పుడింగ్ ఇన్ మింగ్ పబ్ కేసు ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా...

ABN , First Publish Date - 2022-04-04T16:35:02+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పుడింగ్ ఇన్ మింగ్ పబ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నలుగురు నిందితుల పేర్లను బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు

పుడింగ్ ఇన్ మింగ్ పబ్ కేసు ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పుడింగ్ ఇన్ మింగ్ పబ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నలుగురు నిందితుల పేర్లను బంజారాహిల్స్ పోలీసులు చేర్చారు. లేట్ నైట్ పార్టీలు నిర్వహిస్తూ... ఇష్టానుసారంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో నిన్న తెల్లవారుజామున పోలీసులు అకస్మాత్తుగా పబ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా అనిల్, అభిషేక్, కిరణ్ రాజ్, అర్జున్ పేర్లు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం అర్జున్ విరమచినేని, కిరణ్ రాజ్ పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనిల్, అభిషేక్ అరెస్ట్ అయ్యారు. మరికొద్దిసేపట్లో వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.


కాగా.. గతంలో కూడా ఈ పబ్‌లో బర్త్‌డే పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆధారాలున్నాయి. పోలీసుల తనిఖీలు ఉండవు. 24 గంటల మద్యం.. డ్రగ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పి నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. పామ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే పబ్‌లోకి అనుమతి లభిస్తుంది. డ్రగ్స్ కోసం మరో యాప్‌తో పాటు వాట్సప్ గ్రూప్ పెట్టినట్లు గుర్తించారు. పబ్ మేనేజర్ అనిల్‌కుమార్ కనుసన్నల్లో డ్రగ్స్ వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫోన్‌కు వచ్చిన OTPని నిర్ధారించుకున్న తర్వాతే డ్రగ్స్ అందజేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇవాళ మరి కొందరికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

Updated Date - 2022-04-04T16:35:02+05:30 IST