పరిశ్రమల అడ్డాగా పాలమూరు

ABN , First Publish Date - 2022-12-16T02:51:45+05:30 IST

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు వలసలు, కరువుకు కేరాఫ్‌ అడ్ర్‌సగా ఉన్న పాలమూరు.. ప్రస్తుతం పరిశ్రమల అడ్డాగా విరాజిల్లుతోంది. ఉపాధి కోసం ఇక్కడి నుంచి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి క్రమేపి ఇతర ప్రాంతాల వారు

పరిశ్రమల అడ్డాగా పాలమూరు

దివిటిపల్లి వద్ద ఐటీ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌.. ‘అమరరాజా’ కంపెనీ ఏర్పాటు చేసేది ఇక్కడే

పూర్తి కావచ్చిన ఐటీ టవర్‌ నిర్మాణం

జడ్చర్ల సెజ్‌లో 52 పరిశ్రమల ఏర్పాటు

లక్ష మందికిపైగా ఉపాధి

లాజిస్టిక్స్‌ హబ్‌కు కేంద్రం ప్రతిపాదనలు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు వలసలు, కరువుకు కేరాఫ్‌ అడ్ర్‌సగా ఉన్న పాలమూరు.. ప్రస్తుతం పరిశ్రమల అడ్డాగా విరాజిల్లుతోంది. ఉపాధి కోసం ఇక్కడి నుంచి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి క్రమేపి ఇతర ప్రాంతాల వారు ఇక్కడి పరిశ్రమల్లో పని చేసేందుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. రాజధాని హైదరాబాద్‌కు అందుబాటులో ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండడం, 75 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి వెళ్తుండడం.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కలిసొచ్చింది. దీనికితోడు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉండడం, నీరు, విద్యుత్తు వంటి వసతులు కల్పిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండడంతో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు.. పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌, ప్రత్యేక ఆర్థిక మండలిలో ఫార్మాతోపాటు ఇతర రంగాలకు చెందిన 52 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తాజాగా మహబూబ్‌నగర్‌ సమీపంలోని దివిటిపల్లి వద్ద ఐటీ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఐటీ టవర్‌ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇందులో ఆరు సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు తెలిసింది. మరోవైపు ప్రఖ్యాతి గాంచిన అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ రూ.9,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమతో దాదాపు 7,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉమ్మడి జిల్లా పరిధిలో 19,750 ఎకరాల్లో లాజిస్టిక్‌ హబ్స్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. వీటితోపాటు మరో రెండు ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ పరిశ్రమలు, పత్తి ప్రాసెసింగ్‌ పరిశ్రమలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ పూర్తయితే, ఈ ప్రాంతంలోని విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వం ప్రకటిస్తుండటంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

స్థానికులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నా.. స్థానికులకు పెద్దగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌నే తీసుకుంటే.. ఇక్కడి పరిశ్రమల్లో లక్ష మంది పని చేస్తున్నా.. పాలమూరు యువతకు పది శాతం ఉద్యోగాలు కూడా దక్కలేదు. దీంతో పాలమూరు యువత పీజీలు, డిగ్రీలు చదివినా కుటుంబపోషణ కోసం హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో ఆటోడ్రైవర్లు, కారు డ్రైవర్లుగా, ప్రైవేట్‌ సంస్థల్లో గుమాస్తాలుగా పని చేసుకోవాల్సి వస్తోంది. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛెంజ్‌ల్లో నమోదైన లెక్కల ప్రకారం ఈ ఐదు జిల్లాల్లో 96 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో డిగ్రీ, ఆపై చదివిన వారు 40 వేల మంది ఉంటే, 10, ఇంటర్‌, ఆలోపు చదివిన వారు 56 వేల మంది వరకు ఉన్నారు. వీరే కాకుండా మరో లక్ష మంది వరకు అరకొర చదువులు చదివి, హైదరాబాద్‌లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఉమ్మడి పాలమూరు పరిధిలో భారీగా పరిశ్రమలు ఏర్పాటవుతున్న దృష్ట్యా స్థానికులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. స్కిల్‌డెవల్‌పమెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇప్పించాలని, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇలాంటి నిబంధనలు విధించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-16T02:51:46+05:30 IST