నాకు ప్రాణహాని ఉంది

ABN , First Publish Date - 2022-08-04T10:02:31+05:30 IST

తనకు ప్రాణహాని ఉందని, ఇదే విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

నాకు ప్రాణహాని ఉంది

ఈడీ అడిగిన ఆధారాలిచ్చా:  చీకోటి ప్రవీణ్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, హనుమకొండ స్పోర్ట్స్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తనకు ప్రాణహాని ఉందని, ఇదే విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ బుధవారం సుమారు గంట సేపు విచారించింది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని విచారణ అనంతరం ప్రవీణ్‌ విలేకరులకు తెలిపారు. హవాలా రూపంలో డబ్బు మళ్లించానో లేదో అనే దానికి ఈడీ అధికారులకు పూర్తి అధారాలు సమర్పించానని చెప్పారు. తాను క్యాసినో ఆడిపిస్తున్నానని, గోవాలో అది చట్ట వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. క్యాసినో ఆడేందుకు వచ్చేవాళ్లను తాను ఎందుకు అడ్డుకుంటానని ప్రశ్నించారు. చాలామంది తనపై చేతికాని ఆరోపణలు చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశారని వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని అన్నారు. కాగా ట్విటర్‌లో తన పేరిట ఖాతా తెరిచి తప్పుడు సమాచారం షేర్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా,  చీకోటి ప్రవీణ్‌తో తమకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ చిట్‌ ఫండ్స్‌ ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రవీణ్‌కు భవితశ్రీ చిట్‌ఫండ్స్‌ యాజమాన్యానికి మధ్య ఆర్థిక సంబంధాలున్నాయంటూ కొన్ని న్యూస్‌ చానళ్లలో వస్తున్న వార్తలను బుధవారం ఆయన ఖండించారు. 

Updated Date - 2022-08-04T10:02:31+05:30 IST