గద్దెపైకి చేరిన ముసలమ్మ దేవత

ABN , First Publish Date - 2022-03-18T06:03:37+05:30 IST

గద్దెపైకి చేరిన ముసలమ్మ దేవత

గద్దెపైకి చేరిన ముసలమ్మ దేవత
గుంజేడులో ముసలమ్మ దేవతకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క


 జాతరలో పాల్గొన్న సీతక్క

కొత్తగూడ, మార్చి 17 : భక్తులు కోరిన కోర్కెలు తీర్చేందుకు గుంజేడు ముసలమ్మ దేవత గురువారం గద్దెపైకి చేరింది. దేవాదాయశాఖ అధికారులు, తలపతులు, వడ్డెలు గుంజేడు గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పడిగలతో భ క్తులు వెంట రాగా, శివసత్తుల పూనకాలతో ముసలమ్మ గుట్టపైకి చేరుకున్నారు. గుట్టపై పూజలు చేసి ముసలమ్మ దేవత ప్రతిమను గుడికి తీసుకువచ్చారు. దారిలో భక్తులు, శివసత్తులు అగ్ని గుండాలు దాటుతూ, సాంప్రదాయ నృత్యా లు చేశారు. ఎమ్మెల్యే దనసరి సీతక్క, దేవాదాయ శాఖ డివిజనల్‌ అధికారి నందనం కవిత, ఎంపీపీ బానోత్‌ విజయ రూప్‌సింగ్‌, ఎంపీటీసీ భూర్క పుష్పలత భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. పడిగలతో వేల్పుల గుడి చుట్టు, ముసలమ్మ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి ముసలమ్మ దేవతను గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కార్యక్రమంలో ఈవో భిక్షమాచారి, పూజారులు తోలెం చిన్న నర్సయ్య, వెంకటేశ్వర్లు, వెంకన్న, నవీన్‌, అనంతరావు, అరుణ్‌, శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

 చినజీయర్‌ స్వామి క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే సీతక్క

 మేడారం సమ్మక్క, సారక్క దేవతలపై అనుచిత వాఖ్యలు చేసిన చినజీయ ర్‌ స్వామి సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. కొత్తగూడ మండలం గుంజేడులో ముసలమ్మ దేవాలయ ప్రాంగణంలో సీతక్క మాట్లాడారు. భారతదేశంలో ప్రజలు తమకు నచ్చిన దేవతలను, దేవుళ్లను ఆరాధించే హక్కు భారత రాజ్యంగం కల్పించిందన్నారు. చినజీయర్‌ స్వామి ఆంధ్రకు చెం దిన వ్యక్తి అయిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక మర్యాదలు కల్పించారని విమర్శించారు. అయినా తెలంగాణలో ఎవరు కూడా అడ్డుచెప్పలేదన్నారు. ప్రకృ తి వనంలో వెలసిన సమ్మక్క, సారక్క దేవతలు దైవలోకం నుంచి దిగివచ్చారా ..అని వ్యాఖ్యలు చేసిన చినజీయర్‌ స్వామి ఏమైనా దైవలోకం నుంచి దిగివచ్చారా.. అని ప్రశ్నించారు. చిన్నజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌, మంత్రులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిన జీయర్‌స్వామికి సీఎం, మంత్రులు భయపడుతున్నారా ప్రశ్నించారు.వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు, ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. 

Read more