నీ భార్యను తీసుకురా!

ABN , First Publish Date - 2022-01-07T08:00:01+05:30 IST

‘తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నన్ను ఆదుకుంటాడని భావించి ఎమ్మెల్యే కుమారుడ్ని ఆశ్రయిస్తే.. నా సమస్య తీర్చకపోగా, అతనే సమస్యగా మారాడు. నా భార్య పైనే కన్నేశాడు.

నీ భార్యను తీసుకురా!

 • ఆమెను హైదరాబాద్‌ తీసుకొస్తేనే నీ సమస్య తీరుతుంది
 • లేదంటే ఎవరి దగ్గరికెళ్లినా ఏమీ చేయలేరు
 • ఆస్తిలో నయా పైసా కూడా నీకు రాదు
 • నేను చెప్పిన పనిచేస్తేనే నీకేం కావాలో చేస్తా
 • ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవ బెదిరింపులు
 • సెల్ఫీ వీడియోలో వాపోయిన నాగరామకృష్ణ
 • రాఘవ దౌర్జన్యాలకు ఎన్నో కుటుంబాలు బలి
 • అలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి..?
 • అతని తీరుతోనే ఆత్మహత్య నిర్ణయమని వెల్లడి
 • వనమా రాఘవ చుట్టూ బిగిసిన ఉచ్చు
 • చర్యలు తీసుకోవాలంటూ పలు పార్టీల నిరసనలు
 • పాల్వంచలోని వనమా ఇంటి వద్ద ఉద్రిక్తత
 • హైదరాబాద్‌లో రాఘవ అరెస్టు?


పాల్వంచ రూరల్‌, జనవరి 6: ‘తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నన్ను ఆదుకుంటాడని భావించి ఎమ్మెల్యే కుమారుడ్ని ఆశ్రయిస్తే.. నా సమస్య తీర్చకపోగా, అతనే సమస్యగా మారాడు. నా భార్య పైనే కన్నేశాడు. అన్ని రకాలుగా మమ్మల్ని లోబర్చుకోవాలని చూశాడు. అతని కబంద హస్తాల నుంచి తప్పించుకొనే దారి లేకనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’.. ఇదీ పాల్వంచలో ఆత్మహత్యకు పాల్పడిన నాగరామకృష్ణ ఆవేదన. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భార్య, చూడచక్కని కవల పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి, తానూ అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ నాగరామకృష్ణ.. చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌రావు కీచకపర్వాన్ని బట్టబయలు చేసింది. 


సెల్ఫీ వీడియో సారాంశమిదీ.. 

