పెద్దవూరకు వెయ్యేళ్ల చరిత్ర

ABN , First Publish Date - 2022-06-27T09:27:23+05:30 IST

నల్లగొండ జిల్లాలోని పెద్దవూరకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు...

పెద్దవూరకు వెయ్యేళ్ల చరిత్ర

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి


పెద్దవూర, జూన్‌ 26: నల్లగొండ జిల్లాలోని పెద్దవూరకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దవూర ఆంజనేయస్వామి ఆలయంలోని చాళుక్యుల కాలం నాటి శిల్పాలను ఆయన గుర్తించారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. శివాలయం లోని శివలింగం, నంది, సూర్య, వీరభద్ర, గణేశ్‌ శిల్పాలు చాళుక్యుల కాలానికి(క్రీశ 8వ శతాబ్దం) చెందినవన్నారు. ఆంజనేయస్వామి ఆలయ అర్ధమండప స్తంభాలు క్రీ.శ 9వ శతాబ్ది కాలం నాటి రాష్ట్రకూటుల వాస్తు శిల్పానికి అద్దం పడుతున్నాయని తెలిపారు. శివాలయ గర్భాలయం వెనుక గోడకు బిగించిన సూర్య విగ్రహం కూడా ఇదే కాలానికి చెందినదన్నారు. ఆలయానికి ఎడమవైపు ఉన్న శిలపై ఉన్న ఆంజనేయస్వామి శిల్పం, ఆలయం ముందు నిలబెట్టిన దీపస్తంభం, ఆవరణలో ఈశాన్యంలో నేలపై ఉంచిన వేణుగోపాలస్వామి విగ్రహాలు క్రీ.శ.16వ శతాబ్దం విజయనగర శిల్పకళకు ప్రతీకలని, ఆలయం బయట రోలుపై అస్పష్ట శాసనం ఉందని తెలిపారు.  

Updated Date - 2022-06-27T09:27:23+05:30 IST