పెరటి తోటలపై పెదవి విరుపు
ABN , First Publish Date - 2022-08-28T05:30:00+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పెరటి తోటల (న్యూట్రీ గార్డెన్స్) పెంపకం కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం అంగన్‌వాడీ టీచర్ల అసలత్వం, అనాసక్తి వల్ల అమలులో నీరుగారిపోతోంది. ఖాళీ స్థలాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు పెరటి తోటలను పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా పెరటితోటల పెంపకం విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఖాళీ స్థలాల కొరత వల్ల పెరటితోటలను పెంచలేకపోతున్నామని టీచర్లు చెబుతున్నా.. ఉన్నచోట వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. వీటి విషయంలో అధికారులు అంగన్‌వాడీ టీచర్లకు తగిన శిక్షణ, అవగాహన కల్పించడం లేదు.
అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో పెంపకంపై నిర్లక్ష్యం
స్థలం ఉన్నా పెంచలేక పోతున్న టీచర్లు
అవగాహన కల్పించడంలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ విఫలం
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై అశ్రద్ధ
నీరుగారుతున్న ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పెరటి తోటల (న్యూట్రీ గార్డెన్స్) పెంపకం కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం అంగన్‌వాడీ టీచర్ల అసలత్వం, అనాసక్తి వల్ల అమలులో నీరుగారిపోతోంది. ఖాళీ స్థలాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు పెరటి తోటలను పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా పెరటితోటల పెంపకం విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఖాళీ స్థలాల కొరత వల్ల పెరటితోటలను పెంచలేకపోతున్నామని టీచర్లు చెబుతున్నా.. ఉన్నచోట వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. వీటి విషయంలో అధికారులు అంగన్‌వాడీ టీచర్లకు తగిన శిక్షణ, అవగాహన కల్పించడం లేదు.
హనుమకొండ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 2018లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహా రం కోసం కేంద్రాల పరిధిలోని కార్యకర్తలు ఖాళీస్థలాల్లో పెరిటి తోటలను (న్యూట్రీగార్డెన్లు) ఏర్పాటు చేయాలి. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించి వాటిని వండి ఆహారంగా అందించాలి.
మార్గదర్శకాలు
గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం విషయంలో అవగాహన అంతగా ఉండదు. ఇందుకు కారణం నిరక్షరాస్యత. దీంతో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకలోపంతో చిన్నారుల్లో ఎదుగుదల మందగిస్తోంది. దీనిని అ ధిగమించడానికి పెరటి తోటల పెంపకానికి కేంద్ర ప్రభు త్వం మార్గదర్శకాలను జారీ చేసింది. తోటల్లో నిత్యం వంటావార్పుల్లో కీలక పాత్ర పోషించే కూరగాయలు, ఆకుకూరల మొక్కలను పెంచాలని సూచించింది. సాధారణ స్వభావం ఉన్న నేలల్లో ఎలాంటి సస్యరక్షణ చర్య లు తీసుకోకున్నా సులువుగా పెరిగే వీలున్న కరవివేపాకు, మెంతికూర, చెక్కకూర, పాలకూర, తోటకూర, కొత్తమీర, బొప్పాయిలాంటి మొక్కలు పెంచాల్సి ఉంటుంది. బెండ, దొండలాంటి అన్ని కాలాలలోనూ కాతనిచ్చే కూరగాయల మొక్కలను పెంచాలి. గ్రామంలోని ప్రజల సహకారం తీసుకొని పందిళ్లు వేసి వీటిని సంరక్షించాలి. మొదట సేంద్రియ పద్ధతిలో సాగుకు అవసరమైన కంపోస్టు ఎరువు లేదా నాణ్యతగల మట్టిని సేకరించి పాదులు తవ్వాలి. వీలైనంత సాగుతో తోటలు కళకళాలాడేలా చూడాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థలాలు ఉంటే చక్కటి చిన్నచిన్న మడులు తయారు చేసి వాటిలో విత్తనాలు పోసి అవి పెరుగుతున్నప్పుడు తగిన రక్షణ కల్పించాలి. స్థలం లేకపోతే ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న తొట్టెలు, ప్లాస్టిక్ టబ్బులు, బకెట్లు, తీసుకువచ్చి వాటిలో మట్టిని నింపి కేంద్రం ఆవరణలో వీటిని పెంచి పోషించాలి.
అక్కడక్కడ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75 మండలాల్లో 3వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 780 కేంద్రాల్లో పెరటి తోటల పెంపకానికి స్థలాలు ఉన్నట్టు గుర్తించినప్పటికీ ప్రస్తుతం 78 చోట్ల మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడ టీచర్లు సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలను పండిస్తున్నారు. ప్రభుత్వమే కార్యకర్తలకు టమాట, వంకాయ, సొర, బీర, మెంతి, కొత్తమీర, పాలకుర, వంటి విత్తనాలను అందించింది.
కేంద్రాల నిర్లక్ష్యం
పెరటితోటలో కూరగాయలు పండించడమే కాకుండా తమ పరిధిలోని మహిళలు, ప్రజలకు సేంద్రియ పంటలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ కార్యకర్తలు పెరటితోటల పెంపకంపై శ్రద్ధ కనబర్చడం లేదు. ఈ క్రమంలో కేంద్రాల్లో స్థల సమస్య, నీరు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఖాళీ స్థలాలు ఉన్న వాటిల్లోనూ పెరటి తోటల ఏర్పాటుకు కార్యకర్తలు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో కోతులు, ఎలుకలు, ఇతరత్రా సమస్యలతో తోటలను నిర్వహించలేకపోతున్నారు.
స్థలాలు కరువు
ప్రస్తుత వర్షాకాలంలో స్థలాలున్న చోట పెరటితోటలను ఏర్పాటు చేస్తే సేంద్రియ ఆకు కూరగాయలతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అయితే చా లా అంగన్‌వాడీ కేంద్రాలు సరైన వసతులు లేకుండా ఉన్నాయి. ఖాళీ స్థలాలు లేవు. ప్రహరీల లేవు. మొక్కలను పెంచినా రక్షణ ఒక సమస్యగా మారింది. ప్రజ ల సహకారం అంతంత మాత్రంగానే ఉంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, వనరులు పట్టించుకోకుండా పెరటితోటలను పెంచాలంటే ఎట్లా అని వారు ప్రశ్నిస్తున్నారు.
పట్టింపేది?
హరితహారంలో భాగంగా రోడ్డపక్కన, ఇతర ఖాళీస్థలాల్లో పెద్దఎత్తున మొక్కలు పెంచాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కానీ, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో పెరటితోటల పెంపకాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తోటల పెంపకానికి అనువైన వాతావరణం నెలకొని ఉన్నది. వసతి సదుపాయం కలిగిన అన్ని కేంద్రాల్లోనూ పెంచేలా చూడాల్సి ఉన్నప్పటికీ ఈ దిశగా పెద్దగా దృష్టి సారించడం లేదు. గతంలో ఈ దిశగా కొంత ప్రయత్నం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. ఉమ్మడి జిల్లాలో పెరటి తోటల పెంపకానికి పక్కా ప్రణాళిక ఏదీ లేకపోవడం వల్ల ఒక మంచి కార్యక్రమం నీరుగారిపోతోంది.