పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు
ABN , First Publish Date - 2022-06-24T08:22:12+05:30 IST
ఇంటి స్థల వివాదం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. అది ముదిరి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.
- ఆస్తి వివాదం నేపథ్యంలో ఘాతుకం..
- తమ్ముళ్లపై దారుణానికి ఒడిగట్టిన అన్న
- నిప్పంటించే క్రమంలో అతడికీ మంటలు
- ఇంట్లో అగ్ని కీలలతో పేలిన గ్యాస్ సిలిండర్
- 70 శాతం కాలిపోయిన ముగ్గురి శరీరాలు
ఖమ్మం క్రైం, జూన్ 23 : ఇంటి స్థల వివాదం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. అది ముదిరి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. గొడవలు ఎక్కువ కావడంతో పెద్దోడి కుమారుడు పగతో రగిలిపోయాడు. ఎలాగైనా బాబాయ్ కుటుంబంపై కక్ష తీర్చుకోవాలని అదును కోసం ఎదురుచూస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నాన్న కుమారులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో అతడికీ మంటలు అంటుకున్నాయి. ఖమ్మంలోని 39వ డివిజన్ మేదర బజార్‌కు చెందిన కోనా చిలకారావు, కోనా శ్రీనివాసరావు అన్నదమ్ములు. వీరు ఉంటున్న ఇళ్లకు సమీపంలోని ఓ ఇంటి స్థలం విషయంలో ఇద్దరి మధ్య కొంత కాలంగా ఘర్షణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో సంవత్సరం క్రితం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. దాంతో అప్పటి నుంచి పగ పెంచుకున్న చిలకారావు కుమారుడు ఉమా రాజశేఖర్ ఎలాగైనా తన బాబాయ్ కుటుంబంపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం శ్రీనివాసరావు ఇంట్లో లేడు. ఆయన కుమారుడు భార్గవ్(15), వీరేందర్(12) అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. పుస్తకాలు కావాలని వాళ్ల అమ్మను అడిగారు. దాంతో పుస్తకాలు కొనేందుకు ఆమె బయటకు వెళ్లింది.
అది గమనించిన రాజశేఖర్ ఓ డబ్బాలో పెట్రోల్ తీసుకుని శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్లాడు. టీవీ చూస్తున్న పిల్లలు భార్గవ్, వీరేందర్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పిల్లలు మంటల్లో చిక్కుకుని కాలిపోతూ కేకలు వేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించే క్రమంలో ఉమా రాజశేఖర్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. దాంతో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారి కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పి, ముగ్గురినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురి శరీరం సుమారు 70 శాతం కాలిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ పేలి, మంటల తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న పిల్లల వద్ద వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న పిల్లల నుంచి జడ్జి శాంతిలత వాంగ్మూలం తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారులు ఆ బాధను తట్టుకోలేక రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అది చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.