రాజగోపాల్‌ రెడ్డీ గారూ... నాకు అవకాశం ఇవ్వండి

ABN , First Publish Date - 2022-10-17T09:34:40+05:30 IST

‘రాజగోపాల్‌ రెడ్డి గారూ.. మునుగోడు ఉప ఎన్నికలో నాకు మద్దతు ఇవ్వండి.

రాజగోపాల్‌ రెడ్డీ గారూ... నాకు అవకాశం ఇవ్వండి

మునుగోడును మరో అమెరికా చేస్తా: కేఏ పాల్‌

చండూరు, అక్టోబరు 16: ‘రాజగోపాల్‌ రెడ్డి గారూ.. మునుగోడు ఉప ఎన్నికలో నాకు మద్దతు ఇవ్వండి. 60 నెలల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లో చేసి చూపిస్తా’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్‌ వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్‌తో ఆయన బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులతో మాట్లాడేందుకు ఆదివారం ఆయన చండూరు వచ్చారు. బీజేపీ అఽభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, అక్కడికి వచ్చి ఆయనను ఆలింగనం చేసుకుని మాట్లాడారు. కేఏ పాల్‌ను చూడగానే బీజేపీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి కేఏ పాల్‌ కొంతదూరం నడిచారు.


అనంతరం ఎన్నికల అధికారిని కలవడానికి వెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో అధికారులు లేకపోవడంతో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డిని కోరానన్నారు. తనను గెలిపిస్తే మునుగోడును రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు ఓట్లను కొనుక్కుంటున్నాయని విమర్శించారు. ఒకప్పుడు అడవిగా ఉన్న హైదరాబాద్‌ను తనే అభివృద్ధి చేశానన్నారు. మునుగోడును మరో అమెరికా చేస్తానన్నారు. ఇక్కడ కులగజ్జి, కుట్రలు, కుతంత్రాలు పోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలన్నారు. ఆరు నెలల్లో ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-10-17T09:34:40+05:30 IST