దేశం మరచిన ‘జెండా వెంకయ్య’

ABN , First Publish Date - 2022-08-01T09:03:32+05:30 IST

అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం.. ప్రతి రోజూ సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి శరీరం పులకరిస్తుంది.

దేశం మరచిన ‘జెండా వెంకయ్య’

మచిలీపట్నం జాతీయ కళాశాల అధ్యాపకుడు పింగళి వెంకయ్య కొంతకాలంగా ఇతర దేశాల పతాకాలను వర్ణిస్తూ.. భారత జాతీయ పతాకానికి నమూనాలు ప్రతిపాదిస్తూ ఒక చిన్నపుస్తకాన్ని భారత ప్రజలకు అందజేశారు. బెజవాడలో వెంకయ్యను త్రివర్ణ పతాకం రాట్నచిహ్నమై ఉండాలని చెప్పగా.. ఆయన వెంటనే చిత్రించి అందజేశారు. ఆయన అకుంఠిత ఉత్సాహం ఫలితంగా మూడుగంటల్లోనే నేనొక పతాకాన్ని పొందగలిగాను, 

- మహాత్మాగాంధీ (1921లో)


అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం.. ప్రతి రోజూ సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి శరీరం పులకరిస్తుంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా జాతీయ పతాకం ఎగురవేస్తుంటాం. మరి ఆ పతాకాన్ని రూపొందించినవారెవరో తెలుసా? మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. జాతీయ పతాక రూపశిల్పిని దేశం దాదాపు మరచిపోయింది. తాజాగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా స్వాతంత్య్ర సంగ్రామంలో పింగళి పాత్ర, జాతీయ పతాకం రూపకల్పనలో ఆయన విశేష కృషిని స్మరిస్తూ కేంద్రం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. 146వ జయంతిని కేంద్రం మంగళవారం ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకుందాం..


చిన్నప్పుడే గాంధీతో..

జీవితాంతం గాంధేయవాదిగా కొనసాగిన పింగళి.. 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పింగళి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. చల్లపల్లి మండలం యార్లగడ్డలో, మొవ్వ మండలం భట్లపెనుమర్రులో, మోపిదేవి మండ లం పెదకళ్ల్లేపల్లిలో బాల్యం, విద్యాభ్యాసం కొనసాగించా రు. హనుమంతరాయుడు యార్లగడ్డ గ్రామకరణం. తాత య్య చలపతిరావు తహశీల్దారు. పింగళి మచిలీపట్నం హిందూ హైస్కూలులో ప్రాఽథమికోన్నత విద్యను అభ్యసించారు. పామర్రు గ్రామకరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాక.. 19 ఏళ్లకే బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయెర్‌ యుద్ధం(1899-1902)లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ మహాత్మాగాంధీని కలుసుకున్నారు. బ్రిటిష్‌ జాతీయ పతాకాని(యూనియన్‌ జాక్‌)కి సైనికులు సెల్యూట్‌ చేసే ఘటన వెంకయ్య మదిలో నిలిచిపోయింది. స్వదేశానికి వచ్చాక మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ.. మన దేశానికి కూడా జాతీయ పతాకం కావాలని.. దాని రూపకల్పనకు నడుం బిగించారు. 


బ్రిటిష్‌ పతాకాన్ని ఆవిష్కరించడం చూసి..

దేశ స్వాతంత్య్ర ఉద్యమ కార్యాచరణ కోసం జరిగే అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాల్లో పింగళి తరచూ పాల్గొనేవారు. 1906లో కలకత్తాలో కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్‌ వారి జాతీయ జెండాను కాంగ్రెస్‌ నాయకులు ఆవిష్కరించడం చూసి ఎంతో కలత చెందారు. మన దేశానికి జాతీయజెండా ఉండాలనే  ఆవశ్యకత సన్నిహితుల వద్ద ప్రస్తావించేవారు. కాంగ్రెస్‌ సమావేశాల్లోనూ నొక్కిచెప్పేవారు. తానే రూపకల్పనకు నడుం బిగించారు. ఇతర దేశాల పతాకాలపైనా అధ్యయ నం చేశారు. వాటి గురించి వివరిస్తూ.. భారత జాతీయ పతాకం ఎలా ఉండాలో 30 రకాల డిజైన్లు సిద్ధం చేసి.. 1916లో ‘ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అనే బుక్‌లెట్‌ ప్రచురించారు. 1921 మార్చి 31-ఏప్రిల్‌ 1న మహాత్మాగాంధీ విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశానికి వచ్చారు. ఆ సమావేశాల్లో జాతీయ పతాకం అవసరాన్ని గాంధీజీ నొక్కిచెప్పారు. పింగళి విక్టోరియా మ్యూజియంలో ఆయ న్ను కలిసి.. ఖద్దరుపై తాను రూపొందించిన ‘స్వరాజ్‌ పతాకం’ ముసాయిదాను అందజేశారు. హిందువులు, ముస్లింలను ప్రతిబింబించే ఎరుపు, పచ్చరంగులు అందు లో ఉన్నాయి.


