పోడు భూములపై కదలిక

ABN , First Publish Date - 2022-09-13T09:56:18+05:30 IST

రాష్ట్రంలోని పోడు భూముల వ్యవహారంపై కదలిక వచ్చింది. పోడు రైతుల దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లాల వారీగా కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

పోడు భూములపై కదలిక

దరఖాస్తుల పరిశీలనకు  కమిటీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోడు భూముల వ్యవహారంపై కదలిక వచ్చింది. పోడు రైతుల దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లాల వారీగా కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు ఆయా జిల్లాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. కమిటీ చైర్మన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సభ్యులుగా పోలీస్‌ కమిషనర్‌, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ, స్థానిక సంస్థలు), ఐటీడీఏ పీవో, డీఆర్‌డీఏ అధికారి, డీటీడీవోలు ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, స్థానిక పరిస్థితుల మేరకు ఇతరులను కూడా నియమించుకోవచ్చు. కమిటీకి కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్‌ బాధ్యత వహిస్తారు. అలాగే జిల్లా కోఆర్డినేట్‌ కమిటీ కూడా ఉంటుంది. ఇందులో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పోడుభూములపై ఏకాభిప్రాయాన్ని సాధించాలి. పంచాయతీ స్థాయిలోనే అడవులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా పోడు భూములను గుర్తించేలా ఈ కమిటీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అటవీ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు సమర్థ అధికారిని కూడా నియమించుకోవచ్చు. మొత్తానికి పోడు భూముల సమస్యను జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. అయితే పార్లమెంటులో చట్టసవరణ చేస్తేనే పోడు సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారం లేకుండా ఈ ప్రక్రియ పూర్తవుతుందా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. 

Read more