ఉత్తర డిస్కమ్‌ నిలువు దోపిడీ

ABN , First Publish Date - 2022-04-24T08:32:27+05:30 IST

ఉత్తర డిస్కమ్‌ పరిధిలోని దాదాపు అందరు వినియోగదారులూ ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు.

ఉత్తర డిస్కమ్‌ నిలువు దోపిడీ

  • చార్జీల పేరిట దోచుకుంటున్న ఎన్పీడీసీఎల్‌
  • 60 యూనిట్లు కూడా వాడని వినియోగదారులకు
  • ఏడాదిలో రెండుసార్లు డెవలప్‌మెంట్‌ చార్జీలు
  • ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు అడ్డగోలు వసూలు
  • అధిక లోడ్‌ను లెక్కగట్టడంలో లోపభూయిష్ట విధానం


జనగామ జిల్లాలోని బచ్చన్నపేటకు చెందిన పి.సోమయ్య (యూఎస్సీ నెం.10763757) నెలకు 50 యూనిట్ల విద్యుత్తు కూడా వినియోగించరు. కానీ, డెవలప్‌ మెంట్‌ చార్జీల కింద రూ.2124 చెల్లించాలంటూ ఫిబ్రవరి 4న కరెంట్‌ బిల్లు వచ్చింది.


ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సీతారామయ్య (యూఏఎన్‌ 10542779) ఇంట్లో టీవీ లేదు. రిఫ్రిజిరేటర్‌ లేదు. మిక్సీ, గ్రైండర్‌ కూడా లేవు. నెలకు పట్టుమని 60 యూనిట్ల కరెంటు కూడా వాడరు. కానీ, ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీఎల్‌) ఆ ఇంటికి ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు డెవలప్‌మెంట్‌ చార్జీలు వేసింది. మరోసారి మీటర్‌ కాలిపోయిందని చెప్పి ముక్కుపిండి వసూలు చేసుకుంది. 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉత్తర డిస్కమ్‌ పరిధిలోని దాదాపు అందరు వినియోగదారులూ ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా అంతర్గత సామర్థ్యం పేరిట ఎన్పీడీసీఎల్‌ అడ్డగోలుగా దోచుకుంటోంది. అనధికార లోడు పేరుతో అడ్డదిడ్డంగా వసూలు చేయడానికి వీల్లేదని సాక్షాత్తూ టీఎ్‌సఈఆర్‌సీ ఆదేశించినా పట్టించుకోవడంలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1410 కోట్లను అంతర్గత సామర్థ్యం పేరిట వసూలు చేసుకోవాలనేది ఎన్పీడీసీఎల్‌ లక్ష్యం. ఇందుకోసం ఏడాదిగా ఈ అడ్డగోలు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఈఆర్‌సీ నిబంధనల ప్రకారం.. అదనపు లోడు కలిగి ఉంటే తొలుత ఆ ఇంట్లో తనిఖీలు చేసి, ఉపకరణాలు అనుమతించిన లోడు కన్నా అధికంగా ఉన్నాయా అనేది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత నోటీసు జారీ చేయాలి. ఆ తర్వాత లోడుకు మార్చేందుకు వినియోగదారులకు అవకాశం ఇవ్వాలి. కానీ, ఎన్పీడీసీఎల్‌ ఈ ప్రక్రియకు స్వస్తి పలికింది. నోటీసులు ఇవ్వకుండానే రసీదులతోపాటు బిల్లులోనే డెవల్‌పమెంట్‌ చార్జీలు చెల్లించాలని ఆదేశిస్తోంది. ఇళ్లలో ఏమైనా ఫంక్షన్లు జరిగినప్పుడు లోడ్‌ పెరిగే అవకాశాలుంటాయి. ఎప్పుడో ఒకసారి జరిగే శుభకార్యంలో ఉపయోగించే ఉపకరణాల ఆధారంగా లోడును లెక్కగట్టే విధానం లోపభూయిష్టమైందని వినియోగదారులు అంటున్నారు. వినియోగదారుల నుంచి వసూళ్లు చేయాలని ఒక్కసారి అధికారులు నిర్ణయిస్తే.. ముందు వెనుకా చూడకుండా బిల్లులతో బాదేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


లోటు లేదన్నా.. వాత

2022-23లో కరెంట్‌ చార్జీల పెరుగుదలతో డిస్కమ్‌ల లోటు శూన్యస్థాయికి చేరిందని ఈఆర్‌సీ తెలిపింది. కానీ, చార్జీలు పెంచినా లోటు యథాతథంగానే ఉందని డిస్కమ్‌లు అంటున్నాయి. ఇంకా రూ.4097 కోట్ల మేర లోటు ఉందని, దీనిని భర్తీ చేసుకోవడానికి ఏయే మార్గాలు అనుసరించాలో పేర్కొంటూ దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌) ఇటీవలే మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.4097 కోట్లలో దక్షిణ డిస్కమ్‌ వాటా రూ.2687 కోట్లు కాగా, ఉత్తర డిస్కమ్‌ వాటా రూ.1410 కోట్లుగా ఉంది. అయితే దక్షిణ డిస్కమ్‌ కన్నా ఉత్తర డిస్కమ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని విమర్శలు వస్తున్నాయి.

Read more