ఎమ్మెల్సీ కవితకు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-09-29T08:44:28+05:30 IST

బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిరసన సెగ తగిలింది.

ఎమ్మెల్సీ కవితకు నిరసన సెగ

  • గో బ్యాక్‌ అన్న కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ నేతలు
  • వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రంగారెడ్డి జిల్లాకోర్టుల ఆవరణలో ఘటన

ఎల్‌బీనగర్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిరసన సెగ తగిలింది. రంగారెడ్డి జిల్లా కోర్టుల ఆవరణలో బుధవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కవితను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయవాదులు ప్రయత్నించారు. న్యాయవాదుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ నేతలు శశికాంత్‌, రాంబాబు ఆరోపించారు. ఎంతో మంది న్యాయవాదులు అమరులైతే పట్టించుకోని కవిత.. ఇప్పుడు బతుకమ్మ ఆడటానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇది కోర్టు ప్రాంగణమా? లేక టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయమా? అని నిలదీశారు. కవిత గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించి.. వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 


అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే గతంలో రూ.100 కోట్లను కేటాయించారని గుర్తు చేశారు. రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిర్వహించిన దేవీ వైభవ నృత్యోత్సవానికి కూడా కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు ఆట, పాటలతో అలరించారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు మంద జగన్నాథం, కేఎం సహాని పాల్గొన్నారు.

Read more