నేడే నోటిఫికేషన్
ABN , First Publish Date - 2022-10-07T08:15:33+05:30 IST
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
‘మునుగోడు’లో ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ
నల్లగొండ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ఘట్టం మొదలు కానుంది. ఈ నెల 3న మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదలతో 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణకు గడువు ఉండగా, నవంబరు 3న పోలింగ్, 6వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్లను చండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారు. రెండో శనివారంతో పాటు ఆదివారం సెలవు రోజులైనందున నామినేషన్లను స్వీకరించరు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి చండూరు మండల కేంద్రంగానే నామినేషన్ల స్వీకరణ కొనసాగిస్తున్నారు.
సమితిలు ఉన్న కాలం నాటి నుంచి ఈ ప్రక్రియంతా ఇక్కడే కొనసాగుతోంది. అప్పట్లో బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ ఉన్నందున, చండూరులోని సబ్ ట్రెజరీ కార్యాలయంలోనే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేవారు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి కూడా చండూరులోనే ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి గురువారం కలెక్టరేట్‌లో అన్ని పార్టీల నాయకులతో సమావేశమై కొత్త ఓటర్ల నమోదుపై చర్చించారు. సునిశితంగా పరిశీలించిన తర్వాతే ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అదేవిధంగా చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. రాష్ట్ర అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.