మధ్యలో స్వరాజ్యానికి గుర్తుగా చరఖాను పెట్టారు. గాంధీజీ సలహాతో దాని కి తెల్లరంగునూ కలిపి 3గంటల్లో తయారుచేసి ఇచ్చారు. గాంధీజీ ముగ్ధుడయ్యారు. ఆయన, కాంగ్రెస్‌ అగ్రనేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 13న ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో మహాత్మాగాంధీ మన జాతీయపతాకం అనే శీర్షికతో ప్రత్యేక వ్యాసం రాశారు. దాని రూపశిల్పి పింగళిని కొనియాడారు. నాటి నుంచి ఆయన ‘జెండా వెంకయ్య’గా ప్రసిద్ధుడయ్యారు. దేశమంతటా 1931 వరకు ఈ స్వరాజ్‌ పతాకమే రెపరెపలాడింది. ఆ ఏడాది పతాకంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఎరుపు రంగు స్థానంలో కాషాయం వచ్చింది. పతాకంపై భాగాన ఈ రంగు, మధ్యలో తెలుపు, ఆ తర్వాత పచ్చరంగు వచ్చా యి. మధ్యలో తెల్ల రంగుపై చరఖాను చేర్చారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించాక బాబూ రాజేంద్రప్రసాద్‌ (తర్వాత రాష్ట్రపతి అయ్యారు) సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఆమోదించింది.    

 - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

జపాన్‌ వెంకయ్య.. పత్తి వెంకయ్య

పింగళి వెంకయ్య పలు రంగాలపై మక్కువ ఎక్కువ. ఆయన బహుళ శాస్త్రజ్ఞుడు. రైతు.. విద్యావేత్త.. భౌగోళిక శాస్త్రంపైన, బహు భాషలపై మక్కువ ఎక్కువ. 1913లో బాపట్లలో జరిగిన ఓ కార్యక్రమంలో జపాన్‌ భాషలో పూర్తిస్థాయి ప్రసంగం చేశారు. దీంతో ఆయన్ను ‘జపాన్‌ వెంకయ్య’గా పిలవడం ప్రారంభించారు. అలాగే అప్పట్లో మత్స్య, జౌళి పరిశ్రమలకు మచిలీపట్నం పెద్ద కేంద్రంగా ఉండేది. ఆయన పత్తి పంటపై పరిశోధన చేశారు. ‘కాంబోడియా కాటన్‌’ వంగడంపై రీసెర్చ్‌ చేయడంతో ఆయనకు ‘పత్తి వెంకయ్య’ అని ఇంకో పేరు వచ్చింది. అలా ‘జెండా వెంకయ్య’కు మరో రెండు పేర్లు కలిశాయన్న మాట.


ప్రేమను పెంచు.. పది మందికీ పంచు..

పింగళి.. ప్రేమను పెంచు, పదిమందికీ పంచు అని పదేపదే చెబుతుండేవారు. తన రాజకీయ గురువు బాలగంగాధర తిలక్‌ మరణంతో రాజకీయాలకు దూ రంగా ఉండిపోయారు. నెల్లూరులో కొంతకాలం అబ్రకంపై పరిశోధనలు చేశారు. భూగర్భ, ఖనిజ శాఖలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో విజయవాడలో ఒక ఇంటిలో ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. రోజూ ఉదయం   విష్ణుసహస్రనామం చదివేవారు. మధ్యాహ్న భోజనం అనంతరం భగవద్గీత చదివేవారు.  1963 జూలై 4న పింగళి కన్నుమూశారు. దేశానికి విశేషసేవలందించిన పింగళికి సరైన గుర్తింపు రాలేదు. నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌శాస్త్రి విజయవాడ వచ్చిన సమయంలో గాంధీహిల్‌లోని గ్రంఽథాలయం హాలులో పింగళి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  2009లో కేంద్రం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన 2011లో వచ్చినా..ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. 2016లో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పింగళి పేరు పెట్టారు. ఆ కార్యాలయ ప్రాంగణంలో పింగళి విగ్రహాన్ని ఆవిష్కరించారు.  


డిసెంబర్‌లో విజయవాడలో సమరయోధుల మహాసభ

విజయవాడ (చిట్టినగర్‌), జూలై 31 : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌, భారత 75వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్‌లో విజయవాడలో అఖిలభారత స్వాత ంత్య్ర సమరయోధుల, వారసుల మహాసభను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల, వారసుల రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించింది. ఆదివారం సయ్యద్‌ అప్పలస్వామి జూనియర్‌ కళాశాల ఆవరణలో అఖిల భారత స్వాతంత్య్ర సమరయోఽధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాశ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఉభయ రాష్ట్రాల సమరయోధులు ఆమోదించారు.

Read more