హెల్త్‌హబ్‌గా నర్సంపేట

ABN , First Publish Date - 2022-03-05T05:49:12+05:30 IST

హెల్త్‌హబ్‌గా నర్సంపేట

హెల్త్‌హబ్‌గా నర్సంపేట
కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

నర్సంపేట, మార్చి 4 : వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం నర్సంపేటకు రానున్నారని, పట్ణణంలో రూ.66కోట్లతో చేపట్టిన 250 పడకల జిల్లా స్థాయి ఆస్పత్రి భవన నిర్మాణానికి, డయాగ్నోస్టిక్‌హబ్‌, 25 సబ్‌సెంటర్ల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వారం రోజుల పాటు జరిగే మహిళా క్రీడోత్సవాలను మంత్రి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు మంత్రి హరీష్‌రావు పర్యటన వివరాలను పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పెద్ద వెల్లడించారు.

నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్‌ తరహా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 250 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం రూ:66 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఆస్పత్రి భవనంతోపాటు 57రకాల వైద్యపరీక్షలు చేసేందుకు డయాగ్నోస్టిక్‌ హబ్‌ను మంజూరు చేశారన్నారు. ఈ జిల్లా స్థాయి ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు 244 వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో 59 హెల్త్‌ సబ్‌సెంటర్లు ఉండగా, అందులో 25 సబ్‌ సెంటర్లకు భవన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరైనట్లు  తెలిపారు. గతంలో నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ సెంటర్‌ను, రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయించామన్నారు. ఎంపీ నిధులు, ఆరోగ్యశాఖ నిధులతో ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లను అందించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఆస్పత్రి, సబ్‌సెంటర్లు, డయాగ్నస్టిక్‌హబ్‌, తదితర సౌకర్యాలతో నర్సంపేట మెడికల్‌ హబ్‌గా మారనుందని తెలిపారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్నారు. సమావేశంలో ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌, ఆర్‌బీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాయిడి రవీందర్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ మునుగాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్‌ దార్ల రమాదేవి,  సొసైటీ చైర్మెన్‌ మురాల మోహన్‌రెడ్డి. టీఆర్‌ఎప్‌ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌,  డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గుంటి కిషన్‌ మండల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more