పేదోడి సంక్షేమంపై విషమా?

ABN , First Publish Date - 2022-08-14T08:03:28+05:30 IST

పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

పేదోడి సంక్షేమంపై విషమా?

మోదీజీ మీ దృష్టిలో ఏది ఉచితం? ఏది అనుచితం?

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా?

పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?

రైతు రుణమాఫీని తప్పుబట్టి కార్పొరేట్లకు దోచిపెడతారా? 

మంత్రి కేటీఆర్‌ ఫైర్‌


హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని  మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాలపై తన వైఖరేంటో ప్రధాని మోదీ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏది ఉచితమో, ఏది అనుచితమో దేశ ప్రజలకు వెల్లడించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత పథకాల రద్దుపై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక, సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లగలరా అని బీజేపీకి సవాల్‌ విసిరారు. ఉచిత పథకాలపై ప్రధాని మోదీ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్రం తీరును విమర్శిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు పార్లమెంట్‌లో చట్టం కానీ, రాజ్యాంగ సవరణ కానీ చేస్తారా ? అని బీజేపీని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని గాలికి వదేలిసిన బీజేపీ ప్రభుత్వం సామాన్యుని బతుకుని భారంగా మార్చిందని విమర్శించారు. పేదోడి పొట్టకొట్టేందుకే ఉచిత పథకాల రద్దు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని అన్నారు. పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులపైనా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నదని మండిపడ్డారు.


ఆ డబ్బుతో ఏం చేశారు ?

మోదీకి ముందున్న 14 మంది ప్రధానులంతా కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేేస్త, ఆయనొక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా చేశారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ అప్పులకు వడ్డీ కట్టేందుకు దేశ వార్షిక రాబడిలో 37ు ఖర్చు అవుతున్నదని కాగ్‌  హెచ్చరించిన  విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాక, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని, కానీ మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందన్నారు. పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించడం నిజం కాదా అని అడిగారు.


అయితే, అప్పుగా తెచ్చిన ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చు చేశారో మోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ డబ్బుతో ఒక్క భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టు లేదా ఏదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేశారా అని అడిగారు. అలాంటివేవి చేయనప్పుడు ఆ డబ్బు ఎవరి బొక్కసాలకు చేరిందని నిలదీశారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోగా.. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై విషం చిమ్మడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్థి, సామాజికాభివృద్థి కోసం పాటుపడాలని తెలిపారు. ప్రజాసంక్షేమానికి అవసరమైన అనేక విషయాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారని, వాటి సాధనకు రాజ్యం కృషి చేయాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కానీ, 75 ఏళ్ల స్వతంత్ర  భారతావని ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజమని తెలిపారు.


రైతు బంధు, రైతు బీమా వద్దంటారా ?

రైతులకు ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను మోదీ ఇవ్వద్దంటున్నారా అని ప్రశ్నించారు. మోదీకి రైతు సంక్షేమం అనే మాటకు అర్థం తెలియదని విమర్శించారు. ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలపై కోత విఽధిస్తే అది అన్నదాతలకు పెనుభారమనే విషయం రైతు వ్యతిరేకైన మోదీ సర్కారుకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇవ్వడంపై మోదీ అక్కసు చూపుతున్నారని అన్నారు. గురుకుల స్కూళ్లు పెట్టి పేద బిడ్డలకు ఉచిత వసతులిచ్చి వారిని మెరికల్లాగా తీర్చిదిద్దడాన్ని కూడా నిషేఽధిస్తారా అని ప్రశ్నించారు. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, బతుకమ్మ చీరలు వంటి పథకాలను తప్పుబడతారా అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌, దళితబంధు అవసరం లేదంటారా అని మోదీని నిలదీశారు. అంతేకాక, వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తేయాలనే దుర్మార్గమైన ఆలోచన ఎంతమంది పేదలను ఆకలి మంటల్లోకి పడదోస్తున్నదో ఎన్నడైనా ఆలోచించారా అంటూ మండిపడ్డారు.


సీనియర్‌ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని ప్రకటించడానికి మనసెలా ఒప్పిందన్నారు.  రైతు రుణమాఫీని తప్పుబట్టే మోదీ కార్పొరేట్‌ పెద్దలకు అందినకాడికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ. 3లక్షల కోట్ల కార్పొరేట్‌ ట్యాక్స్‌ రాయితీలు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బడా బాబులకు చెందిన రూ.10 లక్షల కోట్లకు పైగా బ్యాంకు అప్పులను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం, రైతు రుణాల విషయానికి వచ్చే సరికి స్వరం మార్చేస్తోందని విమర్శించారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలని అంటారా అని అడిగారు.   కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా అని ప్రశ్నించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో బడా బాబులకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని? రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని? అని విషయం తేల్చాలని తెలిపారు. 

Updated Date - 2022-08-14T08:03:28+05:30 IST