ల మేర ఉంది. మాస్టర్‌ ప్లాన్‌లో ఈ మార్గం 60 ఫీట్ల రోడ్డుగా పేర్కొని ఉంది. దాని ప్రకారమే జీడబ్ల్యూఎంసీ అధికారులు విస్తరణ కోసం గతంలో మార్కింగ్‌ చేశారు.  అయితే 60 ఫీట్ల మేర రోడ్డును విస్తరిస్తే తాము ఇళ్లను కోల్పోతామని  పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు మొర పెట్టుకోవడంతో అధికారులు రోడ్డు విస్తరణలో మార్పులు చేశారు. రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌రోడ్డు జంక్షన్‌ నుంచి ఉర్సు దర్గా వరకు 40 ఫీట్లు, దర్గా నుంచి కరీమాబాద్‌ దసరా రోడ్‌ వరకు 50 ఫీట్లు, అక్కడి నుంచి శాకరాసికుంట ఫ్లై ఓవర్‌ వరకు 60 ఫీట్లుగా రోడ్డు విస్తరించాలని బల్దియా అధికారులు ప్రతిపాదించారు. 

ఇదిలావుండగా, రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌రోడ్డు నుంచి ఉర్సు చిన్న మహంకాళి గుడి వరకు రోడ్డును 40 ఫీట్లకు బదులు 50ఫీట్ల మేర విస్తరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోడ్డులో ఇప్పటికే అనేకమంది సెట్‌బ్యాక్‌ అయి ఇళ్లు నిర్మించుకున్నందున ఇక్కడ విస్తరణ నష్టం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 40 ఫీట్ల రోడ్డులో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తే రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఈ విషయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పునరాలోచన చేయాలని అంటున్నారు. 

ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న స్మార్ట్‌సిటీ రోడ్డుతో ఈ ప్రాంతానికి కొత్త కళ రానుంది. ఒకప్పుడు పాతబస్తీగా పేరుపొందిన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోంది. అండర్‌రైల్వే గేటుపై ‘వై’ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంతో వరంగల్‌, హనుమకొండకు రాకపోకలు సులువుగా మారాయి.  దీంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా మారుతోంది. ఈ క్రమంలో స్మార్ట్‌సిటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయితే పాతబస్తీ రూపురేఖలే మారుతాయని అంటున్నారు.


త్వరితగతిన పనులు పూర్తిచేయాలి :

గుండు చందన, 42వ డివిజన్‌ కార్పొరేటర్‌

రంగశాయిపేట-కరీమాబాద్‌ స్మార్ట్‌సిటీ రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు మొదలుకావడంతో ఆనందంగా ఉంది. వరంగల్‌-ఖమ్మం జాతీయ  రహదారికి ఆనుకున్న ఉన్న ఈ రోడ్డును ఆధునీకరించాలని గతంలోనే నేను జీడబ్ల్యుఎంసీ కౌ న్సిల్‌ సమావేశంలో లేవనెత్తాను. ఈ రోడ్డు ఐదు డివిజన్ల గుండా వెళ్తుంది. దీనిని విస్తరించి అభివృద్ధి చేస్తే జాతీయరహదారిపై ట్రా ఫిక్‌ ఒత్తిడి తగ్గుతుందని, ప్రత్యామ్నాయంగా మారుతుందని నాతోపాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లం కలిసి మేయర్‌కు,  కమిషనర్‌కు విన్నవించాం. వారు సానుకూలం గా స్పందించడమే కాకుండా, పనుల ప్రారంభానికి ఆదేశాలు ఇవ్వడం హర్షణీయం. పనులు చేపట్టే లీ అసోసియేట్స్‌ వారు.. ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం.  



Updated Date - 2022-01-21T05:44:30+05:30 IST