పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-10-07T16:20:30+05:30 IST

శ్రీనగర్‌కాలనీలోని తమ నివాస గృహాల వద్ద గత నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు

పోలీసుల అత్యుత్సాహం

విద్యార్థులపై ఈ-పెట్టీ కేసులు  

టార్గెట్ల కోసమేనా!


హైదరాబాద్‌ సిటీ: శ్రీనగర్‌కాలనీలోని తమ నివాస గృహాల వద్ద గత నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు మాట్లాడుకుంటుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా... మాట్లాడుకుంటున్నామని చెప్పారు. మీరు చట్టాన్ని అతిక్రమించారంటూ వారిని బెదిరించిన కానిస్టేబుళ్లు.. ఫోన్‌, ఆధార్‌ కార్డు నెంబర్లు తీసుకున్నారు. విద్యార్థుల ఫొటోలు తీసి ట్యాబ్‌ ద్వారా ఈ-పెట్టీ కేసు నమోదు చేశారు. తామేం తప్పు చేశామని విద్యార్థులు ప్రశ్నించగా.. ఏం కాదులే అని చెప్పి కానిస్టేబుళ్లు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని విద్యార్థులు పంజాగుట్ట ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కానిస్టేబుళ్లను ప్రశ్నించారు. డయల్‌ 100 నుంచి బంజారాహిల్స్‌ పీఎ్‌సకు ఫిర్యాదు రావడంతో శ్రీనగర్‌కాలనీ వెళ్లినట్టు కానిస్టేబుళ్లు చెప్పారు. మరుసటి రోజు విద్యార్థుల ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ వచ్చింది. ‘మీపై కేసు నమోదైంది.. ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలి’ అని అందులో ఉంది. విద్యార్థులకు వచ్చిన మెసేజ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు సంబంధించినది కాగా.. వారి ఫొటోలు తీసిన ప్రాంతం పంజాగుట్ట పీఎస్‌ పరిధిలోనిది కావడం గమనార్హం. ఈ సంఘటనను లోతుగా పరిశీలిస్తే.. పోలీసులకు ఈ-పెట్టీ కేసులకు సంబంధించి టార్గెట్లు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 


సరిహద్దులు దాటి కేసులా? 

ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని దాటేస్తారనే విషయం తెలిసిందే. అలాంటి వారు తమ పీఎస్‌ పరిధి దాటి మరో పీఎస్‌ పరిధిలోకి వెళ్లి పెట్టీ కేసు నమోదు చేస్తున్నారంటే అది వారి ఉత్సాహమా? లేక ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అన్న విషయం అర్థం కావడం లేదు. పట్టపగలు రోడ్డుపై నిలబడినా నేరమైనట్లు ఈ-పెట్టీ కేసు నమోదు చేయడం.. ఆ తర్వాత చార్జిషీట్‌ అని మెసేజ్‌ రావడంతో యువకులు భయాందోళన చెందుతున్నారు. ఈ-పెట్టీ కేసుల్లో ఆధార్‌ కార్డు వివరాలు తీసుకోరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అవేమీ పట్టించుకోని పోలీసులు ఆధార్‌ వివరాలు సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్యాబ్‌లో ఈ-పెట్టీ కేసు నమోదు చేసినప్పుడు లొకేషన్‌ గుర్తించిన తర్వాత పరిధి గురించి ప్రశ్నించాల్సిన అధికారులు కూడా ఈ విషయం పట్టించుకోకపోవడం గమనార్హం. 


ఈ-పెట్టీ కేసు అంటే..

ఈ-పెట్టీ కేసు అంటే ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) సెక్షన్లు వర్తించకుండా అత్యవసరంగా ఆన్‌లైన్‌లోనే ట్యాబ్‌ ద్వారా.. స్పాట్‌లోనే కేసులు నమోదు చేసే వ్యవహారం. ఎవరైనా ఫిర్యాదు చేసినా.. లేదా పోలీసులకు ఏవైనా ఆధారాలు లభించినా ఆన్‌లైన్‌లోనే పెట్టీ కేసులు నమోదు చేసే వెసులుబాటు ఉంది. రోడ్డుపై గలాటా చేయడం, ఎక్కడపడితే అక్కడ మద్యం తాగడం, అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం లాంటి విషయాల్లో కేసులు నమోదు చేస్తుంటారు. పార్టీల పేరుతో.. డీజే సౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించినా, పేకాట ఆడడం, నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్‌, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఎక్కువ శబ్ధాలతో వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటివి, రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం, డ్రంకెన్‌ డ్రైవ్‌ తదితర చర్యలను ఈ-పెట్టీ కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో వీడియో, ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌, లొకేషన్‌ ఆధారంగా పోలీసులు స్వయంగా ఆన్‌లైన్‌లోనే కేసులు నమోదు చేస్తుంటారు. సాధారణంగా ఏదైనా నేరం రుజువైతే ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి శిక్షలు పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. పెట్టీ కేసులకు మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. చిన్న నేరాలకు పోలీసులే స్వయంగా లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఆన్‌లైన్‌లో పెట్ట్టీ కేసు నమోదు చేస్తారు. పోలీస్‌ సిబ్బందికి ఉన్న ఈ అధికారం దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

Read more