పట్టాదారు అడవి!

ABN , First Publish Date - 2022-09-15T09:06:11+05:30 IST

అది.. వందల మంది రైతులు తరతరాలుగా పట్టాదారులుగా యాజమాన్య హక్కులు కలిగి ఉన్న భూమి.

పట్టాదారు అడవి!

  • భూయజమాని తండ్రి పేరు అడవి!!
  • గ్రామంలోని రైతులందరి భూమి
  • ధరణిలో అటవీశాఖ పేరిట నమోదు
  • రికార్డుల నవీకరణ సమయంలో తప్పు
  • ధరణి పోర్టల్‌లోనూ అదే కొనసాగింపు
  • మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం
  • నారాయణపురం గ్రామ రైతుల కష్టాలు
  • పరిష్కారానికి మాడ్యూల్‌ 33 కింద దరఖాస్తు
  • సీఎం చెప్పినా లభించని పరిష్కారం 
  • ఎట్టకేలకు సీసీఎల్‌ఏకు జిల్లా కలెక్టర్‌ నివేదిక


హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అది.. వందల మంది రైతులు తరతరాలుగా పట్టాదారులుగా యాజమాన్య హక్కులు కలిగి ఉన్న భూమి. రికార్డుల నవీకరణ సమయంలో అధికారులు చేసిన తప్పిదంతో అటవీభూమిగా నమోదైంది. ధరణి పోర్టల్‌లో కూడా దానిని అదేవిధంగా నమోదు చేయడంతో మొత్తం గ్రామంలోని రైతులందరూ కష్టాల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి ఆ భూమి తమది కాదంటూ అటవీశాఖ స్వయంగా నిర్ధారించినా.. ధరణి పోర్టల్‌లో రైతుల పేర్ల మీదికి మారడంలేదు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాడ్యూల్‌ 33ని తీసుకొచ్చినా.. ఫలితం లేకుండాపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతుల వ్యథ ఇది. ఈ గ్రామ పరిధిలో 43 సర్వే నెంబర్లలో మొత్తం 1827.12 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి గ్రామానికి చెందిన కొన్ని వందల మంది రైతులు దీనిని సాగు చేసుకుంటున్నారు. వారి పేర్లపైనే పట్టా ఉంది. అయితే రికార్డుల నవీకరణలో భాగంగా అధికారులు ఈ గ్రామంలోని  22 సర్వే నెంబర్లలో ఉన్న 1605.09 ఎకరాలను అటవీ భూమిగా పేర్కొంటూ తప్పుగా నమోదు చేశారు. ధరణిలో ఈ భూమి పట్టాదారు పేరు అడవి, తండ్రి పేరు అడవి అంటూ నమోదైంది. మిగిలిన 21 సర్వే నెంబర్లలోని 222.03 ఎకరాలు మాత్రమే పట్టా భూమిగా రికార్డుల్లో నమోదైంది. 


రైతుబంధుకూ దూరమైన రైతులు..

రైతులకు చెందిన పట్టా భూములు రికార్డుల్లో అడవి పేరిట నమోదు కావడంతో ప్రభుత్వం నుంచి వారికి ఏ సాయమూ అందకుండా పోయింది. పంటల సాగు కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు రావడం లేదు. రైతుబీమాకు అర్హత లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ సాయమూ అందడంలేదు. చివరికి పంటరుణాలకు కూడా రైతులు నోచుకోవడంలేదు. దీంతో నారాయణపురం గ్రామ రైతులంతా అధికారుల చుట్టూ తిరగగా.. 22 సర్వే నెంబర్లలోని 1605.09 ఎకరాల భూమిపై అటవీశాఖ పరిశీలన జరిపింది. చివరికి ఇందులో 6 సర్వే నెంబర్లలోని 1420.09 ఎకరాల భూమి తమది కాదంటూ అటవీశాఖ 2021 ఫిబ్రవరి 9న ఉత్తర్వులు (ఎన్‌వోసీ) జారీ చేసింది. ఈ భూమిని 828 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. వారంతా అటవీశాఖ క్లియరెన్స్‌తో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ధరణిలో ఆ భూముల వివరాలను తమ పేరిట నమోదు చేయాలని కోరారు. కానీ, ధరణిలో అందుకు సంబంధించిన ఆప్షన్లు లేకపోవడం, అధికారులు కూడా ఏమీ చేయలేకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పలేదు. కాగా, ప్రభుత్వం మూడు నెలల క్రితం ధరణిలో ఈ తప్పులను సరిదిద్దుకునేందుకు పాస్‌బుక్‌ డేటా కరెక్షన్‌ కింద (టెక్నికల్‌ మాడ్యూల్‌ 33) అవకాశం కల్పించింది.

