ట్రాన్స్‌కోను ప్రైవేటుకివ్వండి

ABN , First Publish Date - 2022-10-05T09:19:28+05:30 IST

విద్యుత్తు వ్యవస్థలను ప్రైవేటీకరించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం..

ట్రాన్స్‌కోను ప్రైవేటుకివ్వండి

  • మేము పీజీసీఐఎల్‌ను అప్పగిస్తున్నాం
  • మీరు కూడా మా దారిలో నడవండి
  • ఆదాయాన్ని భారీగా పెంచుకోండి
  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
  • 35 ఏళ్ల తర్వాత ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ 
  • మళ్లీ ట్రాన్స్‌కోకు బదిలీ అవుతుందని వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వ్యవస్థలను ప్రైవేటీకరించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించి రోజుకో ఉత్తర్వు ఇస్తోంది. ఇప్పటిదాకా విద్యుత్తు పంపిణీ వ్యవస్థ(డిస్కమ్‌)లపై గురి పెట్టగా.. తాజాగా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. ట్రాన్స్‌మిషన్‌ (ట్రాన్స్‌కో)లను ప్రైవేటుకు అప్పగించి, ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇప్పటికే డిస్కమ్‌లకు చెందిన 33/11 కేవీ సబ్‌స్టేషన్లన్నింటినీ ట్రాన్స్‌కోలకు బదిలీ చేయాలని కేంద్రం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. డిస్కమ్‌ల సబ్‌స్టేషన్లు ట్రాన్స్‌కో చేతికి వచ్చాక నిధులు సమకూర్చుకోవడానికి మానిటైజ్‌ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. తాజాగా 66 కేవీ, ఆ పైన ఉన్న ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించింది. ‘‘పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీజీసీఐఎల్‌)’కు చెందిన ఆస్తులను ప్రైవేటుకు అప్పగించాం. 2021 మే దాకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌(ఐఎన్‌వీఐటీ) ద్వారా రూ.7700 కోట్లను సమకూర్చుకున్నాం. రాష్ట్రాలు కూడా ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులను ప్రైవేట్‌ చేతిలో పెట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి’’ అని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీలకు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ లేఖలు రాసింది.


నిధుల కొరతను అధిగమించేందుకే..

ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు నిధుల కొరతను అధిగమించడానికి ఆ వ్యవస్థలను ప్రైవేట్‌ చేతిలో పెట్టడం మేలని కేంద్రం సూచించింది. దీనికి సేకరణ, కార్యకలాపాలు, బదిలీ(ఏవోఎంటీ) అనే  నామకరణం చేసి, ఈ విధానంతో ఆస్తులను నగదు రూపంలో మార్చుకోవాలని తెలిపింది. అయితే 35 ఏళ్ల ఒప్పందం అనంతరం ప్రైవేట్‌ సంస్థలు తాము తీసుకున్న ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ట్రాన్స్‌కోకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 

Read more