కేసీఆర్‌ గారడీని ప్రజలు నమ్మరు

ABN , First Publish Date - 2022-07-01T09:09:04+05:30 IST

సీఎం కేసీఆర్‌ చేస్తున్న గారడీని ప్రజలెవ్వరూ నమ్మరని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు.

కేసీఆర్‌ గారడీని ప్రజలు నమ్మరు

  • మాపై అధికార పార్టీ నేతల తప్పుడు ప్రచారం
  • మా భూమి పంచకున్నా పంచుతున్నట్లు వక్రీకరణ:ఈటల జమున

మేడ్చల్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌ చేస్తున్న గారడీని ప్రజలెవ్వరూ నమ్మరని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు. మెదక్‌ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో ఉన్న జమున హేచరీ్‌సకు చెందిన భూములను పంపిణీ చేసినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని ఈటల రాజేందర్‌ నివాసంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. జమునా హేచరీస్‌ ఎస్టేట్‌ ఎదుట కొందరు అధికార పార్టీ నేతలు టెంట్‌ వేసి, పోలీసు బలగాలను రప్పించి.. ఈటల ఆక్రమించుకున్న భూములను పంపిణీ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. పేదలకు పంపిణీ చేసిన భూములు, తమ పేరున ఉన్న భూముల సర్వే నంబర్లు వేర్వేరుగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయాలను పరిశీలించకుండా అధికార పార్టీకి చెందిన మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు పంపిణీ చేసిన భూముల్లో తమ హేచరీ్‌సకు చెందిన ఒక్క గుంట భూమి ఉన్నా.. తాను ముక్కును నేలకు రాస్తానని అన్నారు. తమకు సర్వేనంబర్‌ 22లో 58 ఎకరాల భూమి ఉండగా, ఈటలకు చెందిన 86 ఎకరాల భూములను పంపిణీ చేసినట్లు అధికార పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ హేచరీస్‌ ఎదుట టెంట్‌ వేసి ఈటల రాజేందర్‌ను బద్నామ్‌ చేయడానికి కేసీఆర్‌ గారడీలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయం కక్ష ఉంటే ఈ విధంగా చేయడం సరికాదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు. కాగా, కోళ్ల ఫారాలకు సంబంధిన భవనాలకు అనుమతుల కోసం వెళితే.. అధికారులు ఇవ్వడం లేదని, పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లోనూ తమ భూములను పీవోబీలో చేర్చారని ఆరోపించారు. 


భూములు ఆక్రమించినందునే ఈటల బర్తరఫ్‌:ఎంపీ కొత్త

హైదరాబాద్‌:  నిరుపేదల భూములు ఆక్రమించిన కారణంగానే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ బర్తరఫ్‌ చేశారని మెదక్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి ఆ విధంగా చేసినా అలాంటి చర్యలే ఉంటాయని స్పష్టం చేశారు. జమునా హాచరీస్‌ పేరుతో ఈటలకు సంబంధించిన సంస్థ ఆక్రమించిన వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పట్టాలు పంపిణీ చేసిందని తెలిపారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్‌ ఆ ప్రాంతానికి రాలేదని, కానీ మరుసటి రోజున ఆయన సతీమణి ద్వారా మీడియాతో మాట్లాడించారని తెలిపారు. గుంట భూమి కూడా తాము ఆక్రమించలేదని ఆమె పేర్కొన్నారని చెప్పారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈటల రాజేందర్‌ కూడా సిద్ధమా అని ఆయన సవాల్‌ విసిరారు. 

Updated Date - 2022-07-01T09:09:04+05:30 IST