‘బీఆర్‌ఎస్‌’ను ఆమోదించండి

ABN , First Publish Date - 2022-10-07T09:21:47+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మార్చుతూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలు అందించింది.

‘బీఆర్‌ఎస్‌’ను ఆమోదించండి

ఈసీకి తీర్మానాన్ని అందించిన వినోద్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి 

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా మార్చుతూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలు అందించింది. టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానంతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రాసిన లేఖను గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఽధర్మేంద్ర శర్మకు మాజీ ఎంపీ బీ వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి అందించారు. అనంతరం వినోద్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చుతూ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మాన ప్రతితో పాటు కేసీఆర్‌ రాసిన లేఖను అందించామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పేరిట ఇప్పటికే మూడు పార్టీలున్నట్లు విలేకరులు ప్రస్తావించగా.. పార్టీ పేరు వేరు, అబ్రివేషన్‌ వేరు అని బదులిచ్చారు. టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఎవరూ రాజకీయ పార్టీని నమోదు చేసుకోరాదని, ఆ విషయాన్ని చట్టం చెబుతున్నదని వినోద్‌ కుమార్‌ తెలిపారు. మరోవైపు, ఈ నెల 14లోపు ఎన్నికల సంఘం గుర్తిస్తే బీఆర్‌ఎస్‌ తరఫునే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని, లేదంటే టీఆర్‌ఎస్‌ పేరిటే అభ్యర్థి బరిలో ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 


‘పేరు మార్పునకు అడ్డంకులు ఉండవు’ 

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌లు వీఎస్‌ సంపత్‌, సునీల్‌ అరోరా తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిజిస్టర్‌ అయిన ఏ రాజకీయ పార్టీ అయినా పేరు, కార్యాలయం, ఆఫీసు బేరర్లు, చిరునామా, ఇతర సమాచారానికి సంబంధించి మార్పులుంటే వెంటనే ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని వీఎస్‌ సంపత్‌ గురువారం ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. పేరు మారినా బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ మాత్రమే అవుతుందని, అది జాతీయ పార్టీ కాదని చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ పార్టీకి అవసరమైన ఓట్ల శాతం, సీట్లు వచ్చినప్పుడే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కాగా, టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తే ఎన్నికల గుర్తులు ఆర్డర్‌ ప్రకారం ఆ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని సునీల్‌ ఆరోరా వెల్లడించారు. కాగా, పేరు మారినంత మాత్రాన ఎన్నికల గుర్తు మారదని, అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆ రాష్ట్రాల్లో అదే ఎన్నికల గుర్తుతో వేరే పార్టీ ఉంటే బీఆర్‌ఎస్‌ ఆ రాష్ట్రంలో తన ఎన్నికల గుర్తు మార్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీకి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


సర్దాల్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ ఆఫీసు 

టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సీఎం కేసీఆర్‌ దేశ రాజధానిలోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటుకు సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని 5వ నెంబరు బంగళాను అద్దెకు తీసుకున్నారు. ఇటీవలే ఆ పార్టీ ఎంపీ సంతోష్‌ కుమార్‌ భవనాన్ని పరిశీలించి ఖరారు చేశారు. కాగా, రాజస్థాన్‌ రాజవంశానికి సంబంధించిన ఖైతడి ట్రస్టుకు చెందిన ఈ భవనం, ప్రాంగణం సువిశాలంగా ఉంది. భవనాన్ని ఏడాదికి గాను లీజుకు తీసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. . వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వినియోగానికి అద్దె భవనం సిద్ధమవుతుందని టీఆర్‌ఎస్‌ నేత ఒకరు చెప్పారు. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 6 నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని, ఆ తర్వాత అద్దె భవనం నుంచి నూతన భవనానికి కార్యాలయాన్ని మారుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. 

Read more