కార్పొరేట్‌ శక్తులతో మోదీ కుమ్మక్కు

ABN , First Publish Date - 2022-09-05T09:40:08+05:30 IST

రంగారెడ్డి అర్బన్‌/షాద్‌నగర్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసేందుకు ప్రజాస్వామ్య, లౌకికవాద పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఏకంకావాలని సీపీఐ జాతీయ ప్రధా

కార్పొరేట్‌ శక్తులతో మోదీ కుమ్మక్కు

బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలి..

కేసీఆర్‌ గట్టిగా పోరాడుతున్నారు.. ఆయనకు మా మద్దతు

రాజ్యాంగాన్ని మార్చేందుకు సంఘ్‌ కుట్ర: డి. రాజా

శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

రంగారెడ్డి అర్బన్‌/షాద్‌నగర్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసేందుకు ప్రజాస్వామ్య, లౌకికవాద పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఏకంకావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.  మోదీ కార్పొరేట్‌ శక్తులతో కుమ్మక్కయ్యారని, బీజేపీ సర్కారు కార్పొరేట్‌ శక్తుల అనుకూల ప్రభుత్వంగా మారిపోయిందని ఆరోపించారు. దేశచరిత్రలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత వినాశకమైనదిగా నిలిచిపోనుందని అభిప్రాయపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సమస్య రోజు రోజుకు పెరుగుతోందని.. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్‌పరం చేసి కార్పొరేట్‌ దిగ్గజాలైన అంబానీ, ఆదానీలకు ప్రధాని మోదీ కట్టబెట్టడమే దీనికి కారణం ఆరోపించారు. సీపీఐ మూడవ రాష్ట్ర మహాసభలను ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆయన ప్రారంభించారు. అక్కడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, ఇందుకు  కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, బిహార్‌, తెలంగాణలోని పార్టీలు బీజేపీపై పోరాడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీని ఓడించేందుకు ఆ పార్టీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గట్టిగా ఎదుర్కొంటున్నారని, ఆయనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలపై  తన సిద్ధాంతాలను బీజేపీ రుద్దుతోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర ధరలు పెరిగిపోయానని..  మోదీ, అమిత్‌షా దేశప్రగతిపై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టుస్తున్నారని విమర్శించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ మత విద్వేశాలను రెచ్చగొట్టడంతో పాటు రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.  తెలంగాణ భూమి తిరుగుబాటుకు నిదర్శనం అని.. నిజాంను తరిమిన గడ్డ అని రాజా పేర్కొన్నారు. సెప్టెంబరు 17 కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌ షా హైదరాబాద్‌ వస్తున్నా, అసలు సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏముంది? అని ప్రశ్నించారు.  

Updated Date - 2022-09-05T09:40:08+05:30 IST