పీడీఎస్‌ బియ్యం దందా

ABN , First Publish Date - 2022-08-14T06:03:53+05:30 IST

మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల సరిహద్దు అయిన మరిపెడ కేంద్రంగా రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లా శివార్లలో ఉన్న ఓ గ్రామాన్ని అడ్డగా చేసుకుని ఈ వ్యాపారంలో రెండే ళ్లుగా మినీ వాహనాలతో మిల్లుకు తలరించి లారీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. పేదలకు చెందాల్సిన పౌరసరఫరాల బియ్యాన్ని కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నప్పటికీ పరిపాలన యంత్రాంగానికి ఏమాత్రం పట్టింపులేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

పీడీఎస్‌ బియ్యం దందా
మరిపెడలోని ఓ రైస్‌ మిల్లులో దాడులు నిర్వహిస్తున్న జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(ఫైల్‌)

మూడు జిల్లాల సరిహద్దు కేంద్రంగా...
రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వైనం
పౌలీ్ట్రఫాంలకు సైతం రవాణా
జిల్లా సరిహద్దు కావడమే అక్రమానికి అనుకూలం
అప్పుడప్పుడు టాస్క్‌ఫోర్స్‌ దాడులతోనే సరి..మహబూబాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల సరిహద్దు అయిన మరిపెడ కేంద్రంగా రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లా శివార్లలో ఉన్న ఓ గ్రామాన్ని అడ్డగా చేసుకుని ఈ వ్యాపారంలో రెండే ళ్లుగా మినీ వాహనాలతో మిల్లుకు తలరించి లారీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. పేదలకు చెందాల్సిన పౌరసరఫరాల బియ్యాన్ని కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నప్పటికీ పరిపాలన యంత్రాంగానికి ఏమాత్రం పట్టింపులేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపుతున్నట్లు అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ మరోవైపు ఈ అక్రమ వ్యాపారం ఆగేటట్లు లేదని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మూడు జిల్లాలకు సరిహద్దు మండలం కావడంతో అక్రమాలకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికి ఈ మండలంలోని ఒక గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ఒక ప్రముఖ మిల్లు యాజమాని వ్యాపారి తమ మినీ వాహనాల ద్వారా వివిధ ప్రాంతాల్లోని రేషన్‌ దుకాణాల నుంచి నేరుగా పీడీఎస్‌ బియ్యం సేకరించి సొంత మిల్లులోకి చేరుస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరం సదరు మిల్లులో ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి రూ.కోట్లల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఆ ప్రాంత వాసులకు బహిరంగ రహస్యమే అయినా అంతా మాములే అన్నట్టు చూసి చూడనట్టు వదిలేస్తున్నట్లు విమర్శలున్నాయి.

పౌలీ్ట్రఫాంలకు, ఎఫ్‌సీఐకి తరలింపు...
మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దు ఓ గ్రామం కేంద్రంగా కొంత పీడీఎస్‌ బియ్యాన్ని నూకలు, పిండిగా మార్చి ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని పలు పౌలీ్ట్రఫాంలకు తరలిస్తున్నట్లు సమాచారం. మరి కొంత బియ్యాన్ని కస్టం మిల్డ్‌ రైస్‌(సీఎంఆర్‌) అనుమతి పొందిన రైస్‌ మిల్లుల లేబుల్స్‌పై ఉన్న గన్నీ బస్తాలు తెచ్చుకొని ఎఫ్‌సీఐకి కూడా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్‌ డీలర్ల వద్ద కిలో రూ.8చొప్పున పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేస్తున్న ఈ రైస్‌ దందా నిర్వాహకులు ఆ బియ్యాన్ని నూకలుగా మార్చి పౌలీ్ట్రఫాం యజమానులకు కిలో రూ.18 నుంచి రూ.25 వరకు విక్ర యిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బయటి మార్కెట్లో విక్రయించి బయట తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొని లేబుల్‌ ఉన్న బస్తాల్లో నింపి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఇరువురు పంచుకుంటున్నట్లు పలువురు వ్యాపారులు ఈ విషయాన్ని బయటికి చెబుతూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నెలకు 11042 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ

ఈ ఆగస్టు నెలలో మహబూబాబాద్‌లో జిల్లాలో 2,40,772 తెల్లరేషన్‌కార్డులు ఉండగా ఇందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 15,433 ఉన్నాయి. తెల్లకార్డుల్లో 6,71,612 మంది లబ్ధిదారులుండగా ఇందులో అంత్యోదయ అన్న యోజన పథకంలో 42,851 లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఈనెలలో 1,10,42,915 కిలోలు (11,042.91 మెట్రిక్‌ టన్నులు) బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ కొనసాగుతోంది.

మహబూబాబాద్‌, కేసముద్రం మిల్లుల్లోనూ...

మహబూబాబాద్‌, కేసముద్రం ప్రాంతాల్లోని కొన్ని రైస్‌ మిల్లులోను దాదాపుగా ఇదే రకమైన బియ్యం దందా కొనసాగుతోంది. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా ఖరీదు చేసి వాటిని ఎఫ్‌సీఐ బస్తాల్లో నింపి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించకుండా నేరుగా బయటి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ దందాలో రెండేళ్ల వ్యవధిలోనే కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు వినికిడి. ఈ బియ్యం దందాకు అధికారుల సహకారం ఉండడంతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని రైస్‌ మిల్లుల్లో అడపాదడపా రేషన్‌ బియ్యం పట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. అయితే గత రెండు నెలలుగా సీఎంఆర్‌ విధానంలో బియ్యం సేకరణ నిలిచిపోవడంతో దందాకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తిరిగి సీఎంఆర్‌ బియ్యం సేకరణ ప్రారంభం కావడంతో రేషన్‌ బియ్యం కొనే దళారులు మళ్లీ దందాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అప్పుడప్పుడు టాస్క్‌ఫోర్స్‌ దాడులు
మరిపెడ మండలంలోని బియ్యం దందాపై స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అప్పుడప్పుడు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో మరిపెడ మునిసిపల్‌ కేంద్రంలోని ఓ రైస్‌ మిల్లులో 240 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టుకొని పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఆపై సదరు మిల్లు నిర్వాహకుల విషయంలో ఉదాసీనత వైఖరి అవలంబించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏదిఏమైనప్పటికి రేషన్‌ బియ్యం దందాకు చెక్‌ పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

దాడులు నిర్వహిస్తాం....
- నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, మహబూబాబాద్‌

రైస్‌ మిల్లుల్లో అక్రమ బియ్యం దందా జరిగినట్లు సమాచారం అందింతే మెరుపుదాడులు నిర్వహిస్తాం. రేషన్‌ బియ్యాన్ని ఇతరులెవరు కొనుగోలు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. బియ్యం దందా చేసే మిల్లులపై కేసులు నమోదు చేస్తాం.

Updated Date - 2022-08-14T06:03:53+05:30 IST