ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నేడు గాంధీభవన్‌లో పోలింగ్‌

ABN , First Publish Date - 2022-10-17T09:51:31+05:30 IST

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలో భాగంగా..

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నేడు గాంధీభవన్‌లో పోలింగ్‌

  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 దాకా
  • ఓటు వేయనున్న 238 మంది టీపీసీసీ సభ్యులు
  • అత్యధిక శాతం మల్లికార్జున ఖర్గే పక్షమే
  • బాహాటంగానే మద్దతు ప్రకటించిన సీఎల్పీ నేత భట్టి 

హైదరాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలో భాగంగా.. సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. కార్యాలయంలోని మీడియా రూమ్‌ను పోలింగ్‌ బూత్‌గా ఉపయోగించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా టీపీసీసీ ఎలక్టెడ్‌ సభ్యులు 238 మంది ఓటు వేయనున్నారు. ప్రదేశ్‌ రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు రాజమోహన్‌ ఉన్నితన్‌, రాజ్‌ భఘేల్‌ పర్యవేక్షణలో పోలింగ్‌ ప్రక్రియ సాగనుంది. కాగా, ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా నడుస్తున్న నేపథ్యంలో.. రేవంత్‌ సహా ముఖ్య నాయకులు ఓటు వేసిన వెంటనే మునుగోడుకు వెళ్లనున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. 


 మరోవైపు ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతుండగా.. తెలంగాణ పీసీసీ సభ్యుల్లో అత్యధికుల మద్దతు ఖర్గే కే ఉన్నట్లు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు బాహాటంగానే మద్దతు ప్రకటించారు. పీసీసీ సభ్యుల మద్దతు అడిగేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఖర్గేకు గాంధీభవన్‌లో ఘన స్వాగతం లభించింది. అయితే, ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన శశిథరూర్‌ ఇక్కడి ముఖ్య నాయకులను కలిసేందుకు ప్రయత్నించగా భిన్న అనుభవం ఎదురైంది. ఆయనను కలిసేందుకు కీలక నేతలు ఆసక్తి చూపలేదు. ఖర్గేకు పోలింగ్‌ ఏజెంట్లుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ మల్లు రవి వ్యవహరిస్తున్నారు. తనకు పోలింగ్‌ ఏజెంట్లుగా కాంగ్రెస్‌ సభ్యులు ఓ ఇద్దరిని థరూర్‌ నియమించుకున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-10-17T09:51:31+05:30 IST