పోడు రగడ: TRSలో మొదలైన తిరుగుబాట్లు
ABN , First Publish Date - 2022-06-28T18:27:37+05:30 IST
అధికార టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాట్ల పర్వం మొదలైంది. పోడు రైతుల పట్టాల కోసం సర్పంచ్ మడకం స్వరూప తన పదవికి రాజీనామా చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం: అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీలో తిరుగుబాట్ల పర్వం మొదలైంది. పోడు రైతుల పట్టాల కోసం సర్పంచ్ మడకం స్వరూప తన పదవికి రాజీనామా చేశారు. అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గ్రామ సర్పంచ్ మడకం స్వరూపతో పాటు 160 కుటుంబాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పోడు రైతుల పట్టాల కోసం సర్పంచ్ స్వరూప ఆధ్వర్యంలో ఛలో ప్రగతిభవన్ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. కాగా పోలీసులు పాదయాత్రను అడ్డుకుని మహిళలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోడు పట్టాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో సర్పంచ్ పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్వరూప ప్రకటించారు. మరోవైపు పోడు పట్టాల కోసం రాజీనామా బాటలో పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోడు రగడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తోంది.