అధ్యక్షా.. అనాలని!

ABN , First Publish Date - 2022-03-05T06:35:42+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్న కొందరు.. కార్యాలయాల్లో

అధ్యక్షా..   అనాలని!

  • చట్టసభలకు వెళ్లే యోచనలో పలువురు ప్రభుత్వ అధికారులు
  • ఎన్నికల్లో పోటీకి ఇప్పటినుంచే సన్నద్ధం
  • కొత్తగూడెం నుంచి గడల శ్రీనివాసరావు
  • సంగారెడ్డి నుంచి మామిళ్ల రాజేందర్‌
  • ములుగు నుంచి అల్లెం అప్పయ్య
  • టీఆర్‌ఎస్‌ తరఫున పోటీకి ఆసక్తి!
  • ఇదే బాటలో మరికొందరు అధికారులు
  • సామాజిక సేవా కార్యక్రమాలతో
  • నియోజకవర్గాల్లో పట్టు కోసం యత్నాలు
  • టికెట్‌ కోసం వివిధ పార్టీలతో లాబీయింగ్‌!
  • అడ్డుకునే ప్రయత్నాల్లో స్థానిక నేతలు


ఒకరు ఐఏఎస్‌! మరొకరు ఐపీఎస్‌! ఇంకొకరు ఆరోగ్య శాఖ డైరెక్టర్‌! మరొకరు డీఎంహెచ్‌వో! ఇప్పటి వరకూ వీరంతా నాయకుల ఆదేశాలు పాటించారు! ఇకపై తామే నాయకులు కావాలని అనుకుంటున్నారు! ఇంకా ఏళ్ల తరబడి సర్వీసు ఉన్నా.. దానిని వదులుకుని ప్రజాసేవలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు! వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని పావులు కదుపుతు న్నారు! సామాజిక సేవా కార్యక్రమాలతో పోటీకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు!


హైదరాబాద్‌/న్యూస్‌ నెట్‌వర్క్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్న కొందరు.. కార్యాలయాల్లో కుర్చీలను వదిలి చట్టసభలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ట్రస్టుల పేరుతోనో, మరో రకంగానో ‘సేవా కార్యక్రమాలు’ చేపడుతూ ఆయా ప్రాంతాల్లో పట్టు పెంచుకునే యత్నాల్లో వారు ఉన్నారు. తాము పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం అవకాశమున్న రాజకీయ పార్టీలతో లాబీయింగ్‌నూ మొదలు పెట్టినట్లు సమాచారం.


మరోవైపు వీరిని అడ్డుకునేందుకు స్థానిక నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు నియోజవకర్గాలపై ఇలాంటి అధికారులు కన్నేసినట్లు, దీంతో వారికి, స్థానిక నేతలకు మధ్య రాజకీయ వేడి రగులుకుంటున్నట్లు చెప్పుకొంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది అంటే 2023 డిసెంబరులో జరగాల్సి ఉంది. కానీ, అంతకంటే ముందుగానే ఈ ఎన్నికలు రావచ్చనే ప్రచారం  జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జరగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంద ని భావిస్తున్నారు. పైగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి చూసినా.. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ కంటే కొంత ముందుగానే జరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు అధికారులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


కొత్తగూడెంపై గడల నజర్‌..

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన తండ్రి గడల సూర్యనారాయణ కొవిడ్‌ వల్ల మృతి చెందగా.. తండ్రి పేరుమీద జీఎ్‌సఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి కొత్తగూడెం నియోజకవర్గంలో వైద్యసేవలు అందించాలని శ్రీనివాసరావు నిర్ణయించారు. ట్రస్ట్‌ ద్వారా పేద విద్యార్థులకు విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12న కొత్తగూడెంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఏప్రిల్‌లో పాల్వంచలోనూ నిర్వహించనున్నారు.


ఇక నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌  ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ భర్త శ్యాం నాయక్‌.. జగిత్యాల జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారిగా (డీటీవో)గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఆయన ఖానాపూర్‌ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జిల్లాలన్నీ చుట్టేస్తున్నారు. ఎలాగైనా ఎంపీ టికెట్‌ తనకే వచ్చి తీరుతుందని తన అనుచరులు, ఖానాపూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకుల వద్ద బలంగా చెబుతున్నారు. 



సంగారెడ్డిపై మామిళ్ల రాజేందర్‌ గురి..!

టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న కేఆర్‌ నాగరాజు వరంగల్‌ జిల్లాలోని వర్దన్నపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి  పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్థానం కుదరకపోతే వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు.


కాగా, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా పని చేస్తున్న లక్ష్మీనారాయణదివనపర్తి జిల్లా. దీంతో తన సొంత జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయనను గద్వాల జిల్లాకు బదిలీ చేయగా.. ఆ బదిలీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అయితే స్థానిక నేతలే ఆయనను అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. ఇక పాలకుర్తి మండలానికి చెందిన ఐఏఎస్‌ అధికారి పరికిపండ్ల నరహరి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్యాడర్‌ అధికారిగా అక్కడే పని చేస్తున్నారు. ఆయన ఈ ప్రాంతంలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పలు ేసవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఆయన ఏదో ఒక పార్టీ తరఫున రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.


కాగా, నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన మేడి రమేశ్‌.. హైదరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు.. ఆయన సతీమణి మేడి ప్రియదర్శిని ప్రస్తుతం బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) నకిరేకల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో రమేశ్‌ ఈ నియోజవకర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


ములుగు నుంచి అల్లెం అప్పయ్య..

ములుగు జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న అల్లెం అప్పయ్య.. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఆదివాసీ కోయ సామాజికవర్గానికి చెందిన అప్పయ్య.. అధికార టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు కూడా ఆయనవైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి చందూలాల్‌ మరణం తరువాత ములుగులో టీఆర్‌ఎ్‌సకు సరైన అభ్యర్థి లేకుండా పోయారన్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలిలో ప్రజాదరణ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీతక్కను సమర్థంగా ఎదుర్కొనడానికి వీలుగా కోయ వర్గానికి చెందిన అప్పయ్య పేరును టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. 2004 ఎన్నికల సమయంలోనే అప్పయ్య ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా.. సమీకరణాలు కలిసిరాలేదు. అప్పటినుంచీ ఆయన టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పెద్దలతో టచ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. ఇటీవల రిటైరయిన డీసీపీ రాంనర్సింహారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ  టికెట్‌ ఆశిస్తున్నారు. జిల్లాలోని మొగుళ్లపల్లి మండలానికి చెందిన ఆయన ఇప్పటికే ఆర్‌ఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో రాంనర్సింహారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిద్దరు జమ్మికుంటలో కలిసి చదువుకున్నారు. 


Updated Date - 2022-03-05T06:35:42+05:30 IST