రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆగస్టు మొదటి వారంలో?

ABN , First Publish Date - 2022-07-26T08:17:09+05:30 IST

నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు సంబంధించి క్రమంగా స్పష్టత వస్తోంది.

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా  ఆగస్టు మొదటి వారంలో?

కాంగ్రెస్‌ నేతలకు కోమటిరెడ్డి స్పష్టీకరణ!

నేటి నుంచి మునుగోడు నేతలతో భేటీలు

కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ మునుగోడు’

టీఆర్‌ఎస్‌లో చేరిన ‘గట్టుప్పల్‌’ నేతలు

నేడు గట్టుప్పల్‌లో ‘కేసీఆర్‌ కృతజ్ఞత సభ’

కాంగ్రెస్‌ కీలక నేతలకు కోమటిరెడ్డి స్పష్టీకరణ!

నేటి నుంచి మునుగోడు నేతలతో భేటీలు

తన రాజీనామా నియోజకవర్గ అభివృద్ధికి.. 

ఉపయోగపడుతుందని చెప్పే ప్రయత్నం


నల్లగొండ, జూలై 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు సంబంధించి క్రమంగా స్పష్టత వస్తోంది. ఆగస్టు మొదటి వారంలో రాజీనామాకు రాజగోపాల్‌రెడ్డి సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి మండలాల వారీగా కాంగ్రెస్‌ నేతలు, తన అభిమానులతో హైదరాబాద్‌లో విడివిడిగా సమావేశం కావాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. అందరితో సంప్రదింపులు పూర్తి చేసి  తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం తరువాత రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన రాజీనామా అస్త్రం వల్లే గట్టుప్పల్‌ వాసుల చిరకాల వాంఛ అయిన మండలం ఏర్పాటు సాకారమైందని, కొద్ది రోజుల్లోనే వందల కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో ప్రారంభమవుతాయని అనుచరుల వద్ద రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావిస్తున్నారు. దీనికితోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారంతో జరిగే ఉప ఎన్నిక పోరాటం నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.


ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లి  మెప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతోనే సాధ్యమని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, అడ్డదారిలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వ్యక్తులకు అధికారం తెచ్చిపెట్టేందుకు తాను ఆయుధంగా మారలేనని రాజగోపాల్‌రెడ్డి అన్నట్లు తెలిసింది. తాను బీజేపీలో చేరడం ఖాయమన్న అభిప్రాయాన్నే  ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. 


టీఆర్‌ఎ్‌సలోకి గట్టుప్పల్‌ నేతలు..

అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ‘ఆపరేషన్‌ మునుగోడు’ను కొనసాగిస్తోంది. గట్టుప్పల్‌ మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడెం కైలాసంతోపాటు ఇతర సభ్యులు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతోనే తమ కల సాకారమైందని, అందుకే మంగళవారం గట్టుప్పల్‌లో ‘కేసీఆర్‌ కృతజ్ఞత సభ’ను నిర్వహిస్తామని ఇడెం కైలాసం ప్రకటించారు. ఈ సభతో నియోజకవర్గంలో బహిరంగ సభలకు మంత్రి జగదీశ్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.  ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువని, కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ పాలనలో ఇటువంటి నేతల ఎదుగుదలతో సరిసమానంగా ఈ నియోజకవర్గంలో ఫ్లోరోసిస్‌ భూతం ఎదిగిందని కైలాసం చేరిక సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథతో ఇంటింటికీ రక్షిత మంచినీరు అందిస్తున్నారని అన్నారు.  మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ బృందాలు మునుగోడులో పరిస్థితులపై వివరాల సేకరణ ప్రారంభించాయి. సోమవారం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో కీలక అధికారులు సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే సిటింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఒక ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే చేయించుకోవడంతోపాటు తనకు సన్నిహితంగా ఉండే బీజేపీ కీలక నేతకు చెందిన మీడియా సంస్థ ద్వారా కూడా స్థానికంగా సర్వే చేయించుకుంటున్నారు.


భిక్కనూరు సిద్దరామేశ్వరాలయంలో రాజగోపాల్‌రెడ్డి పూజలు 

కామారెడ్డి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామిని సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఇంటి దేవుడు సిద్దరామేశ్వరస్వామి అని,  ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు వచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికికోమటిరెడ్డి కుటుంబం కృషి చేసిందన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఆదివారం రాత్రే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏనుగు రవీందర్‌రెడ్డి నివాసానికి వచ్చారు. అక్కడ బీజేపీ జాతీయ నేత వివేక్‌, జిల్లా అధ్యక్షురాలు అరుణతారతోపాటు మరికొందరు జిల్లా నేతలతో సమావేశమై బీజేపీలో చేరికపై చర్చించినట్లు తెలిసింది. ఆగస్టు 15 లోపే బీజేపీలో చేరతానని, చేరికకు ముందు ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు వచ్చానని వారితో రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. 

Updated Date - 2022-07-26T08:17:09+05:30 IST