ఆమ్యామ్యాల అడ్డా..రవాణా శాఖ గడ్డ

ABN , First Publish Date - 2022-10-07T18:10:21+05:30 IST

రవాణా శాఖ కార్యాలయాలు ఆమ్యామ్యాల అడ్డాలుగా మారుతున్నాయి. పారదర్శక సేవలను అందిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు నీరుగార్చేలా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది

ఆమ్యామ్యాల అడ్డా..రవాణా శాఖ గడ్డ

నేరుగా వెళ్తే అడ్డంకులు.. ఏజెంట్లతో వెళ్తే స్వాగతాలు

కార్యాలయాల్లో దర్జాగా అవినీతి.. 

పై స్థాయి వరకూ పంపకాలు?


హైదరాబాద్‌ సిటీ: రవాణా శాఖ కార్యాలయాలు ఆమ్యామ్యాల అడ్డాలుగా మారుతున్నాయి. పారదర్శక సేవలను అందిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు నీరుగార్చేలా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలోకి అడుగుపెడితే చాలు  సిబ్బందికన్నా ఏజెంట్లే అడుగడుగునా తారసపడి దండుకుంటున్నారని, వారిని కాదని నేరుగా వెళితే రూల్స్‌ పేరిట సిబ్బంది ఇబ్బంది పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

వాహనం నడపాలన్నా, కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌ చేయాలన్నా, వాటికి రెన్యూవల్‌ చేయాలన్నా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరిని కలవాలో, ఎక్కడ ఉంటారో అర్థం కాని పరిస్థితి. కనీసం గైడ్‌ చేయడానికి కూడా కిందిస్థాయి అధికారి అందుబాటులో ఉండరు. నగరంలోని అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి అని అక్కడికి వెళ్తున్న వారి ఆవేదన. సిబ్బంది లేకున్నా ఏజెంట్లు మాత్రం ఈగల్లా వాలుతుంటారని, కొన్ని సందర్భాల్లో అక్కడ పనిచేసే వారే ఏజెంట్లను పిలిచి వారికి పనులు అప్పగించిన సంఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఏజెంట్లతో పని ప్రారంభం కావాలంటే డబ్బుతోనే స్టార్ట్‌ చేయాలని, అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలని అంటూ వారు అడగడం.. వారికి ఇచ్చుకుంటూ వెళ్లడం సర్వ సాధారణంగా మారిందని చెబుతున్నారు. 

అంతేకాకుండా లెర్నింగ్‌ లైసెన్స్‌ నుంచి పర్మినెంట్‌ లైసెన్స్‌, రెన్యూవల్స్‌, వాహనాల రిజిస్ర్టేషన్‌, పర్మిట్‌, రిజిస్ర్టేషన్‌ రెన్యూవల్స్‌ లాంటి ఏ పని కోసం వెళ్లినా ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి ఏజెంట్ల ద్వారా వసూళ్లకు తెరలేపుతున్నారని సమాచారం. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా.. దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. సిబ్బందిని ప్రశ్నించగా.. ఉన్నతాధికారులకు సైతం వాటా ఉంటుందని, ప్రతినెలా వారికీ అప్పచెప్పాలని కిందిస్థాయి సిబ్బంది పరోక్షంగా చెప్పడం గమనార్హం. 


రూల్స్‌తో బెదిరింపులు

డ్రైవింగ్‌ ట్రయల్‌కు వెళితే కండిషన్‌లో ఉన్న వాహనం ఉండాల్సిన నిబంధన ఉంది. బైక్‌, కారు లేదా (రెండు లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకుంటే ఆ రెండు వాహనాలు) తీసుకెళ్లాలి. ఆయా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ పత్రాలతోపాటు ద్విచక్ర వాహనముంటే హెల్మెట్‌, కారు ఉంటే ఫిట్‌నెస్‌తోపాటు కండిషన్‌లో ఉండే నిబంధనలను చెబుతారు. అవన్నీ సక్రమంగా ఉంటేనే లైసెన్స్‌ పరీక్షకు అనుమతిస్తారు. లేకుంటే అవకాశమివ్వకుండా తప్పించేస్తారు. వాహనం కండిషన్‌ లేకున్నా, ఇతరత్రా ఏదో ఓ సాకు చెప్పి ట్రయల్‌కు సాధ్యం కాదని బెదిరించి పంపించేస్తారు.

 

ఏజెంట్లతో దందా

సిబ్బంది బెదిరింపులను అవకాశంగా మలుచుకుంటున్న రవాణాశాఖ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. చివరకు డ్రైవింగ్‌ వచ్చినా, రాకున్నా.. వాహనం ఉన్నా, లేకున్నా లైసెన్స్‌ ఇప్పిస్తామంటూ దరఖాస్తు దారులను తమవైపు తిప్పుకుంటున్నారు. రిజిస్ర్టేషన్‌ల విషయంలో ఏవైనా తప్పిదాలున్నా పర్వాలేదని భరోసా ఇస్తూ దరఖాస్తులను తీసుకొని పని కానిచ్చేస్తున్నారు. ఏజెంట్ల హవా ఎంతవరకు నడుస్తోందంటే అధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బంది కూడా వారికి ఎదురు చెప్పలేకపోతున్నారు. ఏజెంట్లతో కలిసి లైసెన్స్‌ కోసం వెళితే వాహనం లేకున్నా వారిని ఎవరూ ప్రశ్నించరు. ఫార్మాలిటీ కోసం ఓ నిమిషం పాటు ట్రాక్‌ మీదకు పంపించి అతడిని వెనక్కి రప్పించేస్తున్నారు. ఇదంతా సిబ్బంది ముందే జరుగుతున్నా  అధికారులు పట్టించుకోనట్లు వ్యవహరిస్తారు. టెస్ట్‌ పాస్‌ అని రాయించుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు కుమ్మక్కై డ్రైవింగ్‌ రాకున్నా ఎంతో మందికి లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ పనికోసమైనా ఏజెంట్లతో వెళితే ఇట్టే పూర్తవుతోందని, నేరుగా వెళితే కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని పలువురి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


లొసుగులు చూపి వసూళ్లు

నగరంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులకన్నా కిందిస్థాయి సిబ్బంది, బ్రోకర్లదే రాజ్యంగా మారింది. ఏజెంట్లు ఏం చెబితే ఉన్నతస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు తలలూపుతుంటారు. ఏజెంట్లను, కింది స్థాయి సిబ్బందిని కాదని నేరుగా వెళితే ఆ వ్యక్తికి చుక్కలు చూపిస్తుంటారు. ఏ పనికి వెళ్లినా అక్కడి సిబ్బంది రూల్స్‌ చెప్పి.. లొసుగులు చూపి వచ్చిన వారిని అయోమయానికి గురి చేస్తారు. వాటి బారిన పడకుండా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఏజెంట్ల చేతులు తడిపాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read more