కేసీఆర్‌ జాతీయ పార్టీకి మా సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2022-10-05T09:51:22+05:30 IST

సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తెలుగు రాష్ట్రాల్లోని వైఎంసీఏ శాఖల ప్రతినిధులు ప్రకటించారు.

కేసీఆర్‌ జాతీయ పార్టీకి మా సంపూర్ణ మద్దతు

ప్రకటించిన వైఎంసీఏ, ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌, ఇతర క్రిస్టియన్‌ మతపెద్దలు

సికింద్రాబాద్‌, పంజగుట్ట, నిజామాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తెలుగు రాష్ట్రాల్లోని వైఎంసీఏ శాఖల ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని వైఎంసీఏ హాలులో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వైఎంసీఏకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 250 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో 10 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, బంగారు తెలంగాణగా రూపొందిస్తున్న కేసీఆర్‌ జాతీయ స్థాయి రాజకీయాలకు అంకురార్పణ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు వైఎంసీఏ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు డి.రాజేశ్వర్‌రావు, ఆంగ్లో ఇండియన్‌ శాసనసభ్యుడు ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ పాల్గొన్నారు.


ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ బిషప్‌ భాస్కర్‌ ముల్లకల, అధ్యక్షుడు రెవరెండ్‌ శావల జోసెఫ్‌ కూడా కేసీఆర్‌ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.అలాగే.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీఎ్‌సఐ చర్చి పరిధిలోని కమ్యూనిటీహాల్‌లో మెదక్‌ చర్చి బిషప్‌ సాల్మన్‌రాజ్‌ ఆధ్వర్యంలో సమావేశమైన పలువురు క్రిస్టియన్‌ మతపెద్దలు కూడా కేసీఆర్‌ జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందని బిషప్‌ సాల్మన్‌రాజ్‌ అన్నారు. యావత్‌ తెలంగాణ క్రిస్టియన్‌ సమాజం సీఎం వెంట ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 400 సంఘాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇక.. రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజుసాగర్‌కూడా తెలంగాణకు చెందిన క్రైస్తవులంతా సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని అన్నారు. మత్స్యకార సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర సభ్యులు డాక్టర్‌ జి.శ్రీను ముదిరాజ్‌ కూడా కేసీఆర్‌ జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించారు.

Read more