మాతృత్వానికి మచ్చ!

ABN , First Publish Date - 2022-08-31T09:26:00+05:30 IST

ఆ తల్లిది గుండెనా? రాతిబండనా? ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు మూడేళ్ల కుమారుడిని చంపాలని పథకం వేసింది.

మాతృత్వానికి మచ్చ!

ప్రియుడితో కలిసి మూడేళ్ల బిడ్డను చిత్రవధ చేసి చంపిన తల్లి 

బాబుపై అతడి అత్యాచారం.. మలద్వారంలో ఐరన్‌ రాడ్డు పెట్టి హింస 

తల, కాలేయం, పొట్ట భాగంలో పిడిగుద్దులు.. అంతా ఆమె కళ్లెదుటే


రాంనగర్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆ తల్లిది గుండెనా? రాతిబండనా? ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు మూడేళ్ల కుమారుడిని చంపాలని పథకం వేసింది. ముక్కు పచ్చలారని ఆ చిన్నారిని ప్రియుడు చిత్రహింసలు పెడుతుంటే కళ్లప్పగించి చూసింది!!  ఆ చిన్నారి.. గుక్కపెట్టి ఏడుస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే ఆమెలో అప్పటికి కదలిక వచ్చింది!! తన ఈ నేరాన్ని దాచిపెట్టేందుకు బాబును ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ.. బాబు కుర్చీపై నుంచి పడ్డాడని వైద్యుల ఎదుట ఓ కట్టుకథ అల్లింది. కాసేపటికి చిన్నారి ఊపిరొదిలేస్తే తన పథకం నెరవేరిందని భావించింది.  చివరకు అసలు విషయం బయటకు రావడంతో ప్రియుడితో కలిసి జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ముషీరాబాద్‌లో మూడేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కన్నబిడ్డను వివాహిత, ప్రియుడితో కలిసి హత్యచేసిందని నిర్ధారించారు. మంగళవారం మీడియా సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేశ్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌, నాగలక్ష్మి దంపతులకు పవన్‌ (7), భరత్‌ కుమార్‌ (3) కుమారులు. నాగలక్ష్మికి అప్పటికే అదే జిల్లా మాధవనగర్‌ గ్రామానికి చెందిన రవి (33)తో వివాహేతర సంబంధం ఉంది. రవి పార్సిగుట్ట మున్సిపల్‌ కాలనీ ప్రకాశ్‌ ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఇక ఉన్న ఊర్లో ఇల్లు గడవడం భారంగా మారడంతో రవి సహకారంతో భర్తను, ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని నాగలక్ష్మి హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ కుటుంబం, ముషీరాబాద్‌ మోహన్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ సమీపంలో అద్దె ఇల్లు తీసుకొని ఉంటోంది. శివకుమార్‌ను పెయింటర్‌గా రవి పనిలో పెట్టించాడు. రవి కూడా నాగలక్ష్మి ఇంట్లోకి మారాడు. అతడు తనకు అన్న వరుస అవుతాడంటూ నాగలక్ష్మి స్థానికులకు చెప్పి.. వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. పెద్ద కుమారుడు పవన్‌ బడికి వెళతాడు. భరత్‌కు మూడేళ్లు కావడంతో అంగన్‌వాడీ కేంద్రానికి పంపుతున్నారు. ఉదయం దిగబెట్టి మధ్యాహ్నం ఇంటికి తీసుకొస్తున్నారు. పెయింటింగ్‌ పనిలో శివకుమార్‌ రోజంతా బయటే ఉంటాడు. ఇలా మొత్తంగా పగటి పూట ఇంట్లో ప్రియుడితో తన ఏకాంతానికి చిన్న కుమారుడైన భరత్‌ అడ్డుగా ఉన్నాడని నాగలక్ష్మి భావించింది. ప్రియుడితో కలిసి బాబు హత్యకు పథకం వేసింది. జూలై 8న ఎప్పటిలాగే కుమారుడిని స్థానిక అంగన్‌వాడీ పాఠశాలకు పంపించింది.  మధ్యాహ్నం ప్రియుడు రవిని అంగన్‌వాడీ కేంద్రానికి పంపి భరత్‌ను ఇంటికి తెప్పించింది. అనంతరం నాగలక్ష్మి చూస్తుండగానే బాలుడిపై రవి అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. బాలుడి తల, కాలేయం, కడుపు భాగాల్లో బలంగా ఐరన్‌ రాడ్‌తో కొట్టాడు. తీవ్ర గాయాలతో బాబుకు రక్తస్రావం జరగడంతో పాటు  వాంతులు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం నాగలక్ష్మి.. భర్త శివ కుమార్‌కు ఫోన్‌ చేసి భరత్‌ కుర్చీపై నుంచి కిందపడ్డాడని, గాయాలయ్యాయని, వాంతులు చేసుకున్నాడని చెప్పింది. శివకుమార్‌ వెంటనే ఇంటికి చేరుకొని.. భార్య సహకారంతో బాలుడిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.   వైద్యులు బాలుడిపై ఉన్న గాయాలు  చూసి బాలుడిని ఎవరో ఉద్దేశపూర్వకంగానే కొట్టారని నిర్ధారించుకొని.. ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి వైద్యులతో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటికే బాలుడు మృతిచెందాడు. 


కేసు వద్దంటూ తల్లి హంగామా

పోలీసు కేసు నమోదైతే బండారమంతా బయటపడుతుందనే భయంతో నాగలక్ష్మి కేసు పెట్టకుండా మృతదేహాన్ని ఇవ్వాలని అడిగింది! పోలీసులు మాత్రం శివకుమార్‌తో ఫిర్యాదు తీసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగించారు. పది రోజుల క్రితం బాలుడి  పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. బాలుడి మర్మాంగాలు దెబ్బతిన్నాయని, మలద్వారం నుంచి రక్తస్రావం ఉందని, కాలేయం చితికిపోయిందని, మెదడుపె ౖగాయాలున్నాయని రిపోర్టులో వచ్చాయి. అనంతరం విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నాగలక్ష్మి, రవి కలిసే పథకం ప్రకారం బాలుడిని హత్యచేసినట్లు నిర్ధారించుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. ఘటనను హత్య కేసుగా మార్చి నిందితులను రిమాండ్‌కు తరలించారు. 


భర్త ఆస్తి అమ్మి పారిపోవాలనే కుట్ర 

కన్నబిడ్డ హత్య తర్వాత నాగలక్ష్మి ఇంకో స్కెచ్‌ వేసింది. భర్త పేరిట ఊర్లో ఉన్న ఎకరం పొలాన్ని ఆయనతో అమ్మించి.. వచ్చిన డబ్బుతో ప్రియుడు రవితో పారిపోవాలనుకుంది. ఇది విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.  

Updated Date - 2022-08-31T09:26:00+05:30 IST