తీరనున్న పోడు గోడు

ABN , First Publish Date - 2022-10-09T05:20:17+05:30 IST

ఎట్టకేలకు పోడు దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధమైంది. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీల (ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా ఉన్న భూ ములను గుర్తించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు కార్యాచరణలను రూపొందించారు. దరఖాస్తులు స్వీకరించిన పది నెలల తర్వాత ప్రభుత్వం పోడు భూముదారులకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో వారిలో ఆశలు చిగురించాయి. పోడు భూముల సమస్య పరిష్కారానికి జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల సర్వేకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

తీరనున్న పోడు గోడు

పోడు భూముల సర్వేకు రంగం సిద్ధం
హక్కులు కల్పించేందుకు మార్గదర్శకాల జారీ
మొదలైన అధికారుల కసరత్తు
ప్రత్యేక యాప్‌తో హద్దుల నిర్ధారణ
దరఖాస్తుల పరిశీలనకు కమిటీలు
ఉమ్మడి జిల్లాలో 94వేలకుపైగా దరఖాస్తులు
అటవీ గ్రామాల్లో మొదలైన సర్వేహనుమకొండ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఎట్టకేలకు పోడు దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధమైంది. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీల (ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా ఉన్న భూ ములను గుర్తించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు కార్యాచరణలను రూపొందించారు. దరఖాస్తులు స్వీకరించిన పది నెలల తర్వాత ప్రభుత్వం పోడు భూముదారులకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో వారిలో ఆశలు చిగురించాయి. పోడు భూముల సమస్య పరిష్కారానికి జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల సర్వేకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

పోడు సాగుచేస్తున్న భూములకు హక్కు పత్రాల జారీ కోసం గత ఏడాది నవంబర్‌లో గిరిజనులు, గిరిజనేతరుల నుంచి అటవీ హక్కుల కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించారు. హనుమకొండ, వరంగల్‌, మహూబుబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలలో మొత్తం 68,177 పోడు దరఖాస్తులు అందాయి. అయితే  క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించడం సవాలుగా మారింది. దరఖాస్తు చేసిన వారిలో అనర్హులు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు, సిబ్బందితో సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. పోడు భూముల దరఖాస్తులు అందిన జిల్లాల కలెక్టర్లు అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి పోడు భూముల సర్వే ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు.

పోడు హక్కుపత్రాలు
పోడు భూముల హద్దులు, సర్వే నెంబర్లు, అర్హుల వివరాలు పక్కాగా తేల్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఫీల్డ్‌ ఏరియా మేజర్‌ అనే కొత్త యాప్‌ను రూపొందించింది. పోడు భూములను సర్వే చేసే, అలాగే పోడు భూముల కోసం చేసిన దరఖాస్తులను పరిశీలించే సంబంధిత శాఖల అధికారులు తమ మొబైళ్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ కార్యదర్శులతో పాటు అటవీశాఖ సిబ్బంది గ్రామాల వారీగా రోజుకు పది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు గ్రామాల వారీగా సర్వే సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు చేశారు. యాప్‌ వినియోగంపై, పోడు భూముల సర్వే నిర్వహణపై శిక్షణ కూడా ఇస్తున్నారు.

సర్వే ఇలా..
అటవీశాఖ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏలు సర్వేలో సభ్యులుగా ఉంటారు. గ్రామాలవారీగా దరఖాస్తులు చే సుకున్న వారి సర్వే నెంబర్ల వారీగా ఎంత మేరకు సాగు చేస్తున్నారు? భూ విస్తీర్ణం ఎంత? నాలుగు వైపులా ఏయే రైతులు ఉన్నారనే వివరాలను తెలుసుకుంటారు. దీనికోసం సంబంధిత రైతు సాగు చేసే భూమి దగ్గరికి వెళ్లి మొబైల్‌లో యాప్‌ను తెరిచి భూమి చుట్టూ నడవాల్సి ఉంటుంది. ప్రారంభించిన చోటు నుంచి తిరిగి అక్కడికి చేరుకునే వరకు నడక పూర్తి చేస్తే ఆ భూమి మొత్తం చుట్టు కొలత అందు లో నమోదవుతుంది. తర్వాత దరఖాస్తులో ఉన్న కోడ్‌ నెంబర్‌, సర్వేనెంబర్‌, రైతు పేరు నమోదు చేసి, అక్కడే సంబంధిత రైతు ఫోటో కూడా తీసుకుంటారు. రోజు పది దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశాలున్నాయి. భూవిస్తీర్ణం తేల్చాలంటే సాగు చేసే భూ మి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. రైతుల వారీగా క్షేత్ర స్థా యిలో సర్వే చేయాలంటే మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.

