బాపు.. ది మాస్‌ లీడర్‌

ABN , First Publish Date - 2022-08-15T10:17:44+05:30 IST

ఈ రెండు వాక్యాలు చాలు.. స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపే విధానంపై గాంధీజీకున్న స్పష్టతను అర్థం చేసుకోవడానికి! లండన్‌లో బారిస్టర్‌ చదువు చదివి..

బాపు.. ది మాస్‌ లీడర్‌

స్వాతంత్ర్యోద్యమ తీరుతెన్నులను మార్చేసిన మహాత్ముడు


భారతదేశంలో బ్రిటిష్‌ పాలన భారతీయుల సహకారంతోనే ఏర్పడింది. భారతీయుల సహకారంతోనే కొనసాగుతోంది. భారతీయులు ఆ సహకారాన్ని నిలిపేస్తే బ్రిటిష్‌ పాలన అంతమవుతుంది. స్వరాజ్యం సిద్ధిస్తుంది.


...40 ఏళ్ల వయసులో ‘హింద్‌ స్వరాజ్‌’ అనే పుస్తకంలో గాంధీజీ రాసిన వాక్యాలివి. 

రెండు వాక్యాలు చాలు.. స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపే విధానంపై గాంధీజీకున్న స్పష్టతను అర్థం చేసుకోవడానికి! లండన్‌లో బారిస్టర్‌ చదువు చదివి.. దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాలకు పైగా జాతివివక్షను, తెల్లవారి జాత్యహంకారాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన బాపూజీ భారతదేశానికి తిరిగి రావడానికి ఆరేళ్ల ముందు 1909లో రాసిన పుస్తకం ‘హింద్‌ స్వరాజ్‌’. భారతదేశానికి తిరిగి వచ్చాక.. అందులో రాసినట్టుగానే స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపారాయన. అందుకే.. స్వాతంత్ర్యోద్యమం గురించి చెప్పుకోవాలంటే.. గాంధీజీకి ముందు గాంధీజీ వచ్చిన తర్వాత అని చెప్పాల్సి ఉంటుందని చరిత్రకారులు అంటారు. అప్పటివరకు ఎక్కడికక్కడ  జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమాన్ని ఏకతాటిపైకి తెచ్చి మహా జన ఉద్యమంగా మార్చింది మహాత్ముడే. బ్రిటిషర్ల పడగ నీడలో ‘స్వయం పాలన’ కాదు.. సంపూర్ణ స్వరాజ్యమే ఏకైక లక్ష్యమని నినదించారాయన. గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు 1915 జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. అయితే.. గాంధీజీ భారత్‌కు చేరుకున్న నెలన్నరలోపే గోఖలే కన్నుమూయడం గాంధీని కలవరపరచింది. గోఖలేకు ఇచ్చిన మాట మేరకు ఒక ఏడాదిపాటు రాజకీయాలకు దూరంగా ఉండి దేశంలో పరిస్థితులను పరిశీలించారాయన.  


