Naveen Reddy Arrest: నవీన్‌రెడ్డి అరెస్టు!

ABN , First Publish Date - 2022-12-14T02:34:58+05:30 IST

మన్నెగూడ దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ ఎస్‌ఓటీ, ఆదిభట్ల పోలీసులు సమష్టిగా గాలించి నవీన్‌రెడ్డిని గోవాలోని కండోలిం బీచ్‌ వద్ద మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు.

Naveen Reddy Arrest: నవీన్‌రెడ్డి అరెస్టు!

5 రోజుల తర్వాత గోవాలో అదుపులోకి

డెంటిస్ట్‌ వైశాలి కిడ్నాప్‌ కేసు కొలిక్కి

సంచలనం సృష్టించైనా ఆమెను

పెళ్లాడేందుకు నవీన్‌రెడ్డి పథకం

నిశ్చితార్థమని తెలిసీ 50 మందితో దాడి

రాడ్లతో 5 కార్లు ధ్వంసం చేసి మరీ కిడ్నాప్‌

పోలీసులు వేటాడుతున్నారని తెలిసి పరార్‌

హౖదరాబాద్‌ సిటీ/ఆదిభట్ల, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మన్నెగూడ దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ ఎస్‌ఓటీ, ఆదిభట్ల పోలీసులు సమష్టిగా గాలించి నవీన్‌రెడ్డిని గోవాలోని కండోలిం బీచ్‌ వద్ద మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. గత శుక్రవారం వైశాలి ఇంటిపై నవీన్‌రెడ్డి 50 మందితో కలిసి దాడి చేసి, ఆమెను కిడ్నాప్‌ చేయగా కొన్ని గంటల్లోనే పోలీసులు ఆమెను రక్షించారు. దాడిలో పాల్గొన్న 32 మందిని మర్నాడు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి ఐదు రోజులుగా పరారీలో ఉన్నాడు. రాచకొండ అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబు అధ్వర్యంలో నాలుగు పోలీసులు బృందాలు గాలించాయి. సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా లోకేషన్‌ గుర్తించి అతడు గోవాలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి. మంగళవారం సాయంత్రం గోవాలోని కండోలిం బీచ్‌లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌ నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిని బుధవారం ఉదయం కల్లా హైదరాబాద్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండలో వైశాలిని వదిలేసి

కన్నవారు ఒప్పుకుంటే తప్ప పెళ్లి చేసుకోనని యువ వైద్యురాలైన వైశాలి స్పష్టం చేయడం.. అడిగితే ఆమె తల్లిదండ్రులు కూడా వివాహానికి అంగీకరించకపోవడంతో సంచలనం సృష్టించైనా ఆమె మెడలో తాళి కట్టాలనుకున్నాడు నవీన్‌ రెడ్డి! ఇందుకు ‘మిస్టర్‌ టీ’ పేరుతో నడుస్తున్న తన టీ స్టాల్‌లో పని చేసే వారిలోంచి 50 మందిని పోగేసుకున్నాడు. వారికి పూటుగా మందు తాపి.. వారికి కర్రలు, రాడ్లు ఇచ్చి కార్లు, మినీ ట్రక్కులో ఎక్కించుకొని వైశాలి ఇంటికి చేరుకున్నాడు! అక్కడ పార్క్‌ చేసి ఉన్న ఐదు కార్ల అద్దాలను పగులగొట్టి.. ఇంట్లోకి వెళ్లి కనిపించిన సామగ్రిని ధ్వంసం చేసి వైశాలిని అక్కడ నుంచి కారులో తీసుకెళ్లిపోయాడు. అప్పటికే ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనమవ్వడం.. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలియడంతో నవీన్‌ భయపడిపోయాడు! నల్లగొండలో వైశాలిని వదిలేశాడు. ఆమెను మరో కార్లో ఎక్కించి.. ఆమెను హైదరాబాద్‌లో దిగబెట్టాలని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు!! ఈ మేరకు ఐదు రోజుల క్రితం జరిగిన ఆదిభట్ల కిడ్పాప్‌ కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వివరాలు పేర్కొన్నారు. ఆ వివరాల ప్రకారం.. నిరుడు బొంగులూరులోని ఆర్మీ స్పోర్ట్స్‌ అకాడమీలో వైశాలికి నవీన్‌రెడ్డితో పరిచయమేర్పడింది. కొద్దిరోజుల తర్వాత వైశాలి మొబైల్‌ నంబర్‌ తీసుకున్న నవీన్‌రెడ్డి తరచూ ఆమెకు ఫోన్‌ చేసేవాడు. మెసేజ్‌లు పంపేవాడు. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నట్లు చెప్పాడు.. ఆమెతో కలిసి కొన్ని ఫొటోలు దిగాడు. తరచూ ఆమె ఎదుట పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే చేసుకోవడం కుదరదని అతడికి వైశాలి చెప్పేది. ఆమె తల్లిదండ్రులను ఒప్పించేందకు నవీన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ కూతురిని అతడికిచ్చేందుకు వారు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో వైశాలికి, నవీన్‌కు దూరం పెరిగింది. పెళ్లికి వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం.. తనను ఆమె దూరం పెడుతుండటంతో నవీన్‌ కక్ష పెంచుకున్నాడు. ఎంతకైనా తెగించి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలకున్నాడు.