మార్గదర్శకాలు
ముందుగా దరఖాస్తులదారుడికి పంచాయతీ కార్యదర్శి నోటీసు జారీ చేస్తారు. అనంతరం నిర్దేశించిన సమయంలో ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులు అటవీ, రెవెన్యూ, భూ కొలతల అధికారులు క్షేత్రపరిశీలన చేస్తారు. గ్రామసభ నిర్వహించి అందరి సమక్షంలో ఆయా దరఖాస్తులకు ఆమోదం తెలుపుతారు. దరఖాస్తును తిరస్కరిస్తే ఆర్డీవో నేతృత్వంలో డివిజన్‌ స్థాయి కమిటీకి 60 రోజుల్లోపు తిరిగి విన్నవించుకోవచ్చు. అక్కడా తిరస్కరిస్తే కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్‌ నేతృత్వంలో డీఎ్‌ఫవో, గిరిజన సంక్షేమశాఖ అధికారి, ఎస్పీతో పాటు అయిదుగురు గిరిజన ప్రజాప్రతినిధులున్న కమిటీదే తుది నిర్ణయంగా ప్రభుత్వం ఆమోదిస్తుంది.

సర్వేతో స్పష్టం
పోడు భూములు సాగు చేస్తున్నట్టు రైతుల వద్ద ఆధారాలు ఉండాలి. దరఖాస్తులో రైతు సాగు చేసే భూముల హద్దులు, విస్తీర్ణం తేల్చిన తర్వాత 2005 డిసెంబ్‌ 13 నాటికి ఎంత భూమిలో రైతు సాగు చేస్తున్నాడు? తర్వాత రోజుల్లో విస్తీర్ణం ఏ మేరకు పెరిగింది? భూమిలేని వాళ్లు, భూమి తక్కువగా ఉన్న ఎక్కువ విస్తీర్ణం రాసుకున్నా సర్వేలో తేలిపోతుంది. దరఖాస్తుదారులకు సరైన న్యాయం జరగడంతోపాటు ఇప్పటివరకు లేని అటవీశాఖ భూముల హద్దులు పక్కాగా గుర్తిం చే వీలుంది. భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా ఉంటుం ది. గిరిజనేతరులు మూడు తరాల ఆధారాలు చూపాలి.

పోడు దరఖాస్తులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క జనగామ జిల్లా తప్పా మిగతా అయిదు జిల్లాలో పోడు దరఖాస్తులు అందాయి. మొత్తం 2,83,111 ఎకరాలకు గాను 94,561 దరఖాస్తులు అందాయి. మహబూబాబాద్‌ జిల్లాల్లో 9 మండలాలు, 152 గ్రామపంచాయతీలు, 320 ఆవాసాల పరిధిలో అత్యధికంగా 1,08,404 ఎకరాలకు సంబంధించి 32,697 పోడు దరఖాస్తులు అందాయి. వరంగల్‌ జిల్లాలో 6 మండలాలు, 96 గ్రామపంచాయతీలు 210 ఆవాసాల పరిధిలో 21,999 ఎకరాలకుగాను 7,389 దరఖాస్తులు, హనుమకొండ జిల్లాలో ఒక్క శాయంపేట మండలంలోని 5 గ్రామ పంచాయతీలు 25 ఆవాసాల పరిధిలో 1,454 ఎకరాలకుగాను 777 దరఖాస్తులు అందాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 92 గ్రామపంచాయతీలు, 224 ఆవాసాల పరిధిలో 73,814 ఎకరాలకు గాను 25,021 దరఖాస్తులు అందాయి. ములుగు జిల్లాలో అన్ని మండలాల నుంచి 77,613 ఎకరాలకుగాను 28,680 దరఖాస్తులు దాఖలయ్యాయి.Read more