MLC Kavitha: అలుపెరుగని పోరాటమే

ABN , First Publish Date - 2022-12-13T03:40:18+05:30 IST

పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపేవారి మీద కక్ష కట్టి ఇబ్బంది పెట్టేలా దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

MLC Kavitha: అలుపెరుగని పోరాటమే

దర్యాప్తు సంస్థల దాడులకు ఏమాత్రం భయపడను

బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు కక్షసాధింపు

ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది

‘జాగృతి’ని దేశవ్యాప్తం చేస్తాం.. ప్రతి రాష్ట్రం వెళ్తాం

త్వరలో కార్యాచరణ.. ఇకపై విశ్రాంతి తీసుకోను

జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత

ముషీరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపేవారి మీద కక్ష కట్టి ఇబ్బంది పెట్టేలా దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇలాంటివాటికి భయపడేది లేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో విశ్రాంతి తీసుకునే మాటే లేదని పేర్కొన్నారు. ‘ఈ దాడి నా మీద మాత్రమే కాదు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రశ్నించే గొంతుకలన్నిటిపై కేంద్రానిది ఇదే తీరు. దీనివల్ల తెలంగాణ మహిళల కళ్ల నుంచి కన్నీరు కాదు నిప్పులు వస్తాయి’’ అని హెచ్చరించారు.

ముషీరాబాద్‌లో సోమవారం తెలంగాణ జాగృతి విస్తృత స్థాయిసమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ సహా అన్ని రంగాలది తిరోగమనమేనని, గొంతెత్తిన ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కవిత మండిపడ్డారు. ‘‘ఎన్నికలకు ఏడాదిన్నర ఉంది. ప్రజలను ఏకంచేసి సత్తా చాటుదాం. వ్యవస్థలతో దాడులు చేయిస్తూ మన సమయం వృథా చేస్తున్నారు. మిగిలిన ఆ సమయాన్ని శక్తి ఏమిటో చూపేందుకు వాడుకుందాం. అనేక అంశాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రానికి వెళ్లి ప్రజలను జాగృతం చేస్తాం. ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియాను బీజేపీ ప్రైవేట్‌ ఎస్టేట్‌గా మార్చివేసింది. అందుకని భావజాల వ్యాప్తికి జాగృతి వంటి సంస్థలు అవసరం’’ అని కవిత అన్నారు. ‘‘విశ్రాంతి తీసుకునేది లేదు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య రక్షణకు కవులు, రచయితలు, విద్యార్థులు, ఉద్యోగులను ఏకం చేసేందుకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్‌సాగర్‌, వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నవీనచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్‌, ముఠా జైసింహ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు దేవీప్రసాద్‌, డాక్టర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T03:40:31+05:30 IST