కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-17T01:50:05+05:30 IST

తెలంగాణలో ఈ వానాకాలంలో కోటి 42 లక్షల ఎకరాలలో సాగుకు సన్నాహాలుచేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఈ వానాకాలంలో కోటి 42 లక్షల ఎకరాలలో సాగుకు సన్నాహాలుచేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి, 50 లక్షల ఎకరాలలో వరి,15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు పండించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారు. ఈ ఏడాది రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.వానాకాలం సాగు ప్రణాళికపై శనివారం మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు, వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించామని మంత్రి తెలిపారు.క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్దం చేయాలని ఆదేశించారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలన్నారు. 


మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలన్నారు.కల్తీలేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీని నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు.రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దంగా ఉంచాలన్నారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.రష్యా - ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అన్ని ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన  కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. 


పంటల ప్రణాళికపై జిల్లాల వారీగా ఏఈఓలకు శిక్షణ కల్పించాలని, ఆయిల్ పామ్ సాగు కోసం వ్యవసాయ - ఉద్యాన అధికారులు సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలని అన్నారు. దీని కోసం వ్యవసాయ - ఉద్యాన అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సూచించారు. రైతువేదికలను అవగాహన కోసం విరివిగా ఉపయోగించుకోవాలని, రైతుబంధు సమితులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి , విత్తనసంస్థ ఎండీ కేశవులు, మార్క్ ఫెడ్ ఎండీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-17T01:50:05+05:30 IST