ప్రజారోగ్యం మరింత భద్రం!

ABN , First Publish Date - 2022-09-21T07:50:18+05:30 IST

ప్రజారోగ్య వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రజారోగ్యం మరింత భద్రం!

  • వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు
  • పీహెచ్‌సీలకు త్వరలో 751 మంది వైద్యులు
  • 40 మండలాల్లో కొత్తగా పీహెచ్‌సీలు
  • కొత్త జిల్లాలకూ డీఎంహెచోవో పోస్టులు 
  • 251 యూపీహెచ్‌సీలకు శాశ్వత వైద్య సిబ్బంది
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘా 

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనాభా ప్రాతిపదికన జిల్లా వైద్యాధికారి పోస్టుల భర్తీ, 751 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత వైద్యుల నియామకం, శిథిలావస్థకు చేరిన 43 పీహెచ్‌ఎసీలకు కొత్త భవనాల నిర్మాణం, మరో 372 పీహెచ్‌సీ భవనాలకు మరమ్మతుల నిర్వహణ ఇందులో ముఖ్యమైనవి. అంతేకాక, కొత్తగా 40 మండలాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తోంది. అలాగే, రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌ఎసీలు సీసీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 


జనాభా లెక్కన డీఎంహెచ్‌వోల పోస్టులు 

జనాభా ప్రాతిపదికన డీఎంహెచ్‌వో పోస్టుల సంఖ్య ను పెంచేందేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి పది జిల్లాలకే ప్రస్తుతం డీఎంహెచ్‌వో పోస్టులు ఉన్నాయి. కొత్త జిల్లాలకు ఆ పోస్టులు లేకపోవడంతో ఇన్‌చార్జిలతోనే పనులు సాగిస్తున్నారు. 2.94 లక్షల జనాభా ఉన్న ములుగు జిల్లాకు ఒక డీఎంహెచ్‌వో ఉండగా, 40 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌ జిల్లాకు కూడా ఒకరే ఉన్నారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఎనిమిది ఆరోగ్య జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఇటీవల ప్రకటించారు. దీని ప్రకారం రాష్ట్ర రాజధాని పరిధిలోనే ఎనిమిది మంది డీఎంహెచ్‌వోలు ఉంటారు. మరోపక్క, కొత్త జిల్లాలన్నింటా డీఎంహెచ్‌వో పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు  అంతా అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలో మొత్తం 38 డీఎంహెచ్‌వో పోస్టులు ఉంటాయి.  రాష్ట్రంలోని 865 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఇప్పటివరకు 400 పైచిలుకు పీహెచ్‌సీల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీసీ కెమెరాలన్నింటినీ హైదరాబాద్‌లోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో అన్ని పీహెచ్‌సీలపై రాష్ట్ర స్థాయిలో నిఘా ఉంటుంది. 


పీహెచ్‌సీలకు 751 మంది వైద్యులు

పీహెచ్‌సీల్లో నెలకొన్న వైద్యుల కొరత సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో నెల రోజుల్లో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని పీహెచ్‌సీలకు కొత్తగా 751 మంది శాశ్వత వైద్యులు రాబోతున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. నిజానికి, దసరా నాటికి వెయ్యి మంది వైద్యులను కొత్తగా అందుబాటులోకి తేవాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వైద్యుల నియామకాన్ని మెడికల్‌ బోర్డు వేగవంతం చేసింది. మరోపక్క, 251 యూపీహెచ్‌సీలకు శాశ్వత వైద్య సిబ్బందిని నియమించాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఈ యూపీహెచ్‌సీల్లో ఒక డాక్టర్‌, స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎమ్‌, సూపర్‌వైజర్‌ను శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని ప్రణాళికలు చేస్తున్నారు. 


40 మండలాల్లో కొత్త పీహెచ్‌సీలు 

ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో కొన్ని పాత, కొత్త మండలాలల్లో ఒక్క పీహెచ్‌సీ కూడా లేకుండాపోయింది. అలా ఒక్క పీహెచ్‌సీ కూడా లేని 40 మండలాలను వైద్యశాఖ గుర్తించింది. ఆయా మండలాల్లో నూతన పీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అదే విధంగా రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన 43 పీహెచ్‌సీలను గుర్తించారు. వాటిని కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో భవనాన్ని రూ.1.56 కోట్లతో నిర్మించనున్నారు. అంతేకాక, కొద్దిపాటి మరమ్మతులు అవసరమైన 372 పీహెచ్‌ఎసీ భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించారు. ఈ మరమ్మతుల నిర్వహణకు రూ. 43.18 కోట్లను విడుదల చేశారు. పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణ, మరమ్మతు పనులు జరగనున్నాయి. 


ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

పీహెచ్‌సీ భవనాల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలందరికీ లేఖలు రాశాం. పనులు త్వరగా పూర్తి చేయించుకోవాలని కోరాం. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఓ అధికారికి అప్పగించాం. ప్రజారోగ్య వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తున్నాం. అందులో భాగంగానే పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు పీహెచ్‌సీల్లో వైద్యులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు

Read more