తెలంగాణ శత్రువు మోదీయే!

ABN , First Publish Date - 2022-08-17T08:41:23+05:30 IST

తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ శత్రువు మోదీయే!

కేంద్రంలో ఈ దుర్మార్గుడిని తరిమికొట్టండి

రాష్ట్రాలను గౌరవించే సర్కారును తెచ్చుకుందాం


పేదలను కొట్టి షావుకార్ల జేబులు నింపుతున్నాడు

పాలమూరు-రంగారెడ్డి జాప్యానికి కారణం కేంద్రమే

ఇక్కడి సన్నాసులకు ఢిల్లీలో నిలదీసే దమ్ముందా?

తెలంగాణను తినేందుకు సిద్ధంగా గుంటనక్కలు

అప్రమత్తంగా లేకుంటే ఉచిత కరెంటు ఎత్తేస్తారు: కేసీఆర్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌ షురూ.. మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన


ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ఆశతో విన్నా. వచ్చే రెండేళ్లలోనైనా ఏమైనా చేస్తాడనుకున్నా. గంటసేపు ఊదరగొట్టాడు. నెత్తికో రుమాలు కట్టి వేషం, కథ, డైలాగులు తప్ప.. ఒక్క మంచి మాట అయినా ఉందా దేశానికి?


బీజేపీ జెండాలకు మోసపోతే గోస పడ్తాం. ప్రాణాలర్పించి సాధించుకున్న తెలంగాణను పీక్కొని తినేందుకు గుంట నక్కలు సిద్ధంగా ఉన్నాయి. మళ్లీ పాత తెలంగాణ పరిస్థితికి దిగజారకుండా, వాళ్ల రాజకీయ స్వార్థాలకు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది

- సీఎం కేసీఆర్‌


‘‘14 సంవత్సరాలు పంటి బిగువన, ఒంటి బిగువన పోరాటం చేసినం. చివరికి నేను ఆమరణ దీక్ష చేపట్టి చావు అంచు దాక పోయి, కోమాలోకి పోయేదాక పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. చెయ్యి జారిపోతే చాలా చాలా కష్టం వస్తది. మంది మాటలు నమ్మి ఏదో

అయినట్టు ఉంటది పరిస్థితి’’‘‘రాష్ట్రంలో ఎంత బాగున్నా.. కేంద్రప్రభుత్వం బాగా లేకుంటే ఆశించిన అభివృద్ధి రాదు. దేశ పరిస్థితి దిగజారుతోంది. నిరుద్యోగం పెరుగుతోంది, రూపాయి విలువ పడిపోతోంది. గతంలో ఏనాడూ లేని పరిస్థితులు వస్తున్నాయి. మోదీ సర్కారును ఇంటికి సాగనంపి, రాష్ట్రాల హక్కులను గౌరవించే మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి’’


హైదరాబాద్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దుర్మార్గుడైన మోదీని దేశం నుంచి తరిమికొట్టి అద్భుత భారతదేశాన్ని సృష్టించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లబొల్లి కథలు తప్ప ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదన్నారు. కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 15 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మంగళవారం వికారాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించి, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ప్రధాని ఎర్రకోట ప్రసంగంపై ఎంతో ఆశ పెట్టుకున్నానని, వేషాలు, డైలాగులు తప్ప అందులో ఒక పథకం లేదని ప్రస్తావించారు. దేశ పరిస్థితి దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, రూపాయి విలువ పడిపోతోందని చెప్పారు. గతంలో ఏనాడూ లేని పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే సంస్కరణల పేరు పెట్టి బోర్ల కాడ, ట్రాన్స్‌ఫార్మర్ల కాడ మీటర్లు పెట్టి చివరకు ఉచిత కరెంటు ఎత్తేస్తారని హెచ్చరించారు. రైతులకు శఠగోపం పెట్టి, సామాన్యుల కడుపులు కొట్టి పెద్దపెద్ద సావుకార్ల కడుపు నింపుతారని అన్నారు. ఉచిత కరెంటు కొనసాగాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వేరే జెండాలు చూసి ఆగమైపోతే తెలంగాణ కథ మళ్లీ మొదటికి వస్తుందని హెచ్చరించారు. పెద్ద వాళ్లకు రూ. 20 లక్షల కోట్లను దోచిపెట్టి, పేదవాడికి గ్యాస్‌ సిలిండర్‌ ధర అడ్డగోలుగా పెంచేశారన్నారు. టన్ను రూ. 4 వేలకు వచ్చే సింగరేణి బొగ్గును కాదని, ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి టన్ను రూ.30 వేలకు కొనాలని విద్యుత్‌ సంస్థలను ఒత్తిడి చేస్తున్నారని ప్రస్తావించారు. నిరర్ధక ఆస్తుల పేరుతో కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే బాజాప్తాగా డంకా బజాయించి చెబుతోందన్నారు. 


