రాత్రంతా పక్కనే ఉండాలి!

ABN , First Publish Date - 2022-09-08T09:32:34+05:30 IST

అది హయత్‌నగర్‌ పాత రోడ్డులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌! పర్యవేక్షణ మరింతగా ఉంటుందని

రాత్రంతా పక్కనే ఉండాలి!

  • విద్యార్థులపై వార్డెన్‌ లైంగిక వేధింపులు
  • వారం రోజులుగా ముగ్గురికి నరకం
  • ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్లో దారుణం
  • హయత్‌నగర్‌లో వెలుగులోకి.. ఉద్యోగం నుంచి తొలగింపు


అబ్దుల్లాపూర్‌మెట్‌, సెప్టెంబర్‌ 7(ఆంధ్రజ్యోతి): అది హయత్‌నగర్‌ పాత రోడ్డులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌! పర్యవేక్షణ మరింతగా ఉంటుందని, ఆ రకంగా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారనే ఆశతో తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులు కట్టి పిల్లలను అక్కడే ఉంచి చదివిస్తున్నారు! విద్యార్థుల బాధ్యతను చూడాల్సిన వార్డెన్‌ కామంతో కళ్లు మూసుకుపోయి వారిపై లైంగికవేధింపులకు పాల్పడుతున్నాడు! ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి, తిరిగి ఆ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు వెళ్లనంటూ మొండికేయడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను వార్డెన్‌ కొంత కాలంగా లైంగిక వేధిస్తున్నాడు. రాత్రి పూట తనతో పాటు పడుకోవాలని వారిని వేధిస్తున్నాడు. ఈ దారుణాన్ని వారు బయట ఎవరికైనా చెబుతారనే ఉద్దేశంతో ఇతరులెవ్వరితోనూ మాట్లాడొద్దని, భోజన సమయంలో కూడా తనతోనే ఉండాలని ఆ విద్యార్థులను భయపట్టేవాడు. వారం రోజులుగా ఆ ముగ్గురు విద్యార్థుల పక్కనే పడుకొని తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి వారం క్రితం తన స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో కారణం ఏమిటని తల్లిదండ్రులు గట్టిగా ఆడగడంతో జరిగిన దారుణాన్ని వారికి వెల్లడించాడు. బుధవారం ఆ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో కలిసి స్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్‌ నిర్లక్ష్యం వల్లనే వార్డెన్‌ ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. వార్డెన్‌పై వెంటనే చట్టపరమైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్కూల్‌ ప్రిన్సిపాల్‌... ఆ వార్డెన్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వారికి తెలిపారు. ఈ విషయంపై హయత్‌నగర్‌ ఎంఈవోకు ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-09-08T09:32:34+05:30 IST