మెట్టుగుట్ట గుడి నిధులు మళ్లింపు
ABN , First Publish Date - 2022-01-10T08:33:25+05:30 IST
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని ప్రసిద్ధ మెట్టుగుట్ట ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తోందా..? ఆలయ భూముల ద్వారా వచ్చిన..
సొంత నియోజకవర్గంలో మహాపోచమ్మ ఆలయ అభివృద్ధికి కేటాయిస్తూ దేవాదాయ మంత్రి ఆదేశాలు
రైల్వే వ్యాగన్ పరిశ్రమ కోసం మెట్టుగుట్ట ఆలయ భూములను రూ. 27 కోట్లకు విక్రయించిన సర్కారు
ఆదాయంలో రూ.10 కోట్లే వెనక్కి జమ
మరో రూ.17 కోట్లు పెండింగ్‌లోనే
మెట్టుగుట్ట పరిరక్షణ కమిటీ ఆందోళన
ఓరుగల్లు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని ప్రసిద్ధ మెట్టుగుట్ట ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తోందా..? ఆలయ భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ శాఖ మంత్రివర్యులే దారి మళ్లించి, తన నియోజకవర్గంలో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తుండటం తో ఇప్పుడివే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు కోసం మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ భూములను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కొనుగోలు చేసి రైల్వేశాఖకు అప్పగించింది. తద్వారా సమకూరిన ఆదాయంలో రూ.6.60కోట్లను తన నియోజకవర్గం నిర్మల్‌లోని ఆడెల్లిలో శ్రీమహాపోచమ్మ దేవాలయ నిర్మా ణం కోసం మళ్లించాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏటా రూ.20లక్షల్ని మహాపోచమ్మ ఆలయం నుంచి వడ్డీలేకుండా మెట్టుగుట్ట ఆలయానికి తిరిగి చెల్లిస్తామని ఆ ఆలయ కమిటీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో మెట్టుగుట్ట ఆలయ అధికారులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో స్థానిక నేతలు, భక్తులు, ప్రజలు మెట్టుగుట్ట పరిరక్షణ కమిటీ జేఏసీగా ఏర్పడి నిధులు మళ్లింపునకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. తాత్కాలికంగా వెనక్కి తగ్గిన మంత్రి.. మరోసారి అధికారుల ద్వారా నిధుల మళ్లింపునకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
నిధులపై కన్ను
శ్రీరామలింగేశ్వర ఆలయానికి గతంలో వేలాది ఎకరాల మేర భూములు ఉండేవని తెలుస్తోంది. కాలక్రమంలో ఇవన్నీ అన్యాక్రాంతమై, చివరకు 300 ఎకరాలు మిగిలాయి. వీటి నుంచే రైల్వే వ్యాగన్ పరిశ్రమ కోసం 106 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ. 27కోట్లు కాగా, ఇందులో కేవలం రూ. 10కోట్లను మాత్రమే ఆలయానికి చెల్లించారు. ఇంకా రూ. 17కోట్లు ఆలయ ఖజానాకు రావాల్సి ఉంది.
శివకేశవ అభేద్యం.. మెట్టుగుట్ట ఆలయం
చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఆలయం మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయం. శివ, కేశవ అభేదాన్ని సూచించేలా.. హరిహరులిద్దరూ కొలువైన పుణ్యస్థలం. రామాయణ, మహాభారత గాథల్లో దీని ప్రస్తావన ఉందని పండితులు చెబుతారు. 55 ఎకరాల విస్తీర్ణంలో ని ఈ ఆలయంలోనే అభినవ పోతనగా చెప్పే వానమామలై వరదాచార్యులు 1925లో 40 రోజుల పాటు వాగీశ్వరి మంత్రోపాసన చేసి, పోతన చరిత్రను కావ్యంగా రాశారంటారు. గుట్టపై మహాశివరాత్రి, శివపార్వతుల కల్యాణం, సీతారామకళ్యాణ రథోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. అయితే.. నిధులకు కటకటగా మారడంతో ఆలయం అభివృద్ధికి దూరంగా మిగిలిపోయింది.
ఏ గుడి నుంచైనా మరో గుడికి నిధులు బదిలీ చేయొచ్చు
ఏ ఆలయం నుంచైనా మరో ఆలయానికి నిధులు బదిలీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అవసరం ఉన్న ఆలయానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేవాదాయ శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వాటిని వాడుకునే అవకాశం ఉండదు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి ఇప్పటి వరకైతే ఒక్క పైసా కూడా ఎక్కడికీ బదిలీ చేయలేదు.
- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
