బీజేపీవి వాతలు, కోతలే..

ABN , First Publish Date - 2022-02-17T08:56:48+05:30 IST

కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వాతలు, కోతలు తప్ప పాలన చేతకాదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బుల్డోజర్లతో తొక్కించడం తప్ప ఏమీ తెలియదని..

బీజేపీవి వాతలు, కోతలే..

  • ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత ఎరువులు, పెట్రోలు ధరలు పెంచేస్తారు
  • బుల్డోజర్లతో తొక్కించడం తప్ప వారికి ఏమీ చేతకాదు
  • టీఆర్‌ఎస్‌ది చేతల ప్రభుత్వం: మంత్రి హరీశ్‌ రావు 


జోగిపేట (సంగారెడ్డి), ఫిబ్రవరి 16:  కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వాతలు, కోతలు తప్ప పాలన చేతకాదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బుల్డోజర్లతో తొక్కించడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత ఎరువులు, పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం మళ్లీ పెంచుతుందన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల సర్కారని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బుధవారం నిర్వహించిన ఓ సమావేశంలో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు, నిరుపేదలకు అందించే సాయం విషయంలో ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం భారీగా కోతలు పెట్టిందని మంత్రి ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకానికి ఇచ్చే నిధుల్లో రూ.25 వేల కోట్లు, ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐకి ఇచ్చే సబ్సిడీలో రూ.65 వేల కోట్లు, ఎరువులపై ఇచ్చే సబ్సిడీలో రూ.34,900 కోట్లు కోత విధించారన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఏటా ఇచ్చే 4 శాతంలో అరశాతం తగ్గించారని, ఆ అరశాతం విలువ రూ.5 వేల కోట్లని హరీశ్‌ వివరించారు. కరోనాతో రెండేళ్లు ఇబ్బంది పడ్డామని, నిధులిచ్చి ఆదుకోవాల్సిన ఈ సమయంలో కేంద్రం కోతలు విధించడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎంలోని అరశాతం కావాలంటే, తాము చెప్పినట్లు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని వెల్లడించారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయనని, బావులకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారని హరీశ్‌ వివరించారు రాష్ట్ర సంపదను పెంచిన కేసీఆర్‌ దానిని రైతులు, పేదలు, కూలీలకు పంచుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలకిచ్చే వాటాలపై ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్‌ భాష బాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడి,్డ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అనడం తగదన్నారు. కేసీఆర్‌ భాష బాగానే ఉందని, బీజేపీ ప్రభుత్వ పనితీరు, విధానాలే బాలేదని హరీశ్‌ ఎద్దేవా చేశారు. 

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో 1.61 లక్షల ఎకరాలకు సాగునీరు...

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోలు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లోని 1.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. రూ.4 వేల కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటిని తరలించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, అందోలు, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మదన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more