చీకోటి ఫామ్‌హౌజ్‌.. మినీ జూపార్కు!

ABN , First Publish Date - 2022-07-30T09:44:05+05:30 IST

చీకోటి ఫామ్‌హౌజ్‌.. మినీ జూపార్కు!

చీకోటి ఫామ్‌హౌజ్‌.. మినీ జూపార్కు!

12 ఎకరాల్లో 24 రకాల పక్షలు, జంతువులు, పాముల్ని చూసి అవాక్కైన అటవీ అధికారులు

ఇది వన్యప్రాణి సంరక్షణ చట్ట ఉల్లంఘనే


హైదరాబాద్‌, కందుకూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఓ పక్క ఆఫ్రికాలో కనిపించే అరుదైన చిలకలు.. మరోపక్క అంతకన్నా అరుదైన పాములు.. ఉడుములు, ఊసరవెల్లులు.. ఒకటా రెండా 24 రకాల పక్షులు, జంతువులు! ఇదేదో జూపార్క్‌ గురించిన వర్ణన కాదు. క్యాసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్‌ ఫామ్‌హౌజ్‌లో కనిపించే జీవాలివన్నీ. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గూడలో చీకోటికి 12 ఎకరాల ఫామ్‌హౌజ్‌ ఉంది. శుక్రవారం అక్కడ తనిఖీలు నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఆ జీవాలను చూసి అవాక్కయ్యారు. వాటిన్నిటినీ అతడు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాల నుంచి రప్పించినట్టు సమాచారం. వాస్తవానికి.. చీకోటి ఫామ్‌హౌజ్‌లో ఉన్న ఈ జీవాల గురించి చాలాకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. చీకోటి స్వయంగా ఊసరవెల్లులతో దిగిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. అయినా అటవీ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.


చూసీ చూడనట్టు ఊరకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా హడావుడిగా రంగంలోకి దిగి మూడు గంటలపాటు తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న విదేశీ పక్షులు, పాములు, జంతువుల గురించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. వన్యప్రాణుల పెంపకానికి సంబంధించి గతంలోనే చీకోటి అనుమతులు తీసుకున్నాడని.. అయితే, అనుమతి లేని జీవాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామని, శనివారంనాటికి తమ విచారణ పూర్తవుతుందని తెలిపారు. కాగా.. అతడి వద్ద చాలా జీవాలు అనధికారికంగా ఉన్నాయని, వాటికి సంబంధించి పక్కాగా కేసులు నమోదు చేస్తే అతడికి ఏడేళ్ల జైలు శిక్ష ఖాయమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చీకోటికి చిన్నప్పటి నుంచీ జంతువులంటే చాలా ఇష్టమని అతడి సన్నిహితులు, బంధువులు చెబుతున్నారు. చీకోటి చిన్నవయసులో ఒకసారి ఇంటివద్దకు ఎలుగుబంటిని ఆడిస్తూ అడుక్కునే వ్యక్తి వస్తే.. ఆ ఎలుగుబంటి కావాలని మారాం చేశాడని, దీంతో అతడి తండ్రి డబ్బులిచ్చి రెండురోజులపాటు ఆ ఎలుగుబంటిని ఇంటివద్దే కట్టేశాడని వారు వెల్లడించారు.  ఆ ప్రేమతోనే ఫామ్‌హౌజ్‌లో జంతువులను పెంచుతున్నాడని వారు వివరించారు.

Read more