పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి

ABN , First Publish Date - 2022-05-22T08:46:29+05:30 IST

తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎన్నారైలకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి

  • తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోండి 
  • తెలంగాణ ప్రవాసులకు మంత్రి కేటీఆర్‌ పిలుపు 

హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎన్నారైలకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న మంత్రి శనివారం లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సాధించిన విజయాలను ప్రస్తావించారు. తన పర్యటనలో పలువురు విదేశీ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో తాను జరిపిన సమావేశాలు సంతృప్తికరంగా సాగాయని, త్వరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే తన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. రాబోయే కాలంలో యూకేతో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌తో పాటు మిగతా పట్టణాలు, నగరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. త్వరలోనే మహబూబ్‌నగర్‌లోనూ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెడతాయని ఆయన చెప్పారు. స్టార్ట్‌పగా మొదలైన తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోందని, 2014లో రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం  ఏడేళ్లలో 130ు పెరిగి రూ. 2.78 లక్షలకు చేరిందని చెప్పారు. 2014లో రూ.5.60 లక్షలుగా ఉన్న రాష్ట్ర జీడీపీ.. నేడు రూ.11.54 లక్షలకు చేరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానం తెలంగాణదే అని తెలిపారు. సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ లండన్‌ శాఖ అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం నివాసానికి వెళ్లిన మంత్రి.. ఆయన పార్టీకి చేస్తున్న సేవలను అభినందించారు. 

Updated Date - 2022-05-22T08:46:29+05:30 IST