ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు.. దుర్మరణం పాలయ్యాడు
ABN , First Publish Date - 2022-01-13T05:49:05+05:30 IST
ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు.. దుర్మరణం పాలయ్యాడు
రోడ్డు ప్రమాదంలో చార్టర్డ్ అకౌంటెంట్ మృతి
ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ఏటూరునాగారం, జనవరి 12: ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి స్వగ్రామం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి తండ్రి వద్దకు వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఏటూరునాగారానికి చెందిన రెడ్డి హోటల్ యజమాని మలెపాటి విజయభాస్కర్ రెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి అలియాస్ సాయి (35) కొన్నేళ్లుగా ఉద్యోగ రీత్యా ఇంగ్లాండ్‌లో ఉంటున్నాడు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. మూడేళ్ల క్రితం తల్లి పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. పది రోజుల క్రితమే ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సాయి తండ్రిని చూడ్డానికి ఏటూరునాగారం వచ్చాడు. మూడు రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. కాసేపట్లో చేరుకోనున్న క్రమంలో బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో ఏటూరునాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విన్న విజయభాస్కర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. వద్దన్నా బైక్‌పై హైదరాబాద్‌కు బయల్దేరాడని, ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సిన కొడుకు కానరాని లోకాలకు చేరాడని కన్నీరుమున్నీరయ్యాడు.