కిడ్నా్‌పకు ముందే ఇద్దరి మధ్య సమస్యలు

వైశాలిని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారం ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ తెరిచి.. వైశాలితో కలిసి దిగిన ఫొటోలను అందులో పోస్టు చేసి వైరల్‌ చేశాడు. దీనిపై వైశాలి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది మనసులో పెట్టుకున్న నవీన్‌, వైశాలి ఇంటి ముందు ఖాళీగా ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. అక్కడ ఓ షెడ్డును నిర్మించి గోదాంగా వాడుతున్నాడు. ఈ ఏడాది గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా తన స్నేహితులతో కలిసి వైశాలి ఇంటిముందు నవీన్‌ నానా హంగామా సృష్టించాడు. దాంతో మరోసారి అతడిపై వైశాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంచలనం సృష్టించైనా వైశాలిని పెళ్లాడాలన్న పథకంతో ఉన్న నవీన్‌, అందుకు ప్రణాళికలు వేస్తుండగానే ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని.. ఈనెల 9న నిశ్చితార్థం అని తెలిసింది. ఇదే అవకాశంగా భావించి మందిమార్బలంతో ఆమె ఇంటికి వెళ్లాడు. అనుకున్నట్లుగా ఆమెను కిడ్నాప్‌ చేశాడు. ఈ క్రమంలో ఇంట్లోని సీసీ కెమెరాలు, డీవీఆర్‌ను తన వెంట తీసుకెళ్లాడు.

బలవంతంగానైనా తాళి కట్టాలని

వైశాలిని కిడ్నాప్‌ చేసిన నవీన్‌రెడ్డి ఆమెను కారులో ఎక్కించుకొని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నల్గొండ వైపు తీసుకెళ్లాడు. బలవంతంగా పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే వైశాలి కిడ్నాప్‌ ఘటన టీవీలు, వాట్సా్‌పలు, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయింది. తనను పట్టుకొని వైశాలిని రక్షించడానికి పోలీసులు బృందాలుగా విడివడి గాలిస్తున్నట్లు నవీన్‌ కు తెలిసింది. దాంతో భయపడిపోయిన నవీన్‌, అతడి స్నేహితులు నల్లగొండ వద్ద కారులోంచి దిగిపోయారు. అనంతరం మరో ఇద్దరు నవీన్‌ స్నేహితులు వోల్వో కారులో వైశాలిని తీసుకొని హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి 8 గంటలకు తాను క్షేమంగా ఉన్నట్లు వైశాలి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. అప్పటికే పోలీసులు సిగ్నల్స్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి వైశాలిని రక్షించారు. అదే రోజు ఇద్దరు నిందితులను, మరుసటి రోజు మరో 30 మంది నిందితులును అరెస్టు చేశారు. కాగా మూడేళ్ల క్రితం వరంగల్‌లో నవీన్‌కు వ్యతిరేకంగా ఓ చీటింగ్‌ కేసు నమోదైంది. విజయాంశ్‌ అనే ఓ ప్రైవేటు కంపెనీలో పెట్టుబడి పెడితే 5 శాతం లాభాలు వస్తాయని నమ్మించి అతడు కొంత మంది దగ్గర డబ్బు వసూలు చేశాడు. వరంగల్‌ వీవర్స్‌ కాలనీకి చెందిన రాము అనే వ్యక్తి తానిచ్చిన రూ.27 వేలకు లాభాలేవీ రాకపోవడంతో నవీన్‌పై పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో నవీన్‌ను 14 రోజుల రిమాండ్‌కు కూడా తరలించారు. కేసు ఇంకా నడుస్తోంది.

Updated Date - 2022-12-14T02:34:59+05:30 IST