పోలీస్ క్రీడలు షురూ
ABN , First Publish Date - 2022-03-05T05:34:04+05:30 IST
రంగల్ పోలీసు కమిషనరేట్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు హనుమకొండ జిల్లా జవహర్లాల్ నెహ్రూ మైదానంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

లాంఛనంగా ప్రారంభించిన సీపీ తరుణ్‌జోషి
మూడు రోజుల పాటు జరుగనున్న పోటీలు
జేఎన్ మైదానంలో సందడి
హనుమకొండ క్రైం, మార్చి 4: వరంగల్ పోలీసు కమిషనరేట్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు హనుమకొండ జిల్లా జవహర్లాల్ నెహ్రూ మైదానంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీపీ తరుణ్‌జోషి ముఖ్య అతిథిగా హాజరై శాంతికపోతాలను ఎగురవేశారు. అనంతరం గన్‌ఫైర్ చేసి లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ తరుణ్‌జోషి మాట్లాడారు.
పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పోలీసు అఽధికారులకు, సిబ్బందికి సూచించారు. నిత్యం పనిఒత్తిడితో విధులకు హాజరయ్యే పోలీసులకు మానసిక ప్రశాంతత కోసం ప్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పరితపిస్తున్న పోలీసులకు ఆటల పోటీలు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. వార్షిక క్రీడలు పోలీసులకు ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు క్రీడలు నిర్వహించలేకపోయామన్నారు. గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పోటీల ప్రారంభం
తొలిరోజు వరంగల్ సీపీ తరుణ్‌జోషి చేతులమీదుగా పరుగు పందెం, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్జోన్లతో పాటు ఫెథరల్ వెపన్స్ (సీసీఆర్బీ, సీసీఎస్, మహిళా పోలీసు స్టేషన్లు, సైబర్ క్రైం, ఐటీ కోర్, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ) జట్లు పోటీలలో పాల్గొన్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల నుంచి సుమారు 400 పోలీసు సిబ్బంది, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జేఎన్ మైదానంతో పాటు సెయింట్ పీటర్స్, సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్స్, జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియం, ఆఫీసర్స్ క్లబ్, బాలసముద్రంలోని స్విమ్మింగ్‌పూల్‌లో పోలీసుల క్రీడలు జరుగుతాయని క్రీడల ఆర్గనైజర్ ఏఆర్ అడిషనల్ డీసీపీ భీంరావు వెల్లడించారు. ఆదివారం క్రీడలు ముగుస్తాయన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్‌జోన్‌ల డీసీపీలు అశోక్‌కుమార్, వెంకటలక్ష్మి, సీతారాంలతో పాటు అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్ప, సంజీవ్, రాగ్యానాయక్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, గిరికుమార్, ఫణీందర్, తిరుమల్, శివరామయ్య, రఘుచందర్, కృష్ణ, రమేష్, కిశోర్‌కుమార్, రహమాన్, నాగయ్య, శ్రీనివా్‌సలతో పాటు ఇనిస్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు.
తొలి రోజు విజేతల వివరాలు
వాలీబాల్: సెంట్రల్‌జోన్ వర్సెస్ ఈస్ట్‌జోన్ జట్ల మధ్య పోటీ జరిగింది. సెంట్రల్‌జోన్ జట్టు ఈస్ట్‌జోన్ జట్టుపై 25-10, 25-20 పాయిట్లతో గెలుపొందారు. సెంట్రల్‌జోన్ జట్టులో కానిస్టేబుళ్లు చిరంజీవి, నరే్షలు వ్యక్తిగత ప్రతిభ కనబరిచి జట్టును గెలుపు పథంలో నడిపించారు.
800 మీటర్ల పరుగు పందెం : మహిళలు విభాగంలో సాయిదివ్య, శివాణి, సుజాతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందారు. పురుషుల విభాగంలో యోగేశ్వర్, రాజు, వీరేందర్‌లు మొదటి మూడు స్థానాల్లో విజయం సాధించారు.