పోస్టుల భర్తీకి ఏడాదిన్నర?

ABN , First Publish Date - 2022-03-11T07:36:55+05:30 IST

నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రకటన రానేవచ్చింది. కానీ, ఇదే సమయంలో నిరుద్యోగులను కొన్ని అనుమానాలూ వేధిస్తున్నాయి.

పోస్టుల భర్తీకి ఏడాదిన్నర?

  • బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపు ఒకటి రెండు నోటిఫికేషన్లు?
  • ప్రతి రెండు నోటిఫికేషన్ల మధ్యా వ్యవధి 
  • ఆలస్యం కానున్న ప్రక్రియ!


హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రకటన రానేవచ్చింది. కానీ, ఇదే సమయంలో నిరుద్యోగులను కొన్ని అనుమానాలూ వేధిస్తున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఎంత కాలం పడుతుంది? ప్రక్రియ మొత్తం ఏడాదిలోగా పూర్తి చేసేస్తారా? లేదా అంతకు మించి సమయం పడుతుందా? వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలోగా పూర్తవుతుందా? అంటే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ.. ప్రకటించినంత సులభంగా పూర్తయిపోదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ఒకేసారి 91,142 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి ఇప్పటి నుంచే విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని కూడా వెల్లడించారు. అందులో కాంట్రాక్టు పోస్టులు 11,103 పోను మిగతా 80,039 పోస్టులను ప్రత్యక్ష ఎంపిక విధానంలోనే భర్తీ చేస్తామన్నారు. అయితే.. ఈ వ్యవహారమంతా సీఎం చెప్పినంత వేగంగా పూర్తయ్యే పరిస్థితి లేదని, నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల ఆహ్వానం, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూలు, పోస్టింగులు వంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యే సరికి నెలలు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయాలంటే.. ఏడాది సరిపోదని, ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తే గొప్ప విజయంగా భావించ వచ్చని సచివాలయంలోని ఓ కీలక అధికారి అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. నిరుద్యోగులందరూ దరఖాస్తు చేసుకునేందు అవకాశం కల్పించేలా.. ప్రతి రెండు నోటిఫికేషన్లకూ మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ క్రమంలో మొత్తం నియామక ప్రక్రియ ముగిసేందుకు ఏడాదిన్నరకు పైగా సమయం పట్టవచ్చని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం కొన్ని పోస్టులనైనా భర్తీ చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు. కాగా.. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు కనీసం ఒకటి రెండు నోటిఫికేషన్లు వెలువడే అవకాశముందని కూడా ఆ అధికారి వివరించారు. ఈనెల 15 వరకు సమావేశాలు కొనసాగనుండగా.. ఆర్థికశాఖ అనుమతిస్తే.. ఈ ఐదు రోజుల్లో రెండు నోటిఫికేషన్లు విడుదల కావచ్చని తెలిపారు.  


టీఎ్‌సపీఎస్సీ ద్వారానే ఎక్కువ పోస్టుల భర్తీ... 

ప్రకటించిన  పోస్టుల్లో ఎక్కువగా టీఎ్‌సపీఎస్సీ ద్వారా నే భర్తీ చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఇతర బోర్డులకు ఓ 40 వేలకు పైగా పోస్టులను అప్పగించి, మిగతా పోస్టులను టీఎ్‌సపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రూప్‌-1, 2, 3, 4 పోస్టులన్నింటినీ కమిషనే భర్తీ చేయనుంది. వీటి కిందకు వచ్చే ఆయా శాఖల్లోని పోస్టులను విభజించి, టీఎ్‌సపీఎస్సీకి అప్పగించనున్నారు. కాగా.. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటివరకు గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్లు విడుదల కాలేదు. గ్రూప్‌-3 కింద సచివాలయంలోని వివిధ విభాగాల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా.. ఆ పోస్టుల వివరాలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించ లేదు. ఇక రాష్ట్రంలో టీఎ్‌సపీఎస్సీ కాకుండా మరో మూడు రకాల బోర్డులున్నాయి. పోలీసు శాఖలోని పోస్టులను ‘తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ రికూ్ట్రట్‌మెంట్‌ బోర్డు’ (టీఎ్‌సపీఆర్‌బీ), వివిధ సంక్షేమ శాఖల్లోని పోస్టులను ‘తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌-రికూ్ట్రట్‌మెంట్‌ బోర్డు’ (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) వైద్య ఆరోగ్య శాఖలోని పోస్టులను ‘మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రికూ్ట్రట్‌మెంట్‌ బోర్డు’ (ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ) భర్తీ చేస్తుంటాయి. తాజాగా హోంశాఖలో 18,334 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 


ఈ పోస్టులన్నింటినీ పోలీసు బోర్డుకే అప్పగిస్తారని తెలుస్తోంది.  ఇక వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీని ఏర్పాటు చేసింది.  రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో 7 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. అయితే, ఎంపిక బాధ్యతలను మెడికల్‌ బోర్డుకు ఇవ్వాలా లేక టీఎ్‌సపీఎస్సీకి ఇవ్వాలా అన్న విషయంలోనూ స్పష్టత లేదు. ఇందులో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వంటి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా.. మిగతా పోస్టులను డైరెక్ట్‌ రికూ్ట్రట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే.. వీటిని టీఎ్‌సపీఎస్సీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎ్‌సపీఎస్సీ ద్వారా అయితే.. ఎంపిక ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని, మెడికల్‌ బోర్డుకు అప్పగిస్తేనే.. త్వరగా పూర్తవుతుందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 12,299 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుల బాధ్యతలను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌-రికూ్ట్రట్‌మెంట్‌ బోర్డుకు అప్పగించవచ్చు. డీఎస్సీల ద్వారా టీచర్‌, ఇతర జిల్లా కేడర్‌ పోస్టుల భర్తీ

జిల్లా కేడర్‌, టీచర్‌ పోస్టులను ఆయా జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని డీఎస్సీలలో ఆయా శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ డీఎస్సీల ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు కూడా డీఎస్సీలే కీలక పాత్ర పోషించనున్నాయి. డీఎస్సీలు భర్తీ చేసే పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులు, వివిధ శాఖల్లోని జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. 

Read more