ఎంత మారిందో గమనించండి
తెలంగాణ రాష్ట్రమే రాకుంటే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా? మెడికల్‌ కాలేజీ వచ్చేదా? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. వ్యవసాయం, పెన్షన్‌, బియ్యం, కరెంటు గతంలో ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకోవాలన్నారు. ‘‘రాష్ట్రమొస్తే భూముల ధరలు తగ్గుతై అన్నరు. కానీ నేడు రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వేరే రాష్ట్రాల్లో ఎకరం అమ్మి ఇక్కడ నాలుగెకరాలు కొనేవారు. ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మి వేరే రాష్ట్రాల్లో మూడు, నాలుగెకరాలు కొంటున్నారు’’ అని ప్రస్తావించారు. ‘‘రాష్ట్రంలో ఉన్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. కర్ణాటక రాయచూరు జిల్లాలోని ప్రజలూ మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి’’ అంటున్నారని చెప్పారు. తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘కేసీఆర్‌ జిందాబాద్‌ అని చప్పట్లు కొట్టడం కాదు. ఇంటికెళ్లి వివేకంతో ఆలోచన చేయాలి. చెయ్యి జారిపోతే చాలా చాలా కష్టం వస్తది’’ అని హెచ్చరించారు. జరిగిన అభివృద్ధి చూసుకుంటూ ఎడ్డోళ్ల లెక్క పళ్లు ఇగిలిచ్చి కూర్చుంటే ఏమవుతది? మొదటికే మోసం వస్తది. నవ్వుడు కాదు నేను చెబుతున్నది ప్రమాదం.. చాలా పెద్ద ప్రమాదం. మీరు ఆలోచన చేయాలి’’ అన్నారు. 

ఒక్క మంచి పని చెప్పండి
తెలంగాణ ఇచ్చే పథకాలను కేంద్ర ప్రభుత్వం ఉచితాలంటూ ఎద్దేవా చేస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘గత ఎనిమిదేళ్లలో బీజేపీ చేసిన ఒక్కటంటే ఒక్క మంచి చెప్పండి’’ అని నిలదీశారు. ఎక్కడైతే సమాజం రాజకీయంగా చైతన్యం లేకుండా, నిద్రావస్థలో ఉంటుందో.. అప్పుడే మనం దోపిడీకి గురవుతామని హెచ్చరించారు. ‘‘సమైక్య పాలకుల కబంద హస్తాలలో విలవిల్లాడి సచ్చిపోయినం. పెరుగన్న తినే రైతులు పురుగు మందులు తాగి సచ్చిపోయిన్రు. వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నరు. మళ్లీ అలాంటి బాధలు రావద్దంటే మనం అప్రమత్తంగా ఉండాలి. చిల్లర మల్లర వెకిలిగాళ్ల నుంచి యువకులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానమంత్రినే అడిగిన ఎనిమిదేళ్లలో మీరు ఎవరికి ఏం చేశారని. చేయకపోగా.. ఉన్న పథకాలు ఆపాలంటున్నరు. ఉచిత విద్యుత్తుకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటున్నరు’’ అని  మండిపడ్డారు. బీజేపీ పాలిత కర్ణాటకలో  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించాలని, ఇక్కడి పథకాలు అక్కడ ఏమైనా ఉన్నాయా చూసి చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అదొక్కటే బాకీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పాలమూరు రంగారెడ్డి పథకం ఒక్కటే బాకీ ఉన్నానని కేసీఆర్‌ చెప్పారు. జిల్లాకు కృష్ణా నది నీళ్లను అందించే బాధ్యత తనదేనన్నారు. ప్రాజెక్టు పని మొదలు పెట్టామని, వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి బీజేపీ వాళ్లే కారణమని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడికో, రాష్ట్ర అధ్యక్షుడికో, ఇంకో సన్యాసికో దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ బస్సుకు అడ్డంగా జెండాలు ఊపే నేతలకు ఢిల్లీలో మోదీని చూడగానే లాగు తడిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లలో వంద దరఖాస్తులు ఇచ్చినా కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటాను కేంద్రం తేల్చలేదన్నారు. మెడకు పెడితే కాలికి, కాలికి పెడితే మెడకు పెట్టి ఇవాళ ప్రధానమంత్రే తెలంగాణకు ప్రధాన శత్రువు అయ్యిండని వ్యాఖ్యానించారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు నీళ్లు పారించి చూపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 

Updated Date - 2022-08-17T08:41:23+05:30 IST