‘ప్రైవేటు’ దోపిడీ

ABN , First Publish Date - 2022-07-05T05:57:32+05:30 IST

‘ప్రైవేటు’ దోపిడీ

‘ప్రైవేటు’ దోపిడీ

షాపులుగా మారిన ప్రైవేట్‌ పాఠశాలలు..

బడుల్లోనే యూనిఫాం, నోట్‌, పాఠ్యపుస్తకాల విక్రయాలు

వ్యాపార సముదాయాలను మరిపిస్తున్న స్కూళ్లు

జిల్లాలో వందకు పైగా పాఠశాలలు, 30 వేల మంది విద్యార్థులు

అధిక ఫీజుల నియంత్రణపె అధికారుల జాడేది ?


మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, జూలై 4 : ప్రైవేటు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందించాల్సిన యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫాం, టై, బెల్టుల అమ్మకాలతో బుక్‌ స్టాల్స్‌, బట్టల దుకాణాలను మరిపిస్తున్నాయి. నర్సరీ మొదలుకొని 10వ తరగతి వరకు పదుల సంఖ్యలో స్టడీ మెటీరియల్‌ అంటూ వేలాది రూపాయలకు విక్రయిస్తూ ప్రతియేటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేస్తూ యథేచ్ఛగా పాఠశాలల్లోనే పుస్తకాలను విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ప్రైవేట్‌ పాఠశాలలుండగా వాటిల్లో సుమారు 30వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 


ఫీజులు ఎక్కువ..వసతులు తక్కువ...

ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేచించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్న యాజమాన్యాలు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో సామర్థ్యానికి మించి ఇరుకు గదుల్లో 30 నుంచి 50 వరకు విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తుండటంతో పాఠ్యాంశాలు అర్థమయ్యేదెలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరో వైపు కొన్ని పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులుంటే మరుగుదొడ్లు, మూత్రశాలలు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల క్యూలో నిలబడి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.


ఆర్థిక భారంతో సతమతం

పాఠశాలలు ప్రారంభమైన నాటినుంచే ప్రైవేటు పాఠశాలలు షాపులుగా మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టుమని పది రోజులు కాకముందే పాఠశాలకు వచ్చిన విద్యార్థుల నుంచి స్టడీ మెటీరియల్‌ కొనాలనే ఉపాధ్యాయుల ఒత్తిడితో తల్లిదండ్రులు తీవ్ర మానసికవేదనకు గురవుతున్నారు. ప్రారంభంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలతో పాఠ్యాంశాలు మొదలుపెట్టాల్సిన ఉపాధ్యాయులు టై, బెల్టులు, యూనిఫాం, షూ, స్టడీ మెటీరియల్‌ తప్పనిసరని చెప్పటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికభారంతో సతమతమవుతున్నారు.


ఫీజుల మోత..

కరోనా ఉధృతి కారణంగా గత రెండేళ్లుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై పనులు లేక ఆర్థికంగా నష్టపోయారు. అంతేకాకుండ పాఠశాలలు సైతం మూతపడడంతో విద్యార్థులు కాస్తో... కూస్తో చదువుకున్న చదువు సైతం మరిచిపోయారు. ఈక్రమంలో తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తే కాస్త విద్య మెరుగుపడుతుందనే ఆశతో పంపిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు పెంచడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. అధిక ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడకపోవడం యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి సారించి నియంత్రించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలి : కేలోతు సాయికుమార్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ప్రధానకార్యదర్శి, మహబూబాబాద్‌ 

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థుల కనుగుణంగా మౌలిక వసతుల కల్పించకుండా ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రైవేట్‌ పాఠశాలలపై చర్య తీసుకోవాలి.


పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాల విక్రయం : బోనగిరి మధు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు

జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో బుక్‌స్టాళ్లను తలపించేలా స్టడీ మెటిరీయల్‌ విక్రయాలు జరుపుతున్నారు. యజమాన్యాలు ధరలు నిర్ణయించి పైసా తగ్గకుండా అధిక ధరలకు విక్రయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. జిల్లా విద్యాశాఖాధికారులు ప్రైవేట్‌ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి ధరలను నియంత్రించాలి. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి  పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలలపై చర్య తీసుకోవాలి.

Read more