అణువణువునా ‘అధికార’ నిఘా!
ABN , First Publish Date - 2022-10-17T09:32:28+05:30 IST
ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్‌ఎస్..
- మునుగోడులో భారీగా పోలీస్ నిఘా వర్గాలు
- ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది మోహరింపు
- నియోజకవర్గంలో పరిస్థితులపై నిరంతరం టీఆర్‌ఎస్‌కు సమాచారం
- ప్రతిపక్షాల డబ్బు, మద్యం వివరాలూ
నల్లగొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్‌ఎస్.. తనకున్న అన్ని వనరులనూ వాడుకుంటోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కదలికపైనా అనుక్షణం నిఘా పెట్టింది. ఇందుకోసం భారీగా పోలీసు నిఘా వర్గాలను మోహరించింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎఫెక్ట్‌తో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బూర నర్సయ్య.. అదేరోజు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కావడం, ఆయన కదలికలపై ఏమాత్రం సమాచారం లేకపోవడంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. బూర లాంటి నేతల ఫిరాయింపులే కాకుండా.. ఇటు సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలపై, ఆయా పార్టీల వ్యూహాలపై నిరంతరం నివేదిక తెప్పించుకుంటోంది.
ఇందుకోసం రాష్ట్ర ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) సిబ్బందిని మునుగోడులో మోహరించారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉండగా, ప్రతి మండలంలోనూ ముగ్గురు చొప్పున ఇటెంలిజెన్స్ సీఐలను, వీరికి రెట్టింపు సంఖ్యలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను నియమించారు. వీరికి అదనంగా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది గ్రామగ్రామాన పహారా కాస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ నేతలు నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో ఎవరితో టచ్‌లోకి వెళ్తున్నారు? ఏయే మంతనాలు సాగిస్తున్నారు? అవకాశం దొరికితే, సరైన బేరం కుదిరితే బీజేపీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న వారెవరు? అనే అంశాలను నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. దీంతోపాటు ప్రతి ఎంపీటీసీ స్థానం పరిధిలో బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారు స్థానికంగా పూర్తి స్థాయిలో ఉంటున్నారా? అనే అంశాలను హైదరాబాద్‌కు నివేదిస్తున్నారు. ఏయే గ్రామాల్లో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉంది? అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉన్నతాధికారులకు చెబుతున్నారు.
ప్రతిపక్షాల ప్రలోభాల కార్యాచరణపై ఆరా..!
బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం నిల్వలను ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంది? అందుకు సంబంధించిన కార్యాచరణ ఎలా జరుగుతోంది? ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారనే సమాచారాన్ని కూడా నిఘా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న బీజేపీ కీలక నేతల కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగడుతున్నాయి. బీజేపీ, కాంగ్రె్‌సలో అసంతృప్తితో స్థానిక కీలక నేతలు, వారిని పార్టీలో చేర్చుకుంటే ప్రయోజనం చేకూరే వారి జాబితాను ఉన్నతాధికారులకు అందజేస్తున్నాయి. ఉప ఎన్నిక వేళ ఎక్కడెక్కడ ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందో సాధారణ విధుల్లో భాగంగా రిపోర్టు చేసుకుంటూనే అధికార పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపైనా దృష్టి పెట్టాయి.