‘మాకున్న రెండెకరాల్లో మా అమ్మ నాకు వాటా ఇవ్వడం లేదు. సొంత ఇంట్లోనూ ఆమే ఉంటోంది. నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా. ఇక మా అక్కకు పొలం, ఆస్తులున్నాయి. ఆమె ఇంటికి కిరాయి కూడా వస్తోంది. వారికి అద్దె భారం కూడా లేదు. నాకేమో ఆస్తులు లేవు. కిరాయిలూ భారమే. వారు ఆర్థికంగా బలంగా ఉన్నారు. నా పరిస్థితేమో అద్దె చెల్లించాలి, కుటుంబ పోషణకు సంపాదించుకోవాలి. అప్పులు తీర్చుకోవాలి. ఇంత ఒత్తిడిలో ఉన్నానని తెలిసి కూడా కన్న తల్లి, అక్క నామీద కక్ష సాధిస్తున్నారు. ఇస్తానన్నవి ఇవ్వడం లేదు. నేను ఎంతని తట్టుకోగలను? ఈ మధ్యలో వనమా రాఘవేందర్‌రావు.. ఏ భర్తా వినకూడని మాట నాతో మాట్లాడాడు. అదీ ఆర్డర్‌ వేశాడు. నీ సమస్య తీరాలంటే పిల్లలు లేకుండా నీ భార్యను తీసుకుని హైదరాబాద్‌ రా. అప్పుడు నీ సంగతి చూస్తా. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎవరి దగ్గరకు వెళ్లినా ఏమీ చేయలేరు. నీ భార్యను ఎప్పుడు హైదరాబాద్‌ తీసుకొస్తావో.. అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప.. ఎంతమందితో చెప్పుకొన్నా ఏం చేసుకున్నా సరే.. ఆస్తిలో నయా పైసా నీకు రాదు. నేను చెప్పిన పని చేస్తే నీకేం కావాలో అది చేస్తా అన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏంచేయాలి? రాజకీయ, ఆర్థిక బలుపుతో ఎదుటి వ్యక్తుల బలహీనతలతో ఆడుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల బలైపోయాయి. కొన్ని బయటకు వచ్చాయి. కొన్ని రాలేదు. రాజకీయ, ఆర్థిక బలుపు ఉన్న రాఘవ లాంటి వ్యక్తికి ఏ పార్టీలూ సహకరించవద్దు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబసభ్యులే శత్రువులుగా మారిన క్రమంలో పలుకుబడి గల రాఘవ వారికి అండగా నిలవడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఒక్కడినే చనిపోతే తర్వాత నా కుటుంబాన్ని రాఘవ వదిలిపెట్టడు. అందుకే కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నా. నాకు ఆస్తిలో రావాల్సిన వాటాను నేను ఇవ్వాల్సిన వారికి ముట్టజెప్పి న్యాయం చేయండి’ అని సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు.


బిగిసిన ఉచ్చు..

ఈ ఘటనలో ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసులో అతను ప్రధాన నిందితుడిగా(ఏ2) ఉండడంతో పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 5 నెలల క్రితం ఇదే తరహా ఫైనాన్సియర్‌ ఆత్మహత్య కేసులో ఏ1గా ఉన్న రాఘవ కోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ కేసులో ఒత్తిళ్లు లేకపోయినా కోర్టు ఆదేశాలతో అరెస్టుకు అవకాశం లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. అప్పుడు పోలీసుశాఖపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే రాఘవను రక్షించారన్న ఆరోపణలు వచ్చాయి.  


వనమా రాఘవ అరెస్ట్‌?

హైదరాబాద్‌లో రాఘవను పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పూర్తి బందోబస్తు మధ్య అతన్ని పాల్వంచ తరలిస్తున్నట్లు తెలిసింది. అరెస్టు విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించడం లేదు. సంఘటన జరిగిన రోజే రాఘవ ఇంటి నుంచి పరారయ్యాడు. పలు టీవీ చానళ్లతో మాట్లాడుతూ తాను నిర్దోషినని చెబుతూ వచ్చాడు. నాగరామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌, ఆయన సెల్ఫీ వీడియో ఆధారంగా పాల్వంచ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశామని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.


వనమా ఇంటి వద్ద ఆందోళన.. 

రాఘవను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ఎదుట బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన రాఘవ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పాతపాల్వంచ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, రాఘవను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటి గేటు వద్ద బైఠాయించిన బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 


రాఘవ అరెస్టుకు సహకరిస్తా: ఎమ్మెల్యే వనమా

తన కుమారుడు రాఘవ అరెస్టుకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం బహిరంగ లేఖను విడుదల చేశారు. కేసు పరిష్కారమయ్యే వరకు రాఘవను రాజకీయాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంచుతానని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఒక్క రామకృష్ణ కేసులోనే కాక రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర కేసుల్లోనూ తాను ఏనాడూ చట్టాలను, అధికారులను ప్రభావితం చేయలేదని తెలిపారు.


వనమా రాజీనామా చేయాలి: సీపీఐ 

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు రాఘవ వేధింపులు మానవత్వానికే మచ్చతెచ్చేలా ఉన్నాయన్నారు. ఒక కుటుంబం బలవన్మరణానికి కారకుడైన రాఘవను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాఘవపై రౌడీషీట్‌ తెరవాలని డీజీపీకి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-01-07T08:00:01+05:30 IST