చంపారన్‌తో కొత్త అధ్యాయం

గాంధీజీ గురించి యావద్దేశానికీ తెలిసింది మాత్రం.. 1917లో నిర్వహించిన చంపారన్‌ సత్యాగ్రహం. ఇక ఆ తర్వాత గాంధీజీ.. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పేరే ఒక తారక మంత్రంగా మారింది! గాంధీజీ విజయవంతం కావడానికి కారణం.. ఆయన ప్రజలతో మమేకం కావడం. కొల్లాయి గుడ్డ కట్టుకుని, బక్కపల్చటి దేహంతో.. చిరునవ్వుతో.. ఒక సామాన్యుడిలా కనిపించే ఆ మనిషిని ప్రజలందరూ తమవాడిగా భావించారు. అది గాంధీ సాధించిన తొలి విజయం.  స్వదేశీ, అహింస, సత్యాగ్రహం వంటి విధానాలతో దేశంలోని ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్యోద్యమంలో భాగం చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఉద్యమం అంటే హింసతో కూడిన ఆగ్రహ ప్రకటన, విప్లవం మాత్రమే కాదు.. అలాగని స్వయంపాలన కోసం బ్రిటిష్‌ వారి ని వేడుకోవడమూ కాదు.. ఉద్యమం అంటే భారతీయులకు నష్టం చేసేలా బ్రిటిష్‌ వారు రూపొందించిన చట్టాలను ఉల్లంఘించడం, ఉద్యమం అంటే తెల్లవారికి సహాయాన్ని నిరాకరించడం అని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడమే గాంధీజీ విజయమంత్రం. విదేశీ వస్తు బహిష్కరణ.. ఇది అందరూ చేయగలిగిందే! విదేశీ దుస్తులు కొనడం మానేసి.. రాట్నం వడికి, ఆ నూలుతో తయారైన దుస్తులు ధరించడం.. ఇదీ అందరూ చేయగలిగిందే!! ఇలాంటి చిన్న చిన్న పనులే దేశంలో ప్రతి ఒక్కరూ చేసేలా చూడడం ద్వారా బ్రిటిషర్ల ఆర్థిక పునాదులు కంపించేలా చేయగలిగారు గాంధీ. ఆయన పిలుపు మేరకు ప్రజలు విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతో.. 1920-21తో పోలిస్తే.. 1921-22లో మనదేశానికి విదేశీ వస్త్రాల దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. ఆయన పిలుపుతో దేశవ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు సైతం వీధుల్లోకి వచ్చి అహింసామార్గంలో నిరసనలు తెలపడం మొదలైంది. ఇంటింటా రాట్నం స్వేచ్ఛాకాంక్షకు ప్రతీకగా మారింది. ఒక్క 1921లోనే గాంధీజీ పిలుపు మేరకు 6 లక్షల మంది భారతీయ కార్మికులు దేశం నలుమూలలా 396 సమ్మెలు నిర్వహించారు. దీనివల్ల బ్రిటి్‌షవారికి 70 లక్షల పనిదినాల నష్టం వచ్చింది. అన్నింటికీ మించి.. ఉద్యమకారుల అహింసా విధానం తెల్లవారికి దిక్కుతోచకుండా చేసింది. 


తొలి ఆందోళన

 1915 నుంచి 1917 దాకా దేశంలోని పలు ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన గాంధీ.. దేశంలోని అమాయక పేదలను వివిధ దేశాల్లోని బ్రిటిష్‌ కాలనీల్లో వెట్టి చాకిరీ చేయడానికి తరలించడం చాలా ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. వారి కోసం రంగంలోకి దిగారు. 1917 మే 31 నాటికల్లా ఈ విధానాన్ని రద్దు చేయాలని వారంతా కలిసి దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనకు దిగొచ్చిన బ్రిటిష్‌ ప్రభుత్వం కూలీలను  తరలించడాన్ని నిలిపివేస్తామని ప్రకటించింది.  


అహింసతో ఘన విజయం

ఉప్పు సత్యాగ్రహ సమయంలో తెల్లవారు ఎంత కొట్టినా.. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న ఉద్యమకారులంతా అహింసను పాటించడం ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. అంతకు ముందు అంతర్జాతీయ మీడియాలో స్వాతంత్ర్యోద్యమానికి అంతగా దక్కని చోటు.. మహాత్ముడి అహింసా సిద్ధాంతంతో దొరికింది.   సమాజంలో పరస్పరం వ్యతిరేకంగా ఉండే వర్గాలను (హిందు, ముస్లింలు.. అగ్రవర్ణాలు, దళితులు) ఏకతాటిపైకి తేవడం కూడా గాంధీజీ సాధించిన ఘనవిజయాల్లో ఒకటి. ఇలా రకరకాల కోణాల్లో స్వాతంత్ర్యోద్యమాన్ని నిర్మించి సఫలీకృతం చేసినందునే.. ఈరోజుకీ ఆయనపై, ఆయన ప్రవచించిన సిద్ధాంతాలపై గొప్పగొప్ప పండితులు పుస్తకాలు రాస్తున్నారు. 

Read more