 

మాడ్యూల్‌ 33 కింద దరఖాస్తు చేసినా..

ధరణిలో అందుబాటులోకి వచ్చిన మాడ్యూల్‌ 33 కింద తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా నారాయణపురం గ్రామ రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లుగా నలుగుతున్న వీరి సమస్యను గుర్తించిన జిల్లా కలెక్టర్‌ శశాంక్‌.. మహబూబాబాద్‌ ఆర్డీవో, నారాయణపురం తహసీల్దారు ద్వారా సమగ్ర విచారణ జరిపించారు. అక్కడ స్థానికంగా నెలకొన్న సమస్యలను అయిదు విభాగాలుగా గుర్తించి పరిష్కారం కోసం ఆగస్టు 23న సీసీఎల్‌ఏకు నివేదికను అందజేశారు. ఇందులో ఒక్కో రైతుది ఒక్కో సమస్య ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో.. 70 మంది రైతులు 184.20 ఎకరాలకు సంబంధించిన భూమికి పెండింగ్‌లో ఉన్న డిజిటల్‌ సిగ్నేచర్‌ (డీఎస్‌) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా కలెక్టర్‌ పరిశీలించి డీఎ్‌సకు ఓకే చేశారు. కానీ, అది ధరణి ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ కావడంలేదు. మరో 203 మంది రైతులు 333.35 ఎకరాలకు పట్టాదారు పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆర్‌ఎ్‌సఆర్‌ వేరియేషన్‌తో భూమి విస్తీర్ణంలో చేర్పులు మార్పులు (ఎడిట్‌ ఆప్షన్‌) చేసేందుకు వీలు కావడంలేదు. మరో 88 మంది రైతులు 112.35 ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందేందుకు పహాణీలో నమోదైన  వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, 2021 జూన్‌లో చేపట్టిన సమగ్ర (ఎంజాయ్‌మెంట్‌) సర్వే నాటి జాబితాలో వీరి పేర్లు లేవు. 130 మంది రైతులు 271.07 ఎకరాలకు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, వీరి వివరాలు సమగ్ర సర్వే జాబితాలోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ లేవు. మరో 231 మంది రైతుల వివరాలు రికార్డుల్లో నమోదై ఉన్నా టెక్నికల్‌ మాడ్యూల్‌ 33లో దరఖాస్తులు చేసుకోలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ధరణి పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో జనరేట్‌ కావడం లేదని జిల్లా కలెక్టర్‌ స్వయంగా సీసీఎల్‌ఏకు నివేదికను అందజేశారు. కలెక్టర్‌ నివేదికతోనైనా నారాయణపురం గ్రామస్థులకు న్యాయం జరుగుతుందా అన్నది చూడాలి.


రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు

మా గ్రామంలోని 1827 ఎకరాలకు 1200 మంది రైతులకు 9 సార్లు రైతుబంధు, 11 సార్లు పీఎం కిసాన్‌ యోజన అందలేదు. చనిపోయిన 40 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా రాలేదు. మేమంతా పోరాడగా సీఎం కేసీఆర్‌ సర్వేకు ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయి 16 నెలలైనా.. ధరణిలో సమస్య పరిష్కారం కాలేదు. 

- రవి, ఎంపీటీసీ సభ్యుడు, నారాయణపురం


సీఎంచెప్పినా పరిష్కరించలేదు 

నాకు 4.20 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో పట్టా భూములను అటవీశాఖ భూములుగా నమోదు చేశారు. అటవీశాఖ ఈ భూములపై క్లియరెన్స్‌ ఇచ్చి 20 నెలలు అయింది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా సమస్యను పరిష్కరించలేదు. నా భూమిని ధరణిలో నమోదు చేసి పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వాలి.

- అమరేందర్‌ రెడ్డి, రైతు, నారాయణపురం

Updated Date - 2022-09-15T09:06:11+05:30 IST